Writer Padmabhushan Review: రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ మూవీ రివ్యూ - సుహాస్ సినిమా ఎలా ఉందంటే-writer padmabhushan movie review suhas emotional entertainer movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Writer Padmabhushan Movie Review Suhas Emotional Entertainer Movie Review

Writer Padmabhushan Review: రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ మూవీ రివ్యూ - సుహాస్ సినిమా ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Feb 03, 2023 10:38 AM IST

Writer Padmabhushan Review: క‌ల‌ర్ ఫొటో త‌ర్వాత సుహాస్ హీరోగా న‌టించిన సినిమా రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ ఈ శుక్ర‌వారం (నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు కామెడీని మేళ‌వించి రూపొందించిన ఈ సినిమాకు ష‌ణ్ముఖ ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్
రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్

Writer Padmabhushan Review: క‌ల‌ర్ ఫొటో సినిమాతో హీరోగా ప్ర‌తిభ‌ను చాటుకున్నాడు సుహాస్‌. ఓ వైపు హీరోగా న‌టిస్తూనే డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపిస్తున్నాడు. అత‌డు హీరోగా న‌టించిన తాజా చిత్రం రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌. ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు ష‌ణ్ముఖ ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆశీష్ విద్యార్థి, రోహిణి, టీనా శిల్ప‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌చార చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ చిన్న సినిమా ఎలా ఉందంటే...

రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ క‌థ‌...

ప‌ద్మ‌భూష‌ణ్ (సుహాస్‌) విజ‌య‌వాడ‌లో లైబ్రేరియ‌న్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. రైట‌ర్ కావాల‌న్న‌ది అత‌డి క‌ల‌. ఆ క‌ల‌ను సాకారం చేసుకోవాల‌నే ఆలోచ‌న‌తో తొలి అడుగు పేరుతో బుక్ రాస్తాడు. అప్పు చేసి దానిని ప‌బ్లిష్ చేస్తాడు. ఆ బుక్‌ను స‌క్సెస్ చేసి త‌ల్లిదండ్రులు మ‌ధుసూద‌న‌రావు(ఆశీష్ విద్యార్థి) స‌ర‌స్వ‌తి(రోహిణి)ల‌ను స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని అనుకున్న ప‌ద్మ‌భూష‌ణ్ కోరిక తీర‌దు.

అత‌డు రాసిన పుస్త‌కాన్ని ఉచితంగా ఇచ్చినా ఎవ‌రు చ‌ద‌వ‌రు. ఆ నిరాశ‌లో ఉండ‌గానే ప‌ద్మ‌భూష‌ణ్ పేరుతో మ‌రో పుస్త‌కం మార్కెట్‌లోకి వ‌చ్చి స‌క్సెస్ అవుతుంది. అత‌డి పేరుతో రాసిన బ్లాగ్ పాపుల‌ర్ కావ‌డంతో ప‌ద్మ‌భూష‌ణ్‌ సెల‌బ్రిటీ అవుతాడు. మ‌రోవైపు ఆ పుస్త‌కం ప‌ద్మ‌భూష‌ణ్ రాసాడ‌ని న‌మ్మిన అత‌డి మామ లోకేంద్ర కుమార్ త‌న కూతురు సారిక‌ను (టీనా శిల్ప‌రాజ్‌) ప‌ద్మ‌భూష‌ణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాల‌ని అనుకుంటాడు.

మ‌ర‌ద‌లును ఇష్ట‌ప‌డిన ప‌ద్మ‌భూష‌ణ్ ఆమె ప్రేమ కోసం స‌క్సెస్ అయిన పుస్త‌కానికి తానే రైట‌ర్‌ను అని అబ‌ద్ధం ఆడుతాడు? ఆ అబ‌ద్ధం వ‌ల‌న ప‌ద్మ‌భూష‌ణ్ ఎలా ఇబ్బందులు ప‌డ్డాడు? అత‌డి పేరుతో బుక్ రాసింది ఎవ‌రు? ప‌ద్మ‌భూష‌ణ్ పేరుతో ఎందుకు రాశారు? ప‌ద్మ‌భూష‌ణ్ ఆ పుస్త‌కం రాయ‌లేద‌నే నిజం తెలిసిన సారిక ఏం చేసింద‌న్న‌దే(Writer Padmabhushan Review) ఈ సినిమా క‌థ‌.

ఫ‌న్ మెసేజ్‌...

రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ చూసి ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సినిమా అనే న‌మ్మ‌కంతో థియేట‌ర్‌లో అడుగుపెట్టిన ప్రేక్ష‌కుల‌కు ఫ‌న్‌తో పాటు చ‌క్క‌టి సందేశాన్ని అందించి సర్ ప్రైజ్ చేశాడు డైరెక్ట‌ర్ ష‌ణ్ముఖ్ ప్ర‌శాంత్. నిజాయితీతో క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న‌ పేరు, డ‌బ్బు ఏదైనా దానిని మ‌న‌స్ఫూర్తిగా ఆస్వాదించ‌గ‌లుగుతాం. అలా కాకుండా అప్ప‌నంగా వ‌చ్చే పేరుప్ర‌తిష్ట‌ల్ని ఎంజాయ్ చేయ‌డంలో భ‌యం అభ‌ద్ర‌తా భావం క‌లుగుతాయి. అలాంటి ఓ ర‌చ‌యిత క‌థతో ఈ సినిమాను (Writer Padmabhushan Review)తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు.

సెల‌బ్రిటీ క‌ష్టాలు...

త‌న‌ది కాని పేరు, గౌర‌వాన్ని అబ‌ద్ధంతో పొంది స‌మాజంలో సెల‌బ్రిటీగా మారిపోయిన అత‌డు ఎలాంటి క‌ష్టాల్ని ఎదుర్కొన్నాడ‌న్న‌ది ఆద్యంతం వినోదాత్మ‌కంగా ఈ సినిమాలో (Writer Padmabhushan Review)చూపించారు.

మ‌గ‌వాళ్ల విష‌యంలో క‌ల‌ల్ని, అభిరుచుల‌ను ప్రోత్స‌హించే స‌మాజం మ‌హిళ‌ల‌కు వ‌చ్చే స‌రికి క‌నీసం వారి ఇష్టాల్ని, అభిప్రాయాల‌ను కూడా తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌ర‌నే సందేశాన్ని చూపించారు. పెళ్లి తో మ‌హిళ‌ల క‌ల‌ల‌కు ముగింపు ప‌డిన‌ట్లు కాద‌ని,వారి ఇష్టాల్ని గౌర‌వించాల‌ని ఈ సినిమాలో భావోద్వేగ‌భ‌రితంగా చూపించారు.

సినిమా ఫ‌స్ట్ హాఫ్‌లో తాను రాసిన పుస్త‌కాన్ని ఎలాగైనా అమ్మాల‌ని ప్ర‌య‌త్నిస్తూ సుహాస్ ప‌డే క‌ష్టాల నుంచి కామెడీని రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. సుహాన్‌, టీనా శిల్ప‌రాజ్ ల‌వ్ డ్రామా ఒకే అనిపిస్తుంది. చివ‌రి ఇర‌వై నిమిషాలు ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్‌గా నిలిచింది. ఎమోష‌న‌ల్‌గా సాగే ఈ స‌న్నివేశాల నుంచి చ‌క్క‌టి ఫ్యామిలీ డ్రామా ప‌డింది.

పంచ్ డైలాగ్స్ ప్ల‌స్‌...

సంద‌ర్భోచితంగా వ‌చ్చే డైలాగ్స్ బాగున్నాయి. మీరు బాల్ పెన్ ప‌ట్టుకున్న బ‌మ్మెర పోత‌న‌, ఇంక్ పెన్ ప‌ట్టుకున్న ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ అంటూ వ‌చ్చే డైలాగ్స్ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాయి.

రియ‌లిస్టిక్ యాక్టింగ్‌....

రైట‌ర్ అవ్వాల‌ని తాప‌త్ర‌య ప‌డే యువ‌కుడి పాత్ర‌లో స‌హాస్ స‌హ‌జ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. పాత్ర కోసం ఏం కావాలో అన్ని చేశాడు. చివ‌ర‌కు ఇలాంటి ప్లేస్‌ల‌కు నేను వైట్ ష‌ర్ట్ వేసుకొని వ‌స్తాను. ఎందుకంటే నేను క‌న‌బ‌డ‌క‌పోయినా నా ష‌ర్ట్ క‌న‌బ‌డుతుంది అంటూ త‌న క‌ల‌ర్‌పైన తాను సెటైర్స్ వేసుకుంటూ న‌వ్వించాడు.

హీరో త‌ల్లిగా రోహిణి ఎమోష‌న‌ల్ క్యారెక్ట‌ర్‌కు పూర్తిగా న్యాయం చేసింది. తండ్రి పాత్ర‌లో అశిశ్ విద్యార్థి డిఫ‌రెంట్ కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. హీరోయిన్ టీనా శిల్ప‌రాజ్ యాక్టింగ్‌లో మెచ్యూరిటీ క‌నిపించ‌లేదు.

Writer Padmabhushan Review- ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌...

న‌వ్విస్తూనే మ‌న‌సుల్ని క‌దిలించే ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ నిలిస్తుంది. సిట్యూవేషన‌ల్ కామెడీ, రియ‌లిస్టిక్ క్యారెక్ట‌ర్స్‌తో ఫ్రెష్ ఫీల్‌ను క‌లిగిస్తుంది.

IPL_Entry_Point