Zee Telugu Sankranthi: జీ తెలుగులో మూడు రోజులు పండుగే.. బ్లాక్‌బస్టర్ మూవీ.. సంక్రాంతి సంబరాలు
Zee Telugu Sankranthi: జీ తెలుగులో మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగబోతున్నాయి. బ్లాక్‌బస్టర్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తోపాటు ఇతర పండుగ ప్రత్యేక షోలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. మరి ఆ విశేషాలేంటో చూడండి.
Zee Telugu Sankranthi: సంక్రాంతి వస్తుందంటే ఊరంతా పండుగే. ఎక్కడ చూసినా సందడే. థియేటర్లలో కొత్త సినిమాలు, ఊళ్లలో కోళ్ల పందేలు, టీవీల్లో స్పెషల్ షోలు కామనే. ఈసారి కూడా జీ తెలుగు ఛానెల్ మూడు రోజుల పాటు పండుగ విందు భోజనం అందించబోతోంది. జనవరి 11, 12, 13 తేదీల్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. వీటిలో కల్కి 2898 ఏడీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కూడా ఉండనుండటం విశేషం.
జీ తెలుగు సంక్రాంతి సంబరాలు
జీ తెలుగు ఛానెల్ సంక్రాంతి కోసం ప్రత్యేకమైన షోలు ప్రసారం చేయనుంది. అందులో భాగంగా శనివారం అంటే జనవరి 11న కాకినాడలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు వస్తున్నాం స్పెషల్ ఈవెంట్ ప్రసారం కానుంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీమ్ తో ఏర్పాటు చేసిన ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్ ను ఆరోజు సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు. వెంకటేశ్, అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, రాజేంద్ర ప్రసాద్, గౌతమిలాంటి వాళ్లంతా ఈ ఈవెంట్ లో సందడి చేశారు. ఈ ఈవెంట్ ప్రసారంతోనే అసలు సంక్రాంతి ప్రారంభం కానుంది.
ఇక మరుసటి రోజు అంటే ఆదివారం (జనవరి 12) గతేడాది వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 ఏడీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జీ తెలుగులో ఉండనుంది. ఆరోజు సాయంత్రం 5.30 గంటలకు ఈ మూవీ టెలికాస్ట్ కానుంది. గతేడాది రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. మొత్తానికి ఏడు నెలల తర్వాత టీవీలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
ఫైర్ వర్సెస్ వైల్డ్ ఫైర్
జీ తెలుగు మూడో రోజు సంక్రాంతి సంబరాలు కూడా సోమవారం (జనవరి 13) కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఆరోజు మధ్యాహ్నం 12 గంటలకు సంక్రాంతి సంబరాలు ఫైర్ వర్సెస్ వైల్డ్ ఫైర్ షో టెలికాస్ట్ చేయనున్నారు. ఈ ఈవెంట్లో సీనియర్ హీరోయిన్ రాధ, బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి, ప్రదీప్ మాచిరాజు ఎంటర్టైన్ చేయబోతున్నారు.
మన్మథుడు మూవీ ఫేమ్ అన్షు, ఎస్‌జే సూర్యలాంటి వాళ్లు కూడా ఇందులో కనిపించనున్నారు. మొత్తానికి సంక్రాంతికి ముందే మూడు రోజుల పాటు జీ తెలుగు పండుగ సంబరాలను తమ ఛానెల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.