Naga Chaitanya: అలాంటి సినిమాలే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయి.. కానీ: నాగచైతన్య
Naga Chaitanya - Thandel: తండేల్ సినిమా గురించి చైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ మూవీ కోసం షూటింగ్‍కు ముందే తొమ్మిది నెలలు ప్రిపరేషన్ చేశానని వెల్లడించారు. మరికొన్ని విషయాలను చెప్పారు.
Naga Chaitanya: యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా తండేల్ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రను ఆయన పోషిస్తున్నారు. నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు చందూ మొండేటి. నాగచైతన్య సరసన సాయిపల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. భారీ బడ్జెట్‍తో తండేల్ మూవీ రూపొందుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి నాగచైతన్య మాట్లాడారు.
అలాంటి రప్పిస్తున్నాయి.. కానీ
ప్రస్తుత ఓటీటీల కాలంలో భారీ విజువల్స్ ఉండే సినిమాలే.. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు ప్రధాన మార్గంగా ఉన్నాయని నాగచైతన్య చెప్పారు. అయితే మార్కెట్ కోసమే భారీ విజువల్స్ సినిమాల్లో పెట్టకూడదని, ప్రాజెక్ట్‌ను బట్టి అది ఆర్గానిక్‍గా ఉండాలని అన్నారు. “ఈ ఓటీటీల కాలంలో లార్జర్ దెన్ లైఫ్ విజువల్స్ ఉండే భారీ చిత్రాలే ప్రేక్షకులను ఎక్కువగా థియేటర్లకు రప్పించగలుగుతాయి. అలాగని మార్కెట్ అవసరాల కారణంగా భారీ విజువల్స్ సింపుల్‍గా పెట్టలేం. ప్రాజెక్టు అవసరానికి అనుగణంగా కంటెంట్‍కు తగ్గట్టుగా అర్గానిక్ ప్రాసెస్‍గా అది ఉండాలి. ముఖ్యంగా ఆ పాత్రకు కూడా సెట్ కావాలి” అని నాగచైతన్య అన్నారు.
నా కెరీర్‌లోనే భారీ మూవీ
తండేల్ మూవీ కోసం షూటింగ్‍కు ముందే తొమ్మిది నెలలు సిద్ధమైనట్టు నాగచైతన్య వెల్లడించారు. ఈ చిత్రం కోసం తీవ్రంగా ప్రిపేర్ అయినట్టు చెప్పారు. “తండేల్ సినిమా కోసం ప్రిపేర్ అయ్యేందుకు సుమారు తొమ్మిది నెలలు వెచ్చించా. ఇది ఓ స్ఫూర్తిదాయకమైన స్టోరీ. అన్నీ సరిగా ఉండాలని నేను నిర్ణయించుకున్నా. ముఖ్యంగా శ్రీకాకుళం యాస సరిగ్గా ఉండేలా సిద్ధమయ్యా. నా కెరీర్‌లోనే ఇది భారీ (బడ్జెట్) మూవీ. నాకు ఈ పాత్ర అవసరం” అని నాగచైతన్య చెప్పారు.
తండేల్ కథ ఇదే..
2018లో గుజరాత్‍లో చేపల వేటకు వెళ్లి.. పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి 22 మంది శ్రీకాకుళం, విజయనగరం జాలర్లు వెళ్లారు. దీంతో పాక్ దళాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. ఆ మత్స్యకారులు పాక్ జైలులో చిత్రహింసలు అనుభవించారు. ఇక భారత ప్రభుత్వం చర్చలు జరపటంతో సుమారు రెండేళ్ల తర్వాత వారిని పాక్ విడిచిపెట్టింది. దీంతో వారు తమ స్వస్థలాలకు చేరారు.
ఈ నిజజీవిత ఘటనల ఆధారంగానే తండేల్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్‍కు ముందే మత్స్యకారుల గ్రామాలకు కూడా వెళ్లారు నాగచైతన్య, దర్శకుడు చందూ టీమ్. వారి జీవనవిధానం, యాస అన్ని వివరాలపై రీసెర్చ్ చేశారు. ఆ తర్వాతే షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం తండేల్ మూవీ చిత్రీకరణ వేగంగా సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో తండేల్ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తండేల్ సినిమాలో లవ్ స్టోరీ కూడా నిజమైనదే అని నాగచైతన్య గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మూవీలో రాజు పాత్రను చైతూ పోషిస్తున్నారు. అతడికి జోడీగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. దేవీ శ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.