Kashmir Files | ఆ సినిమాకే ఎందుకు.. పన్ను మినహాయింపు మాకెందుకివ్వరు?-why only kashmir files asks jhund producer over tax exemption
Telugu News  /  Entertainment  /  Why Only Kashmir Files Asks Jhund Producer Over Tax Exemption
అమితాబ్ బచ్చన్ నటించిన ఝుండ్ సినిమా
అమితాబ్ బచ్చన్ నటించిన ఝుండ్ సినిమా (PTI)

Kashmir Files | ఆ సినిమాకే ఎందుకు.. పన్ను మినహాయింపు మాకెందుకివ్వరు?

20 March 2022, 6:44 ISTHT Telugu Desk
20 March 2022, 6:44 IST

బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై మరో వివాదం మొదలైంది. ఈ సినిమాకు పలు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథను కళ్లకు కట్టినట్లు చూపించింది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 8 రోజుల్లోనే 100 కోట్లకుపైగా రాబట్టడం విశేషం. పైగా ఈ మూవీకి చాలా రాష్ట్రాలు పన్ను మినహాయింపు కూడా ఇచ్చాయి. మరికొన్ని ఫ్రీ షోలు వేయడం, ఉద్యోగులు సినిమా చూడటానికి సగం రోజు లీవ్‌ ఇవ్వడంలాంటివీ చేస్తున్నాయి. 

ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఆ సినిమాకు ఇచ్చిన ప్రాధాన్యం, పన్ను మినహాయింపులు తమ సినిమాకు ఎందుకు ఇవ్వరంటూ ఝుండ్‌ మూవీ ప్రొడ్యూసర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. స్లమ్‌ సాకర్‌ పేరుతో అణగారిన వర్గాల చిన్నారులను ఫుట్‌బాల్‌ వైపు అడుగులు వేసేలా చేసిన విజయ్‌ బర్సే అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ స్పోర్ట్స్‌ డ్రామా తెరకెక్కింది. ఇందులో విజయ్‌ పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ నటించాడు.

తమ సినిమా కూడా కశ్మీర్‌ ఫైల్స్‌లాంటిదే అని, ఈ మూవీ సబ్జెక్ట్‌ దేశ అభివృద్ధికి కీలకమైనదని ఝుండ్ ప్రొడ్యూసర్‌ సవితా రాజ్‌ అంటోంది. ఫేస్‌బుక్‌ ద్వారా ఆమె తన అసంతృప్తిని తెలియజేసింది. ఈ నెల 4న రిలీజైన ఝుండ్‌ మూవీ మొదట్లో మంచి కలెక్షన్లు రాబట్టినా.. కశ్మీర్‌ ఫైల్స్‌ రిలీజ్‌ తర్వాత వెనుకబడిపోయింది. కశ్మీర్‌ ఫైల్స్‌కు పన్ను మినహాయింపు కూడా ఇచ్చారు. అయితే కశ్మీర్‌ ఫైల్స్‌ ఎంత ముఖ్యమైన సినిమానో ఝుండ్‌ కూడా అలాంటిదే అని సవితా వాదిస్తోంది. 

కశ్మీరీ పండిట్ల వ్యథను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది అని, అయితే అదే సమయంలో ఝుండ్‌ కూడా మంచి సందేశాత్మక సినిమాయే కదా అని సవితా ప్రశ్నించింది. మరి కశ్మీర్‌ ఫైల్స్‌కు ఇచ్చిన పన్ను మినహాయింపు తమ సినిమాకు ఎందుకు ఇవ్వరు అని ఆమె తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో అడిగింది. అసలు ఓ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడానికి ఎలాంటి ప్రమాణాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో తాను తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు సవితా చెప్పింది. 

పన్ను మినహాయింపు ఇచ్చి మరీ ఎందుకు ఆ సినిమాను అంతలా ప్రమోట్‌ చేస్తున్నారు? సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. ఉద్యోగులకు సెలవులు ఇచ్చి మరీ ఎందుకు చూపిస్తున్నారు. ఆ లెక్కన ఝుండ్‌ కూడా తక్కువేమీ కాదు. ఈ మూవీ సబ్జెక్ట్‌ కూడా దేశ పురోగతికి కీలకమైనదే అని సవితా వాదించింది.

సంబంధిత కథనం

టాపిక్