Bigg Boss Nominations: గంగవ్వకు సారీ చెప్పిన యష్మి.. రోహిణి ఫైర్.. పృథ్విని ఆడుకున్న అవినాశ్.. మణికంఠ తొలిసారి ఇలా..
Bigg Boss 8 Telugu Nominations: నామినేషన్ల సందర్భంగా యష్మి, రోహిణి మధ్య వాగ్వాదం జరిగింది. గంగవ్వకు యష్మి సారీ చెప్పారు. ఈ ఆరోవారం నామినేషన్లలో ఎవరు ఉన్నారో అధికారికంగా వెల్లడైంది.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఆరో వారం నామినేషన్లు పాత కంటెస్టెంట్లు ఒరిజినల్ గ్యాంగ్‍స్టర్స్ (ఓజీ), వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాయల్ క్లాన్‍ల మధ్య హీట్‍గా సాగాయి. ఈ ఆరోవారం నామినేషన్ల ప్రక్రియ రెండో ఎపిసోడ్‍లోనూ కొనసాగింది. నేటి (అక్టోబర్ 8) మంగళవారం రెండో ఎపిసోడ్‍లో కూడా నామినేషన్లు జరిగాయి. ఈ సందర్భంగా కొందరు కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు జరిగాయి.
తప్పు చేయమన్నావ్
యష్మి గౌడకు నామినేషన్లు మళ్లీ పెరిగిపోయాయి. రోహిణి కూడా యష్మిని నామినేట్ చేశారు. మెగా చీఫ్ టాస్కును నబీల్, పృథ్వి ఆడినప్పుడు సంచాలక్‍గా ఉన్న ప్రేరణను మాటలు అనడం తనకు నచ్చలేదని రోహిణి అన్నారు. సంచాలక్‍గా ప్రేరణ సరిగా చేశారని చెప్పారు. పృథ్వికి హెల్ప్ చేయొచ్చని ఎలా అంటావని ప్రశ్నించారు. తన అభిప్రాయాన్నే చెప్పానని యష్మి సర్ది చెప్పుకున్నారు. అయితే, ప్రేరణను తప్పు చేయమన్నావని యష్మిని రోహిణి నిలదీశారు. దీన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశారు యష్మి.
టాస్కుల్లో పృథ్వి చాలా కష్టపడ్డారని యష్మి అనడంతో.. మరి నబీల్ కాళ్లు చాపి కూర్చున్నాడా అంటూ రోహిణి పంచ్ వేశారు. ఆ తర్వాత విష్ణుప్రియను రోహిణి నామినేట్ చేశారు. ఆమె ఆట పడిపోయిందని చెప్పారు. ఆట మీద ఫోకస్ చేయడం లేదని అన్నారు.
విష్ణు, యష్మిపై గంగవ్వ అసంతృప్తి
విష్ణుప్రియ, యష్మిని గంగవ్వ నామినేట్ చేశారు. గేమ్ సరిగా ఆడడం లేదని విష్ణును గంగవ్వ నిలదీశారు. గేమ్ బాగా ఆడితేనే ప్రేక్షకులు చూస్తారంటూ చెప్పారు. తాను బాగానే ఆడుతున్నానని విష్ణు సమర్థించుకున్నారు.
సారీ చెప్పిన యష్మి
వైల్డ్ కార్డ్ ద్వారా తాము హౌస్‍లోకి వచ్చినప్పుడు కనీసం సరిగా పలకరించలేదని యష్మిపై గంగవ్వ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరం కలిసి గేమ్ బాగా ఆడాలన్నారు. “మీరు, మేం వేర్వేరు కాదు. మేం వచ్చిన దగ్గరి నుంచి మాట్లాడడం లేదు. మీ రూంలో మీరే ఉంటున్నారు. మీ రూంలోకి వచ్చినా కేర్ చేయడం లేదు” అని గంగవ్వ అన్నారు. పాల ప్యాకెట్లు, చాక్లెట్లు సహా రేషన్ తమతో పంచుకోకపోవడంపై కూడా గంగవ్వ ప్రస్తావించారు.
దీంతో గంగవ్వకు యష్మి సారీ చెప్పారు. క్యూట్‍గా అనిపిస్తున్నారని అన్నారు. ముందుగా మాట్లాడేందుకు భయం అనిపించిందని అన్నారు. ఫుడ్ విషయం చీఫ్ చేతుల్లో ఉందని వివరణ ఇచ్చుకున్నారు.
ప్రవర్తన నచ్చలేదు.. పృథ్వితో అవినాశ్
పృథ్విరాజ్‍ను అవినాశ్ నామినేట్ చేశారు. ప్రభావతి టాస్కులో అమ్మాయిలకు దెబ్బలు తగిలేలా దూకుడుగా ఆడావని అభ్యంతరం తెలిపారు. హౌస్‍లో టాస్కులు ఆడడం మాత్రమే కాదని, చాలా ఉంటుందని అవినాశ్ అన్నారు. ఇంకేం చేయాలి.. ఇంకేం చేయాలి అని పృథ్వి అడిగారు. ఏం చేయాలనే దానికి సమాధానం చెప్పకుండా పృథ్విని అవినాశ్ టాడుకున్నారు. గెలుస్తానని పృథ్వి అంటే.. గెలువు అని చెప్పారు. యష్మిని కూడా అవినాశ్ నామినేట్ చేశారు. మణికంఠను ఎప్పుడూ నామినేట్ చేస్తానని చెప్పడం సరికాదన్నారు. మణిని టార్గెట్ చేస్తున్నారని నేరుగా చెప్పేశారు.
రాయల్స్ క్లాన్ నుంచి ఇద్దరిని నామినేట్ చేయాలని ఓజీ క్లాన్‍కు బిగ్‍బాస్ చెప్పారు. నామినేషన్ షీల్డును నయనికి రాయల్స్ క్లాన్ సభ్యులు ఇచ్చారు. దీంతో ఆమె నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. రాయల్స్ క్లాన్ నుంచి మహబూబ్, గంగవ్వను నామినేట్ చేయాలని అనుకుంటున్నట్టు నబీల్ ఆఫ్రిది చెప్పారు.
నామినేషన్లలో వీరే.. మణి తొలిసారి ఇలా..
బిగ్‍బాస్‍లో ఈ ఆరో వారం యష్మి, విష్ణుప్రియ, సీత, పృథ్వి, మహబాబు, గంగవ్వ నామినేషన్లలో ఉన్నారు. ఈ సీజన్‍లో మణికంఠ తొలిసారి నామినేషన్లలో లేరు. తొలి ఐదు వారాలు మణి నామినేషన్లలో నిలిచినా సేవ్ అయ్యారు. ఈ వారం సింగిల్ కార్డే పడటంతో నామినేషన్లలో మణి లేరు. రాయల్స్ క్లాన్‍లోని 8 మందిలో ఆరుగురు యష్మిని నామినేట్ చేశారు.
రూ.50వేలకు ఉప్పు ప్యాకెట్ కొని..
ఈ వారం రేషన్ కోసం నిఖిల్, నబీల్ షాపింగ్ చేశారు. ఎక్కువ వస్తువులనే తీసుకున్నారు. అయితే, ఉప్పు మాత్రం మిస్ చేశారు. దీంతో ప్యాకెట్ ఉప్పు కావాలంటే ప్రైజ్‍మనీలో కేజీకి రూ.50వేలు ఇవ్వాల్సి ఉంటుందని బిగ్‍బాస్ రూల్ పెట్టారు. దీనిపై కంటెస్టెంట్లు చర్చించుకున్నారు. మొత్తానికి రూ.50వేలు ప్రైజ్‍మనీ తగ్గించుకొని ప్యాకెట్ ఉప్పు తీసుకున్నారు. గత సీజన్‍లో టేస్టీ తేజ నామినేషన్ పాయింట్లను గుర్తు తెచ్చుకొని నయని పావని కన్నీరు పెట్టుకున్నారు.