Pottel Review: డిఫరెంట్ ప్రమోషన్స్‌తో గత కొన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్న పొట్టేల్ మూవీ ఈ శుక్రవారం (అక్టోబర్ 25న) థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. యువచంద్ర, అనన్య నాగళ్ల జంటగా నటించిన ఈ మూవీకి సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించాడు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
గుర్రంగట్టు గ్రామానికి చిన్న పటేల్ (అజయ్) చెప్పిందే వేదం. ఊరి గ్రామదేవత బాలమ్మ తనకు పూనుతున్నట్లుగా నటిస్తూ అందరిని చెప్పుచేతుల్లో పెట్టుకుంటాడు. బాలమ్మ దేవతకు పుష్కరానికి ఓ సారి జాతర జరుగుతుంది. ఆ జాతరలో పొట్టేలును బలివ్వడం ఆనవాయితీగా వస్తుంటుంది.
జాతరలో బలిచ్చే పొట్టేలు పెంపకం బాధ్యత గంగాధరి (యువచంద్ర) తీసుకుంటాడు. చిన్న పటేల్ చేసే అక్రమాలను ఎదురించేక్రమంలో గంగాధరి జీవితంలోకి బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) వస్తుంది. పెద్దలను ఎదురించి ఆమెను పెళ్లిచేసుకుంటాడు గంగాధరి.
తక్కువ కులం వారిని చదువుకోనివ్వకుండా పటేల్ అడ్డంకులు సృష్టిస్తుంటాడు. పటేల్‌తోపాటు ఊరివాళ్లకు తెలియకుండా తన కూతురు సరస్వతిని చదివిస్తుంటాడు గంగాధరి.
కూతురిని గంగాధరి చదివిస్తోన్న విషయం పటేల్‌కు తెలుస్తుంది. అతడిపై పగతో బాలమ్మకు బలిచ్చే పొట్టేల్‌ను గంగాధరి దగ్గర నుంచి మాయం చేస్తాడు. పటేల్ చేసిన కుట్ర వల్ల ఊరిప్రజల ముందు గంగాధరి దోషిగా మారాల్సివస్తుంది. మాయమైన పొట్టేల్‌ను జాతర టైమ్‌లోగా వెతికి తీసుకురావాలని గంగాధరిని ఊరినుంచి వెలివేస్తారు. మాయమైన పొట్టేల్ గంగాధరికి దొరికిందా?
గంగాధరి కూతురిని చంపాలని చిన్న పటేల్ ఎందుకు అనుకున్నాడు? ఈ జర్నీలో గంగాధరికి భార్య బుజ్జమ్మ ఎలా అండగా నిలిచింది?పటేల్‌కు బాలమ్మ పూనదనే విషయం గంగాధరి చెప్పిన ఊరివాళ్లు నమ్మకపోవడానికి కారణం ఏమిటి?
తన కూతురిని చదివించాలని గంగాధరి ఎందుకు అనుకున్నాడు? పటేల్ వ్యతిరేకంగా సాగిన పోరాటంలో చివరకు గంగాధరివైపు ఊరివాళ్లు వచ్చారా? లేదా? అన్నదే పొట్టేల్ మూవీ కథ.
ప్రస్తుతం పీరియాడికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. 1980, 90ల కాలం కథలను చెబుతూ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు దర్శకులు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఆనాటి కాలాన్ని, సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా తమ కథల్లో ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తోన్నారు.
పొట్టేల్ కూడా అలాంటి ఓ కథే. 1970-80 దశకంలో తెలంగాణలోని పల్లెటూళ్లలో పటేల్ వ్యవస్థ ఎలా ఉండేది. అట్టడుగు వర్గాల ప్రజలను బానిసలుగా మార్చుతూ పటేళ్లు ఎలాంటి అన్యాయాలు సాగించారు? చదువు లాంటి కనీసం అవసరాలకు వారిని ఎలా దూరం చేశారనే అంశాలతో దర్శకుడు సాహిత్ మోత్కూరి పొట్టేల్ మూవీని తెరకెక్కించాడు.
ఈ సామాజిక కట్టుబాట్ల నడుమ తన కూతురిని చదివించేందుకు ఓ తండ్రి ఎలాంటి పోరాటం సాగించాడు? ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సంఘర్షణతో చివరి వరకు ఎమోషనల్‌గా ఈ మూవీని నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ మెసేజ్‌కు అంతర్లీనంగా దైవభక్తిని టచ్ చేయడంలో పాటు లవ్‌స్టోరీ, యాక్షన్ అంశాలతో తాను అనుకున్న కథను చెప్పాడు.
సినిమా మొత్తం కంప్లీట్‌గా రా అండ్ రస్టిక్‌గా సాగుతుంది. నేటివిటీతో పాటు యాక్టర్స్ లుక్, యాస, భాషలతో ఆనాటి కాలాన్ని రీక్రియేట్ చేయడంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడు. గంగాధరి, బుజ్జమ్మ లవ్‌స్టోరీ నాచురల్‌గా నడిపించిన తీరు బాగుంది.
పొట్టేల్ దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా చెప్పిన విధానంలోనే కొన్ని లోపాలున్నాయి. చాలా చోట్ల దర్శకుడు లాజిక్‌లను వదిలేస్తూ వెళ్లిపోయాడు. హీరో విలన్ పోరాటంలోని సంఘర్షణ అంతగా పండలేదు. పటేల్‌ను హీరో ఎదురించే సీన్స్‌లో హై మూవ్‌మెంట్స్ వచ్చినా వాటిని ఉపయోగించుకోలేకపోయాడు. కథాగమనం నిదానంగా సాగడం కూడా మైనస్‌గా మారింది.
గంగాధరి పాత్రకు యువచంద్ర న్యాయం చేశాడు. అతడి లుక్ బాగా కుదిరింది. యాక్టింగ్‌లో ఓకే అనిపించాడు. బుజమ్మ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది అనన్య నాగళ్ల. యాక్టింగ్‌లోనూ అదరగొట్టింది. అజయ్‌లోని విలనిజాన్ని పూర్తిస్థాయిలో చూపించిన మూవీ ఇది. చాలా రోజుల తర్వాత అతడికో మంచి పాత్ర దొరికింది. ఛత్రపతి శేఖర్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ పర్వాలేదనిపించారు. శేఖర్ చంద్ర బీజీఎమ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
పొట్టేల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నమైన ప్రయత్నం. రా అండ్ రస్టిక్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్‌ను పొట్టేల్ మెప్పిస్తుంది.
రేటింగ్: 3/5
టాపిక్