Telugu Movies Releasing in January: జనవరిలో సినీ ప్రియులకు పండగే - థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే
Telugu Movies Releasing in January 2023: జనవరి నెలలో థియేటర్లలో పలు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతికి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ పోటీపడటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీరితో పాటు యంగ్ హీరోలు కూడా ఈ నెలలోనే తమ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు.
Telugu Movies Releasing in January 2023 జనవరి అనగానే టాలీవుడ్ ప్రేక్షకులకు సంక్రాంతి పోటీ గుర్తొస్తుంది. ప్రతి ఏటా సంక్రాంతి బరిలో భారీ బడ్జెట్ సినిమాలు నిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి సంక్రాంతి బరిలో నాలుగు పెద్ద సినిమాలతో పాటు రెండు చిన్న సినిమాలు పోటీపడుతోన్నాయి. సంక్రాంతి తర్వాత కూడా ప్రేక్షకుల్ని అలరించేందుకు యంగ్ హీరోలు జనవరిలోనే థియేటర్లలో తమ లక్‌ను పరీక్షించుకోబోతున్నారు. ఈ జనవరి నెలలో థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు ఏవంటే...
ట్రెండింగ్ వార్తలు
మహేష్‌బాబు ఒక్కడు రీ రిలీజ్ - జనవరి 7
మహేష్‌బాబు హీరోగా నటిస్తోన్న ఒక్కడు సినిమా జనవరి 7న రీ రిలీజ్ కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో రిలీజైన ఈ సినిమా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఒక్కడు రిలీజై ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి క్లాసిక్ హిట్‌ను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. 4కే, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా భూమిక హీరోయిన్‌గా నటించింది.
బాలకృష్ణ వీరసింహారెడ్డి - జనవరి 12
లాంగ్ గ్యాప్ తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు బాలకృష్ణ. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తోన్నాడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జనవరి 12న వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఈ సినిమాపై భారీగా హైప్‌ను తీసుకొచ్చాయి. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు.
విజయ్ వారసుడు - జనవరి 12
తమిళ అగ్ర హీరో విజయ్ వారసుడు సినిమాతో జనవరి 12న తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. తమిళంలో వారిసు పేరుతో రూపొందిన ఈ సినిమాకు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. తమిళంలో స్ట్రెయిట్ సినిమాగా తెరకెక్కిన వారిసు తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
అజిత్ తెగింపు - జనవరి 12
విజయ్ వారసుడుతో పాటు అజిత్ తెగింపు సినిమా కూడా జనవరి 12నే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. బోనీకపూర్ నిర్మించారు.
చిరంజీవి వాల్తేర్ వీరయ్య - జనవరి 13
వాల్తేర్ వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి రేసులో నిలిచాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. రవితేజ మరో హీరోగా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కానుంది. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. వీరసింహారెడ్డి రిలీజైన ఒక రోజు గ్యాప్‌లోనే వాల్తేర్ వీరయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కళ్యాణం కమనీయం - జనవరి 14
సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జంటగా జంటగా నటించిన కళ్యాణం కమనీయం సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ కానుంది. భిన్న మనస్థత్వాలు కలిగిన జంట కథతో దర్శకుడు అనిల్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.
విద్యావాసుల అహం - జనవరి 14
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న విద్యావాసుల అహం కూడా జనవరి 14న థియేటర్లలోకి రాబోతున్నది.
షారుఖ్‌ఖాన్ పఠాన్ - జనవరి 25
దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్ సినిమాతో షారుఖ్‌ఖాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్పై యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీతో పాటు తెలుగులో జనవరి 25న ఈ సినిమా రిలీజ్ కానుంది.
బుట్టబొమ్మ - జనవరి 26
మలయాళంలో విజయవంతమైన కప్పేలా సినిమా తెలుగులో బుట్టబొమ్మ పేరుతో రీమేక్ కాబోతున్నది. ఈ రీమేక్‌లో అర్జున్ దాస్ అనైక సురేంద్రన్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు శౌరి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
సుధీర్‌బాబు హంట్ - జనవరి 26
సుధీర్ బాబు హంట్ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మహేష్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ కీలక పాత్రలు పోషిస్తోన్నారు.