యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక చిత్రం ‘గామి’ కమర్షియల్‍గా హిట్ అయింది. మంచి సినిమాగా ప్రశంసలు అందుకున్న ఈ అడ్వెంచర్ డ్రామా మూవీ.. కలెక్షన్లకు కూడా బాగానే దక్కించుకుంది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ గామి చిత్రం మార్చి 8న థియేటర్లలో రిలీజై హిట్‍గా నిలిచింది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు గామి చిత్రం టీవీ ఛానెల్‍లో ప్రసారమయ్యేందుకు సిద్ధమైంది.
గామి సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్‍లో జూలై 21వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. త్వరలో అంటూ కొంతకాలంగా ఆ ఛానెల్ ఊరిస్తూ వచ్చింది. ఎట్టకేలకు తాజాగా డేట్, టైమ్ రివీల్ చేసింది. జూలై 21న, సాయంత్రం 6 గంటలకు గామి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అవుతుందని ప్రోమో రిలీజ్ చేసింది జీ తెలుగు.
గామి సినిమా ఏప్రిల్‍లో జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కించుకుంది. కొన్ని వారాలు టాప్‍లో ట్రెండ్ అయింది. థియేటర్లలో, ఓటీటీలో మంచి సక్సెస్ అయిన గామి చిత్రం టీవీలో తొలిసారి ప్రసారానికి ఎంత టీఆర్పీ సాధిస్తుందనేది ఆసక్తికరంగా ఉంది.
గామి సినిమాలో విశ్వక్‍సేన్‍తో పాటు చాందినీ చౌదరి, అభినయ, హారిక పెద్ద, మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి కీలకపాత్రలు పోషించారు. స్పర్శతో ఇబ్బంది ఉండే అఘోర పాత్రలో విశ్వక్ నటన అందరినీ మెప్పించింది. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ విద్యాధర్ కాగిత తెరకెక్కించారు. సుమారు ఆరేళ్లు ఈ చిత్రంపైనే పని చేశారు. పరిమిత బడ్జెట్‍లోనే క్వాలిటీ విజువల్స్, ఔట్‍పుట్‍తో భేష్ అనిపించుకున్నారు. కథనం కూడా విభిన్నంగా ఆకట్టుకుంది. ఓవరాల్‍గా గామి మూవీ మంచి చిత్రంగా నిలిచింది.
గామి చిత్రాన్ని వీ సెల్యులాయిడ్స్, కార్తిక్ కల్ట్ క్రియేషన్స్ నిర్మించాయి. కార్తిక్ శబరీశ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి నరేశ్ కుమారన్, స్వీకర్ అగస్థి సంగీతం ఇచ్చారు. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. ఈ మూవీలో విజువల్స్ ఆకట్టుకున్నాయి.
గామి సినిమా అద్భుతమైన ఓపెనింగ్ అందుకుంది. ఈ చిత్రానికి తొలి రోజే ఏకంగా రూ.9కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత కూడా జోరు చూపింది. అయితే, ఫుల్ రన్‍లో ఈ చిత్రం సుమారు రూ.25కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని అంచనాలు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‍తోనే రూపొందించిన ఈ మూవీ మంచి వసూళ్లతో హిట్‍గా నిలిచింది.
విశ్వక్‍సేన్ ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మెకానిక్ రాకీ’లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా చేస్తున్నారు. ఈ మూవీకి తేజ ముల్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో లైలా మూవీని కూడా విశ్వక్ చేయనున్నారు. ఈ చిత్రంలో లేడీ గెటప్‍లో కనిపించనున్నారు. ఇక, జాతి రత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్ చెప్పిన ఓ కథ కూాడా విశ్వక్‍సేన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
టాపిక్