ATM Web Series Review: ఏటీఎం ఎలా ఉంది? దొంగ దొరికాడా? తప్పించుకున్నాడా?
ATM Web Series Review: వీజే సన్నీ, దివి, సుబ్బరాజు తదితులు కీలక పాత్రల్లో నటించిన తాజా సిరీస్ ఏటీఎం. జీ5 వేదికగా శుక్రవారం నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
వెబ్‌సిరీస్- ఏటీఎం
నటీనటులు- వీజే సన్నీ, సుబ్బరాజు, 30 ఇయర్స్ పృథ్వీ, కృష్ణ బూరుగుల, రవిరాజ్, రాయల్ శ్రీ, బిగ్‌బాస్ దివి, దివ్యవాణి, షఫీ, హర్షిణి తదితరులు.
కథ, రచన- హరీష్ శంకర్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం- సీ చంద్రమోహన్
ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక- జీ5
స్ట్రీమింగ్ తేదీ- 2023 జనవరి 20.
ATM Web Series Review: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ అందించిన కథతో రూపొందిన సిరీస్ ఏటీఎం. ఇందులో వీజే సన్నీ ప్రధాన పాత్ర పోషించగా.. సుబ్బరాజు, 30 ఇయర్స్ పృథ్వీ, కృష్ణ బూరుగుల, రవిరాజ్, రాయల్ శ్రీ, బిగ్‌బాస్ దివి, దివ్యవాణి, షఫీ, హర్షిణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీ5 వేదికగా జనవరి 20(శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు చంద్రమోహన్ సీ దర్శకత్వం వహించారు. దిల్ రాజు బ్యానర్‌లో తెరెకెక్కిన ఈ సిరీస్‌కు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ(ATM Web Series Story)..
జగన్(వీజే సన్నీ) హైదరాబాద్‌లోని ఓ బస్తీలో యువకుడు. అదే ప్రాంతంలో ఉన్న అతడి స్నేహితులతో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంటారు. అయితే ఓ రోజు ఓ పాత కారు దొంగతన చేసి అమ్మేస్తారు. అందులో పది కోట్ల విలువైన డైమండ్స్ ఉన్నాయని తెలుస్తుంది. సదరు డైమండ్స్ యజమాని వారిని పట్టుకుని పది రోజుల్లో 10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెందిరిస్తాడు. దీంతో చేసేది ఏమి లేక దొంగతనం ప్లాన్ చేస్తారు. ఇందుకోసం ఏటీఎం వ్యానును దొంగిలించాలని స్కెచ్ వేసి దిగ్విజయంగా అమలు పరుస్తారు. ఇందులో రూ.25 కోట్ల డబ్బు ఉంటుంది. వీరిని పట్టుకునేందుకు పోలీసు అధికారి హెగ్డే(సుబ్బరాజు) రంగంలోకి దిగుతాడు. మరి ఈ దొంగల ముఠాను పట్టుకున్నారా? దొంగతనం చేసిన సొమ్మును రికవరీ చేశారా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ పూర్తిగా చూడాల్సిందే.
ఎలా ఉందంటే(ATM Web Series Review)..
ఏటీఎం వెబ్ సిరీస్‌లో మొదటి ఎపిసోడ్ పాత్రల పరిచయంతో అలా సింపుల్‌గానే ముగుస్తుంది. అయితే రెండో ఎపిసోడ్ నుంచి నాలుగో ఎపిసోడ్ వరకు కాస్త స్క్రీన్ ప్లే నిదానంగా సాగుతుంది. సాధారణంగా హీస్ట్ కథలంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లాజికల్ పాయింట్స్, షాకింగ్ ట్విస్టులు లాంటివి చాలా ఉంటాయి. అయితే ఈ సిరీస్‌లో అనుకున్న స్థాయిలో ఇవి పండలేదనే చెప్పాలి. అలా అని ఎక్కడా బోరింగ్ సన్నివేశాలు పెద్దగా ఏమి ఉండవు. హరీష్ శంకర్ తన కథలో ఈ హీస్ట్ సిరీస్‌కు కాస్త కామెడీ టచ్ ఇచ్చి ఎంటర్టైన్ చేశారు. 2, 3 ఎపిసోడ్‌లు మినహాయిస్తే మిగతా అంతా బాగానే ఉంటుంది. సుబ్బరాజు ఎంట్రీ తర్వాత కథనం ఆసక్తిగా మారుతుంది.
బలాలు-బలహీనతలు..
చివరి మూడు ఎపిసోడ్‌లు రసవత్తరంగా ఉంటాయి. ఇదే సమయంలో లాజికల్ బహిర్గతం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నారనిపిస్తుంది. జీపీఎస్ ట్రాకర్‌తో బోల్తా కొట్టించడం, గోల్డెన్ ఈగెల్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందనే పాయింట్లు కొత్తగా అనిపిస్తుంది. ఏటీఎం దొంగలను పట్టుకోవడానికి సుబ్బరాజు ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు బాగుంటాయి. తర్వాత ఏం జరుగుతుంది? అని ఆసక్తిని పెంచుతుంది. ఓ పక్క కామెడీతో పాటు మరో పక్క సస్పెన్స్ అంశాలు కూడా ఆకట్టుకుంటాయి.
ఓవరాల్‌గా కథలో కొన్ని లాజిక్స్ ఉన్నప్పటికీ.. సిరీస్ పూర్తయిన తర్వాత చిన్న వెలితిగా అనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణంగా పాత్రల వెనక భావోద్వేగం బలంగా లేకపోవడమే. లారీ డ్రైవర్ అయిన వీజే సన్నీ పాత్రలో కొన్ని లోటు పాట్లు కనిపిస్తాయి. అతడు పుస్తకాలు చదవడంలో దిట్ట అని, బాగా ప్లాన్ చేస్తాడని చిన్న సన్నివేశంతోనే తేల్చేశారు. అలా కాకుండా అతడి తెలివితేటలను చెప్పేలా ఇంకొన్ని సీన్లు ఉంటే బాగుండేదనిపించింది. అలాగే కారులో డైమండ్లున్న సంగతి హీరో గ్యాంగ్‌కు తెలియకపోవడం అనేది కూడా ప్రేక్షకులకు రుచించదు. చివర్లో అయినా ఆ డైమండ్స్ కూడా హీరోనే దొంగిలించారని చూపిస్తే ప్రేక్షకులు ఇంకా ఎగ్జయిట్ అయ్యేవాళ్లు.
ఎవరెలా చేశారంటే..
జగన్ పాత్రలో వీజే సన్నీ బాగా ఒదిగిపోయాడు. బస్తీ యువకుడి పాత్రలో ఆవారాగా.. అతడి యాస, భాష అంతా బాగున్నాయి. పోలీసు అధికారిగా సుబ్బరాజు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓ రకంగా చెప్పాలంటే ఇందులో అతడు సెకండ్ హీరో అని చెప్పవచ్చు. అంతగా తన నటనతో ఆకట్టుకున్నాడు. వీజే స్నేహితులుగా చేసిన వారు ఫర్వాలేదనిపించారు. దివి, హర్షిణి పోషించిన పాత్రల నిడివి తక్కువ. ఇద్దరూ లిప్ లాక్ సన్నివేశాల్లో మెరిశారు. దివిని కేవలం రొమాంటిక్ సీన్ల కోసమే వాడారనిపిస్తుంది. సీఐ పాత్రలో మెరిసిన దివ్యవాణి క్యారెక్టర్ చికాకు తెప్పిస్తుంది. మెడ నొప్పికి కానిస్టేబుళ్లను మసాజ్ చేయమనడం, అనవసరమైన ఇంట్రాగేషన్ సన్నివేశాల వల్ల ఆమె పాత్రను ఆ కాసేపు కూడా భరించలేం. అసలు ఆ క్యారెక్టర్ లేకపోయినా ఒరిగే నష్టమేమి లేదు. మిగిలిన నటీనటులు ఫర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం(ATM Web Series Technical review)..
దిల్ రాజు సమర్పణలో వచ్చిన ఈ సిరీస్‌లో నిర్మాణ పరంగా పరిమితులు కొట్టొచ్చినట్లు కనిపించాయి. గ్రద్ధ గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేదు. దొంగతనం సన్నివేశంలో పొగ మధ్యలో సినిమాటోగ్రాఫర్ పనితనం కనిపిస్తోంది. ఆ సీన్‌లో షాట్లు బాగుంటాయి. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన నేపథ్యం సంగీతం బాగుంది. ఎలివేషన్, థ్రిల్లింగ్ సన్నివేశాల్లో బీజీఎంతో అదరగొట్టాడు. సీన్లను ఇంట్రెస్టింగ్‌గా చూపించడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌ను ఆరు ఎపిసోడ్‌లకు కుదించినట్లయితే ఇంకా థ్రిల్లింగ్‌గా అనిపించేది. దర్శకుడిగా చంద్రమోహన్ ఫర్వాలేదనిపించాడు. స్క్రీన్ ప్లే పరంగా కొన్ని సన్నివేశాలను కన్విన్సింగ్‌గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు.
చివరగా- ఏటీఎం.. టైమ్ పాస్ సిరీస్.. దొంగ దొరకలేదు కానీ
రేటింగ్- 3/5
సంబంధిత కథనం