Sreeleela: పుష్ప-2 ఐటెం సాంగ్ నుంచి ఆ కారణంతో తప్పుకున్న క్రేజీ హీరోయిన్, లక్కీగా ఆఖర్లో శ్రీలీలకి కాల్
Pushpa 2 Item Song: పుష్ప -2 ఐటెం సాంగ్ నుంచి శ్రీలీల స్టిల్ రిలీజ్ తర్వాత ఆ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. వాస్తవానికి ఈ ఐటెం సాంగ్‌ని బాలీవుడ్ హీరోయిన్ చేయాల్సి ఉంది. కానీ..?
అల్లు అర్జున్ పుష్ప-2లో ఐటెం సాంగ్ కోసం తొలుత శ్రీలీలను ఎంపిక చేయలేదు. బాలీవుడ్‌లోని ఓ క్రేజీ హీరోయిన్‌ని ఎంపిక చేసి.. చర్చలు కూడా జరిపారట. కానీ.. అనూహ్యంగా ఆఖర్లో శ్రీలీల తెరపైకి వచ్చి ఐటెం సాంగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి ఆడిపాడింది. డిసెంబరు 5న ‘పుష్ప: ది రూల్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
ఊ అంటావా అంటూ సమంత ట్రెండ్
2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ మూవీ సమంత ఐటెం సాంగ్ చేసింది. ‘ఊ అంటా.. ఊఊ అంటావా’ అంటూ సమంత దేశ మొత్తాన్ని అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. దాంతో పుష్ప-2 కోసం మరింత క్రేజ్ ఉన్న హీరోయిన్‌తో ఐటెం సాంగ్ చేయించాలని దర్శకుడు సుకుమార్ తొలుత ఆశించారట. బాలీవుడ్ హీరోయిన్ అయితే హిందీలోనూ సినిమాకి బజ్ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావించినట్లు తెలుస్తోంది.
శ్రద్ధా కపూర్ పేరు తెరపైకి
బాలీవుడ్‌లో కొంత మంది హీరోయిన్ల పేర్లని పరిశీలించిన తర్వాత పుష్ప-2 ఐటెం సాంగ్ కోసం క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరుని చిత్ర యూనిట్ అప్పట్లో ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ‘స్త్రీ2’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న శ్రద్ధ కపూర్‌కి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ.. రెమ్యూనరేషన్ విషయంలో శ్రద్ధ కపూర్ వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది.
శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతంటే?
ఐటెం సాంగ్ కోసం భారీ మొత్తంలో డిమాండ్ చేయడంతో.. పుష్ప-2 చిత్ర యూనిట్ పునరాలోచనలో పడిపోయిందట. ఆ సమయంలో హీరో అల్లు అర్జున్.. శ్రీలీల పేరుని ప్రతిపాదించడం, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో రోజుల వ్యవధిలోనే సాంగ్ షూటింగ్‌కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు వెలువడిన వార్తల ప్రకారం ఈ సాంగ్‌కి శ్రీలీల రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకూ ఈ సాంగ్ కోసం రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజులు ఈ పాటని చిత్రీకరించారని టాక్. స్త్రీ 2 సినిమాకి రూ.5 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రద్ధా కపూర్.. పుష్ఫ-2లో ఐటెం సాంగ్‌కి కూడా ఆ రేంజ్‌లోనే పారితోషికం అడిగినట్లు తెలుస్తోంది.
యాడ్‌లో చేసిన అల్లు అర్జున్, శ్రీలీల
ఆహా యాడ్ కోసం ఇప్పటికే ఒకసారి అల్లు అర్జున్‌తో జతకట్టిన శ్రీలీల.. కొన్ని సూపర్ హిట్ సాంగ్స్‌కి ఐకాన్ స్టార్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. శ్రీలీల డ్యాన్స్‌లోని గ్రేస్ చూసిన అల్లు అర్జున్.. పుష్ప-2 ఐటెం సాంగ్‌ని ఆమె చేస్తే బాగుంటుందని సూచించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లోని మేటి డ్యాన్సర్లలో ఒకరుగా ఉన్న అల్లు అర్జున్‌తో శ్రీలీల ఎలా ఐటెం సాంగ్‌లో స్టెప్‌లు వేసిందో తెలియాలంటే డిసెంబరు 5 వరకూ ఆగాల్సిందే.