Boycott Laila: విశ్వక్‍సేన్ సినిమాకు పొలిటికల్ ట్రబుల్.. బాయ్‍కాట్ చేయాలంటూ ట్రెండ్.. కారణం ఇదే
Boycott Laila: లైలా సినిమాకు అనుకోని ఇబ్బంది ఎదురవుతోంది. ఈ మూవీని బాయ్‍కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. దీంతో బాయ్‍కాట్ లైలా ట్రెండ్ అవుతోంది. పృథ్వి చేసిన కామెంట్లే ఇందుకు కారణంగా ఉన్నాయి. ఆ వివరాలివే..

మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన లైలా చిత్రం ఫిబ్రవరి 14వ తేదీని రిలీజ్ కానుంది. ఈ రొమాంటిక్ కామెడీ యాక్షన్ మూవీలో విశ్వక్ లేడీ గెటప్ కూడా వేశారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ బోల్డ్ కంటెంట్‍తో క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‍లో నటుడు 30 ఇయర్స్ పృథ్వి చేసిన కామెంట్లు నిప్పు రాజేశాయి. ఈ మూవీని బాయ్‍కాట్ చేయాలంటూ ఓ రాజకీయ పార్టీకి చెందిన మద్దతుదారులు పిలుపునిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘బాయ్‍కాట్ లైలా’ నేడు ట్రెండ్ అవుతోంది.
పృథ్వి ఏమన్నారు.. వివాదం ఎందుకు?
లైలాలో ఓ సన్నివేశం గురించి ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో పృథ్వి మాట్లాడారు. మేకల సత్తిగా తాను చేశానని చెప్పారు. మేకలు ఎన్ని ఉన్నాయని షాట్ మధ్యలో అడిగితే.. 150 ఉన్నాయని చెప్పారని అన్నారు. యాధృచ్ఛికమో ఏమో కానీ సినిమా చివర్లో లెక్కేస్తే కరెక్టుగా 11 గొర్రెలే ఉన్నాయని తెలిపారు. ఇదేంటో అర్థం కాలేదని, అన్నీ సినిమాలో బ్రహ్మాండంగా పెట్టారంటూ కామెంట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్‍లో గత హయాంలో 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ).. గతేడాది ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలిచింది. వైసీపీనే టార్గెట్ చేసుకొనే పృథ్వి ఈ కామెంట్లు చేశారని ఆ పార్టీకి చెందిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహిస్తున్నారు. గతంలో వైసీపీలోనే ఉన్న పృథ్వి బయటికి వచ్చి జనసేనలో చేరారు. అప్పటి నుంచి వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. తాజా లైలా ఈవెంట్లోనూ ఆ పార్టీని టార్గెట్ చేసినట్టే కనిపించిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
బాయ్‍కాట్ చేయాలంటూ..
లైలా సినిమాను బాయ్‍కాట్ చేయాలంటూ వైసీపీ మద్దతుదారులు కొందరు మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో #BoycottLaila అనే హ్యాష్‍ట్యాగ్ ఎక్స్ (ట్విట్టర్)లో ట్రెండ్ అవుతోంది. పృథ్వితో లైలా టీమ్ సారీ చెప్పించాలని, లేకపోతే మూవీని అడ్డుకుంటామని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు. విశ్వక్‍సేన్ మూవీకి ఇది తలనొప్పిగా మారిందని, వివరణ ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని మరికొందరు అంటున్నారు.
పృథ్వి చేసిన కామెంట్లు లైలా సినిమాకు ఇబ్బందులను తెచ్చిపెట్టేలా ఉంది. దీంతో ప్రెస్‍మీట్ పెట్టి ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కూడా మూవీ టీమ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పృథ్వి చెప్పిన సీన్‍కు రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
లైలా చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించారు. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ పొలిటికల్ కామెంట్ చేశారు. తాను గతంలో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనే పవన్ కల్యాణ్ నెలకొల్పిన జనసేనగా రూపాంతం చెందిందని అన్నారు. దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి . ఇన్నాళ్లు ఏమీ చెప్పకుండా జనసేన సక్సెస్ అయ్యాక ఈ కామెంట్ చేయడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం