Zee Telugu Drama Juniors Season 8 Premiere Date And Judges: తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలని అందిస్తూ వినోదం పంచుతున్న ఛానల్ జీ తెలుగు. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీస్తూ ప్రేక్షకాదరణతో విజయవంతంగా 7 సీజన్లు పూర్తి చేసుకున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ 8 త్వరలో ప్రారంభించనుంది.
సంవత్సరాల నుంచి ప్రేక్షకులు హృదయాలను గెలుచుకున్న డ్రామా జూనియర్స్ 8వ సీజన్‌తో మరోసారి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని పిల్లల్లో దాగున్న నటనా ప్రతిభను వెలికి తీసే ఉద్దేశ్యంతో ఈ కొత్త సీజన్‌ని ప్రారంభిస్తోంది జీ తెలుగు. ఈ షోను ఎవర్ గ్రీన్ ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ హోస్ట్ చేయనున్నారు.
పిల్లల స్కిట్లకీ, సుడిగాలి సుధీర్ కామెడీ పంచులు, టైమింగ్ తోడైతే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం అని జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 8 నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిభ గల చిన్నారులను మరింత ప్రోత్సహించి వారిని ఆశీర్వదించేందుకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, నటి రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.
వరుస హిట్ సినిమాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా రాణిస్తున్న అనిల్ రావిపూడి జీ తెలుగు డ్రామా జూనియర్స్ 8 షో ద్వారా బుల్లితెరపై మొదటిసారిగా న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. అలాగే, చిన్నారుల బంగారు భవిష్యత్తుకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఇది వరకు పలు టీవీ షోలకు సీనియర్ హీరోయిన్ రోజా న్యాయనిర్ణేతగా చేసిన విషయం తెలిసిందే.
అయితే, అనిల్ రావిపూడి, రోజా ఇద్దరు కలిసి జడ్జ్‌లుగా వ్యవహరించడం ఇదే తొలిసారి. దీంతో జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 8కి డిఫరెంట్ కాంబినేషన్‌లో జడ్జ్‌లు ఉండనున్నారు. ఇక, డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథులుగా ప్రముఖ నటులు జగపతి బాబు, ఆమని హాజరై చిన్నారుల్లో మరింత ఉత్సాహం నింపనున్నారు.
వీళ్ల నటనా ప్రతిభ కనబరిచే అద్భుతమైన ప్రదర్శనలు, సరదా సంభాషణలతో డ్రామా జూనియర్స్ సీజన్ 8 ఘనంగా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 12న జీ తెలుగులో డ్రామా జూనియర్స్ సీజన్ 8 ప్రారంభం కానుంది. ఆ నుంచి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో డ్రామా జూనియర్స్ సీజన్ 8 ప్రసారం కానుంది.
ఇక, ఈ సీజన్‌లో పాల్గొనే చిన్నారులు రెండు జట్లు బాయ్స్ టీమ్, గర్ల్స్ టీమ్‌గా తలపడనున్నారు. గర్ల్స్ టీమ్‌కి యాంకర్ లాస్య, బాయ్స్ టీమ్‌కి త్రినయని సీరియల్‌తో జీ తెలుగు ప్రేక్షకులను అలరించిన నయని మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు.
మెంటర్ల సారథ్యంలో అలరించే స్కిట్స్‌తో అంతులేని వినోదం పంచే ఈ కార్యక్రమాన్ని జీ తెలుగు వేదికగా ప్రతి శనివారం తప్పకుండా చూడమంటూ నిర్వాహకులు అనౌన్స్ చేశారు. కాగా ఇటీవలే అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. మెగాస్టార్ చిరంజీవితో మెగా157 మూవీకి దర్శకత్వం వహించనున్నారు.
సంబంధిత కథనం