Cinema Ticket Price: సినిమా టికెట్ ధరల పెంపు లాభమా? నష్టమా? - రికార్డుల కోసమే టికెట్ రేట్లు పెంచుతున్నారా?
Cinema Ticket Price: స్టార్ హీరోల సినిమాలకు టికెట్ రేట్లను పెంచడంపై టాలీవుడ్‌లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. ఈ అధిక టికెట్ ధరలను సగటు సినిమా లవర్స్ వ్యతిరేకిస్తోండగా...ప్రొడ్యూసర్లు మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే అతి తక్కువ రేట్లు ఉన్నాయంటూ చెబుతోన్నారు.
Cinema Ticket Price: అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో టికెట్ ధరల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పుష్ప 2 ప్రీమియర్స్‌కు తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా వెయ్యికిపైగా టికెట్ ధరలు నిర్ణయించడంపై సగటు సినీ లవర్స్ నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా భారీగా టికెట్ ధరలు పెట్టడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఇలాగే సినిమా టికెట్ ధరలను పెంచుకుంటూ పోతే ఫ్యామిలీ ఆడియెన్స్, సినిమా లవర్స్ థియేటర్లకు దూరమయ్యే ప్రమాదం ఉందంటూ కొందరు వాదిస్తోన్నారు. అధిక టికెట్ ధరల వల్ల థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమవుతుందంటూ చెబుతోన్నారు.
భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే...
టాలీవుడ్‌లో స్టార్ హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే పెయిడ్ ప్రీమియర్స్, టికెట్ ధరలు పెంపు నిర్ణయం అమలవుతూ వస్తోంది. చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ మూవీస్ మాత్రం సాధారణ ధరలతోనే థియేటర్లలో రిలీజ్ అవుతోన్నాయి.
వంద రోజుల సంస్కృతి లేదు...
స్టార్ హీరో సినిమా అంటే మినిమం మూడు వందల కోట్లవరకు బడ్జెట్ పెట్టడం కామన్‌గా మారిపోయింది. రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషన్స్ వెరసి నిర్మాతలకు సినిమాల కోసం భారీగానే పెట్టుబడులు పెట్టాల్సివస్తుంది. మరోవైపు ఇదివరకటిలా వందల రోజుల సంస్కృతి కూడా లేదు.
స్టార్ హీరోల సినిమాలు సైతం రెండు, మూడు వారాలకు మించి థియేటర్లలో ఆడటం లేదు. తక్కువ టైమ్‌లోనే తాము పెట్టిన పెట్టుబడిని వెనక్కి రప్పించుకోవడం కోసం టికెట్ రేట్లను పెంచుతున్నామని ప్రొడ్యూసర్లు వాదిస్తున్నారు. ఫస్ట్ వీకెండ్‌లోనే లాభాల్లోకి ఎంటర్ కావాలనే ప్రయత్నంలో ఒకరికి మించి మరొకరు నిర్మాతలు ధరలను పెంచుతూ పోతున్నారు.
తెలుగులోనే తక్కువ...
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు స్టేట్స్‌లోనే అతి తక్కువ టికెట్ ధరలు ఉన్నాయంటూ ప్రొడ్యూసర్ నాగవంశీ దేవర ప్రమోషన్స్‌లో కామెంట్ చేశాడు. ఇంత తక్కువ ధరకు ఎక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ దొరదకంటూ కామెంట్స్ చేశాడు.
లగ్జరీ కార్లు, బ్రాండెడ్ డ్రెస్సుల ధరలు ఎంత పెరిగిన పట్టించుకోని కొందరు టికెట్ ధరలు పెంచితే మాత్రం ఏడున్నారంటూ ఇటీవల డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కూడా పేర్కొన్నారు. సినిమాలు లాభాల కోసమే తీయబడతాయని, ప్రజాసేవ కోసం కాదని, రేట్లు పెంచడంతో తప్పు లేదంటూ ట్వీట్ చేశారు.
రికార్డుల కోసమే...
సినిమా టికెట్ ధరలు పెరగడంలో తప్పు లేదంటూ ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటే సగటు సినిమా ఫ్యాన్స్ మాత్రం వారి నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ప్రేక్షకులకు తక్కువ ధరకే ఎంటర్‌టైన్‌మెంట్ అందించాలనే ఆలోచనతో కాకుండా రికార్డులు, బాక్సాఫీస్ లెక్కలు, హీరోల మధ్య ఉన్న కాంపిటీషన్ గురించే నిర్మాతలు ఆలోచిస్తూ టికెట్ ధరలను అడ్డగొలుగా పెంచుతోన్నారని వాదిస్తున్నారు.
ఓటీటీ ట్రెండ్ పెరగడానికి ఒక రకంగా ఈ టికెట్ రేట్ల పెరుగుదలే కారణమని చెబుతోన్నారు. తక్కువ ధరకే 4కే ,డాల్బీ వంటి అత్యాధునిక టెక్నాలజీలో ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతోన్నాయి..ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉండటంతో థియేటర్లవైపు ఆడియెన్స్ మొగ్గుచూపడం లేదని మాట చాలా రోజులుగా వినిపిస్తోంది.
ధరలు తగ్గిస్తేనే...
స్టార్ హీరోల సినిమాలు సైతం ఇరవై నుంచి నెల రోజుల్లోనే ఓటీటీలలోకి రావడం కూడా థియేటర్లను గట్టిగా దెబ్బతీస్తుంది. ఈ ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకుడిని మళ్లీ థియేటర్లకు రప్పించాలనే టికెట్ ధరలు తగ్గించడం ఒక్కటే మార్గమని చెబుతోన్నారు.