తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు.. కొన్నేళ్లుగా అప్పుడప్పుడు హీరోగానూ సినిమాలు చేస్తున్నారు. ఓవైపు కమెడియన్‍గా ఫుల్ బిజీగా వరుస సినిమాల్లో నటిస్తున్న ఆయన.. కొన్ని చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది కూడా యోగి బాబు మెయిన్ రోల్‍లో ‘బూమర్ అంకుల్’ సినిమా వచ్చింది. మార్చి 29వ తేదీన తమిళంలో థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి రానుంది. బూమర్ అంకుల్ తెలుగు ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైంది.
బూమర్ అంకుల్ సినిమా తెలుగులో జూలై 20వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ విషయంపై ఆహా అధికారికంగా ప్రకటన చేసింది. ఇప్పటికే ఆహా తమిళ్ ప్లాట్‍ఫామ్‍లో తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇప్పుడు తెలుగు డబ్బింగ్‍తో జూలై 20వ తేదీన బూమర్ అంకుల్ చిత్రాన్ని ఆహా తీసుకొస్తోంది.
ఫన్నీ బూమర్ అంకుల్ గట్టిగా నవ్విస్తాడంటూ స్ట్రీమింగ్ డేట్ గురించి ఆహా నేడు (జూలై 16) ట్వీట్ చేసింది. జూలై 20వ తేదీన ప్రీమియర్ అవుతుందని వెల్లడించింది.
బూమర్ అంకుల్ చిత్రంలో యోగిబాబు, ఒలివా ప్రధాన పాత్రలు పోషించారు. రోబో శంకర్, సబా శేషు, తంగ దురై, బాలా, సతీశ్ మోహన్, ఎంఎస్ భాస్కర్, సోనా హైదర్ కీలకపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి స్వదేశ్ ఎంఎస్ దర్శకత్వం వహించారు. విడాకులు ఇవ్వాలనునే భర్తపై భార్య పగతీర్చుకోవాలని అనుకోవడం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది.
బూమర్ అంకుల్ చిత్రాన్ని అంకా మీడియా పతాకంపై అన్బు, కార్తీక్ కే తలై నిర్మించగా.. ధర్మ ప్రకాశ్, సంతన్ అనబజేగానే సంగీతం అందించారు. సుభాష్ ధన్‍భదానీ సినిమాటోగ్రఫీ చేశారు. కాగా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులను కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఫారినర్ అయిన తన భార్య ఇమీకి విడాకులు ఇవ్వాలని బూమర్ నీసమ్ (యోగిబాబు) నిర్ణయించుకుంటాడు. అయితే ఇందుకోసం ఇమీ ఓ షరతు పెడతారు. అతడి సొంత ఊరికి తీసుకెళ్లి ఒక రోజు వారి ఇంట్లో ఉండాలనుకుంటున్నానని నీసమ్‍ను ఇమీ అడుగుతారు. దీనికి నీసమ్ అంగీకరిస్తాడు. ఇమీని తమ సొంత ఇంటికి తీసుకెళతాడు. ఇదే అదునుగా నీసమ్‍పై తమ పగను తీర్చుకునేందుకు మాజీ స్నేహితులు దావూద్ (శేషు), బిల్లా (బాలా), వల్లరసు (తంగ దురై) నిర్ణయించుకుంటారు. అయితే, ఇమీ అక్కడి రావడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని నీసమ్ గుర్తిస్తాడు. ఇమీ వల్ల నీసమ్ చిక్కుల్లో పడినప్పుడు పగ తీర్చుకోవాలనుకున్న స్నేహితులే అతడికి సాయం చేస్తారు. అసలు ఇమీ ప్లాన్ ఏంటి? ఎందుకు అతడి పాత ఇంటికి రావాలని అనుకుంది? నీసమ్ ఎలా ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు బూమర్ అంకుల్ సినిమాలో సమాధానాలు ఉంటాయి.
బూమర్ అంకుల్ చిత్రం స్టోరీ బాగానే ఉన్నా.. కథనం విషయంలోనే నిరాశ పరిచిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కామెడీ కూడా ఆశించిన స్థాయిలో పండలేదనే టాక్ వచ్చింది. అయితే, యోగిబాబు తన మార్క్ టైమింగ్‍తో మరోసారి మంచి పర్ఫార్మెన్స్ చేశారు.