దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్, ఇసైజ్ఞాని ఇళయరాజా.. అనుమతి లేకుండా తన పాటలను సినిమాల్లో వినియోగించుకుంటే సహించరు. నోటీసులు పంపుతుంటారు. గతేడాది మలయాళ మూవీ మంజుమ్మల్ బాయ్స్ సినిమా మేకర్లకు నోటీసులు పంపారు. చాలా రోజుల పాటు ఈ వివాదం సాగింది. మొత్తానికి సెటిల్ అయింది. ఇప్పుడు తాాజాగా ఓ తమిళ చిత్రానికి నోటీసులు పంపారు ఇళయరాజా. తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాక్ అగ్లీ సినిమాకు తాఖీదులు పంపించారు.
తాను కంపోజ్ చేసిన మూడు పాత పాటలను గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో వాడేశారని మేకర్లకు నోటీసులు పంపించారు ఇళయరాజా. నట్టుపురా పట్టు మూవీ నుంచి ‘ఓతా రూబైయుమ్ తారే’, విక్రమ్ నుంచి ‘ఇన్ జోడీ మంజల్ కురివి’, సకల కళా వల్లవన్ చిత్రం నుంచి ‘ఇలమై ఇదో ఇదో’ పాటలను తన అనుమతి లేకుండా వాడారని ఇళయరాజా నోటీసుల్లో పేర్కొన్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఈ మూడు పాటలు కాసేపు ఉంటాయి.
తన అనుమతి లేకుండా తాను కంపోజ్ చేసిన పాటలను వాడినందుకు నష్టపరిహారంగా రూ.5కోట్లు ఇవ్వాలని గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌కు డిమాండ్ చేశారు ఇళయరాజా. అలాగే, మేకర్స్ నుంచి తనకు రాతపూర్వత క్షమాపణ కావాలని కూడా పేర్కొన్నారు. ఒకవేళ తక్షణమే ఆ మూవీ నుంచి ఆ పాటలను తొలగించకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఇళయరాజా హెచ్చరించారు. ఈ నోటీసులపై మైత్రీ మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. ఈ తమిళ యాక్షన్ మూవీ గత వారం ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఇప్పటికే రూ.150కోట్ల కలెక్షన్ల మార్క్ దాటింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. మిక్స్డ్ టాక్ వచ్చినా వసూళ్లలో మాత్రం దూకుడు చూపిస్తోంది ఈ మూవీ. ఈ చిత్రంలో అజిత్ కుమార్ హీరోగా నటించగా.. ఆయనకు జోడీగా త్రిష హీరోయిన్‍గా చేశారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో అర్జున్ దాస్, ప్రభు, ప్రసన్న, ప్రియా ప్రకాశ్ వారియర్, సునీల్, రాహుల్ దేవ్ కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్, నవీన్ యెర్నేనీ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు. రూ.200కోట్లకు పైగా వసూళ్ల బడ్జెట్‍తో ఈ సినిమా రూపొందింది.
సంబంధిత కథనం