Yatra 2 Update: యాత్ర 2లో సోనియా గాంధీ పాత్ర పోషిస్తున్న ఈ విదేశీ నటి ఎవరో తెలుసా?
Yatra 2 Update: యాత్ర 2 మూవీలో సోనియా గాంధీ పాత్రను జర్మనీకి చెందిన నటి పోషిస్తుండటం విశేషం. తాజాగా మేకర్స్ మంగళవారం (నవంబర్ 7) ఆ పాత్ర లుక్ ను రిలీజ్ చేశారు.
Yatra 2 Update: ఏపీ మాజీ సీఎం, దివంగత రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర 2 మూవీలో సోనియా గాంధీ పాత్రధారి పోస్టర్ ను మంగళవారం (నవంబర్ 7) మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే యాత్ర పేరుతో తొలి పార్ట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడదే మూవీకి సీక్వెల్ వస్తోంది. ఇందులో వైఎస్ పాత్రను మలయాళ నటుడు మమ్ముట్టి, జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళ నటుడు జీవా పోషిస్తున్నారు.
ఇక వీళ్ల జీవితాల్లో ముఖ్య భాగమైన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా యాత్ర 2లో కనిపించనున్నారు. ఆమె పాత్రను ఈ సినిమాలో జర్మనీకి చెందిన నటి సుజానె బెర్నెర్ట్ పోషిస్తోంది. ఆమెకు సంబంధించిన పోస్టర్ నే మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ యాత్ర 2 సినిమాను మహి వీ రాఘవ్ డైరెక్ట్ చేస్తుండగా.. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యులాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఎవరీ సుజానె?
యాత్ర 2 మూవీ కోసం సోనియా గాంధీ పాత్రకు అచ్చుగుద్దినట్లు సరిపోయిన నటి సుజానె బెర్నెర్ట్. ఈమె జర్మనీకి చెందిన నటి. అయితే ఇప్పటికే ఆమె పలు యాడ్స్ తోపాటు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్ లోనూ నటించింది. వైఎస్, జగన్ జీవితాల్లో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిన సోనియా గాంధీ పాత్రలో ఈ సుజానె ఎలా నటించిందన్నది ఆసక్తికరంగా మారింది.
ఆమె లుక్ మాత్రం దాదాపు సోనియానే పోలి ఉండటం విశేషం. గతంలో యాత్ర మూవీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ప్రేక్షకులు ఆదరించడంతో ఇప్పుడు మరోసారి ఏపీ ఎన్నికలకు ముందు యాత్ర 2 తీసుకొస్తున్నారు. ఇందులో వైఎస్ తోపాటు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఎలా ఎదిగారన్నది ఇందులో చూపించనున్నారు.
2009లో వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి కావడం, తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణం, జగన్ పాదయాత్ర, కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, జైలు జీవితం, సొంతంగా పార్టీ ఏర్పాటు చేయడం, ఏపీ ముఖ్యమంత్రిగా ఎదగడంలాంటి ఘటనలన్నీ ఈ యాత్ర2లో చూపించబోతున్నారు. యాత్ర మూవీ 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ కాగా.. ఈ యాత్ర 2 మూవీ 2024, ఫిబ్రవరి 8న రిలీజ్ కానుండటం విశేషం.