Zee Telugu New Serial: జీ తెలుగులో సరికొత్త సీరియల్ నిండు నూరేళ్ల సావాసం.. ఎప్పటి నుంచి అంటే..
Zee Telugu New Serial: జీ తెలుగులో సరికొత్త సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ప్రారంభం కాబోతోంది. ఆగస్ట్ 14 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ సాయంత్రం 7 గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది.
Zee Telugu New Serial: తెలుగులోని టాప్ సీరియల్స్ లో జీ తెలుగుకు సంబంధించిన సీరియల్స్ కూడా ఎప్పుడూ ముందే ఉంటాయి. స్టార్ మాతో పోటీ పడుతూ మంచి వినోదాత్మక సీరియల్స్ ను ఈ ఛానెల్ అందిస్తోంది. ఈ ఛానెల్లో ఇప్పుడు మరో కొత్త సీరియల్ ప్రారంభం కాబోతోంది. ఆ సీరియల్ పేరు నిండు నూరేళ్ల సావాసం.
ఓ సైనికుడి జీవితంలో ఊహించని మలుపులతో సాగే కథ ‘నిండు నూరేళ్ల సావాసం’. ఈ సీరియల్ ఆగస్ట్ 14 నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు రాత్రి 7 గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది. ఇండియన్ ఆర్మీ మేజర్ అమరేంద్ర వర్మ (రిచర్డ్ జోస్), అతని నలుగురు పిల్లల చుట్టూ సాగే కథ 'నిండు నూరేళ్ల సావాసం'.
అతని భార్య అరుంధతి (పల్లవి గౌడ) మరణం తరువాత మేజర్ అమర్ ఒంటరివాడైపోతాడు. పిల్లలతో సహా కొడైకెనాల్ నుండి సికింద్రాబాదుకు చేరిన అమర్, స్నేహితురాలు మనోహరి (మహేశ్వరి) సాయంతో పిల్లల్ని చూసుకుంటాడు. కానీ అరుంధతి మాత్రం తన పిల్లల్ని చూసుకోవడానికి సరైన వ్యక్తి మనోహరి కాదని నమ్ముతుంది. అందుకే ఆత్మగా ఆ ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని కనిపెట్టుకుంటుంది.
అమర్ జీవితంలోకి ఊహించని విధంగా వచ్చి చేరుతుంది RJ భాగమతి (నిసర్గ గౌడ). తన పిల్లలను చూసుకోవడానికి భాగమతే సరైన వ్యక్తి అని అరుధంతి ఎందుకు నమ్ముతుంది? భాగమతి పిల్లలకి ఎలా దగ్గరవుతుంది? భర్త, పిల్లలకు కనిపించని అరుంధతి ఆత్మ భాగమతికి మాత్రమే ఎందుకు కనిపిస్తుందో తెలియాలంటే నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ని ప్రతిరోజు తప్పకుండా చూడాల్సిందే.
అద్భుతమైన తారాగణం, ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న 'నిండు నూరేళ్ల సావాసం' తప్పకుండా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. తల్లిదండ్రులు లేదా భాగస్వామిని కోల్పోవడం వల్ల ఎదుర్కొనే బాధ, బాధ్యతలు, అవధుల్లేని తల్లిప్రేమ.. వంటి భావోద్వేగ అంశాలతో అల్లుకున్న ఈ కథ తప్పకుండా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది.
జీ తెలుగు సూపర్‌హిట్ సీరియల్ ‘పసుపు కుంకుమ’ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి పల్లవి గౌడ. చిన్న గ్యాప్ తరువాత ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించబోతున్న పల్లవి మాట్లాడుతూ, ‘ జీ తెలుగులో 'నిండు నూరెళ్ల సావాసం’ అనే కొత్త సీరియల్ ద్వారా మరోసారి మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది.
ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాదు, ఇందులో నా పాత్ర ఇంతకముందు నేను పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నిజానికి తెలుగు బుల్లితెరపై ఇంతవరకు ఇలాంటి పాత్రను ఎవరూ పోషించలేదు. ఎప్పటిలానే తెలుగు ప్రేక్షకులు ఈ సీరియల్‌కి కూడా తమ ప్రేమ, మద్దతు అందిస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు.
సంబంధిత కథనం