avak review | అశోకవనంలో అర్జున కళ్యాణం రివ్యూ.. టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్ మూవీ
అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ: ప్రేమకథల్లోనే ఎక్కువగా కనిపించిన విశ్వక్‌సేన్ తొలిసారి తన పంథాకు భిన్నంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథాంశంతో చేసిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింతా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
సినిమాలతో కంటే వివాదాలతోనే తెలుగు చిత్రసీమలో ఎక్కువగా గుర్తింపును తెచ్చుకున్నారు విశ్వక్‌సేన్. అతడి సినిమా విడుదల అవుతుందంటే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతూనే ఉంటుంది. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల చేసిన ఓ ఫ్రాంక్ వీడియో వివాదాస్పదమైంది. ప్రమోషన్స్ పేరుతో న్యూసెన్స్ చేస్తున్నాడంటూ విశ్వక్‌సేన్‌పై విమర్శలొచ్చాయి. ఈ ఫ్రాంక్ వీడియోపై ఓ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లోకి విశ్వక్‌సేన్ అనుమతి లేకుండా ప్రవేశించడం, యాంకర్‌తో గొడవలు పడటం హాట్‌టాపిక్‌గా మారింది.
సినిమాపై బజ్‌ను క్రియేట్ చేయడానికి విశ్వక్‌సేన్ వేసిన ఎత్తుగడ ఇదని కొందరు పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన అశోకవనంలో అర్జునకళ్యాణం ఎలా ఉందంటే..
అర్జున్ పెళ్లి కష్టాలు
అశోకవనంలో అర్జున కళ్యాణం కథలో అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్) కథానాయకుడు. సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. 33 ఏళ్లు వచ్చినా అతడికి పెళ్లి కాదు. బంధువులతో పాటు కుటుంబ సభ్యుల పోరు భరించలేక ఆంధ్రాకు చెందిన మాధవి(రుక్సర్ థిల్లాన్) అనే అమ్మాయితో ఇంటర్ కాస్ట్ అరేంజ్‌డ్ మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటాడు. ఎంగేజ్‌మెంట్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రా వెళతాడు.
నిశ్చితార్థం పూర్తయిన తర్వాత ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పెళ్లికూతురి ఇంట్లోనే వారందరూ చిక్కుకుపోతారు. అర్జున్‌తో మాధవి ముభావంగా ఉంటుంది. ఆమెకు తాను ఇష్టమో కాదో తెలుసుకునేందుకు మెసేజ్ చేస్తాడు. ఆమె నుంచి పాజిటివ్ రిప్లై రావడంతో అర్జున్ ఊహల్లో తేలిపోతాడు.
కానీ ఆ మెసేజ్‌లు చేసింది మాధవి చెల్లెలు వసుధ (రితికా నాయక్) అనే నిజం అర్జున్‌కు తెలుస్తుంది. ఇంతలోనే మరో అబ్బాయిని ఇష్టపడిన మాధవి అతడితో వెళ్లిపోతుంది. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? పెళ్లికూతురు లేచిపోయినా కూడా ఆమె ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి అర్జున్‌తో పాటు అతడి కుటుంబానికి ఎందుకువచ్చింది? నిజమైన ప్రేమ విలువను అర్జున్ ఎలా తెలుసుకున్నాడు? అర్జున్‌ను ఇష్టపడిన వసుధ అతడిని పెళ్లి చేసుకుందా లేదా అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
పెళ్లికి వయసు అడ్డు కాదు
పెళ్లికి వయసు అడ్డంకి కాదు. ఆలస్యమైనా నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోవడం ముఖ్యం. తొందరపడితే జీవితంలో అనర్థాలే మిగులుతాయనే అంశాన్ని వినోదాత్మక పంథాలో ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రమిది. ఈ సున్నితమైన పాయింట్‌కు ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో ఆహారపు అలవాట్లు, భాషాపరంగా ఉండే భేదాల్నిచాటిచెబుతూ సినిమాతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు దర్శకరచయితలు.
కామెడీ వర్కవుట్ అయ్యింది..
33 మూడు ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదనే ఫ్రస్ట్రేషన్ కారణంగా అర్జున్‌కు బంధువుల నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలతో సినిమాను ఆసక్తికరంగా మొదలుపెట్టారు దర్శకుడు. పెళ్లి కోసం కుటుంబంతో కలిసి ఆంధ్రాలోని పెళ్లికూతురు ఇంటికి అర్జున్ ఫ్యామిలీరావడం , అక్కడి అతిథి మర్యాదల కారణంగా మొహమాటస్తుడైన హీరో పడే ఇబ్బందుల నుంచి చక్కటి కామెడీ వర్కవుట్ అయ్యింది. ఆ సీన్స్ అన్ని నవ్విస్తాయి. మాధవికి తాను ఇష్టమో కాదో తెలుసుకునేందుకు అర్జున్ చేసే ప్రయత్నాలు బెడిసికొట్టడం..అయినా కూడా పట్టువదలకుండా ఆమె చుట్టూ అతడు తిరుగుతూ ఉండే సన్నివేశాలను సహజంగా రాసుకున్నారు. కామెడీ ట్రాక్ లతో ప్రథమార్థాన్ని దర్శకుడు ఆహ్లాదభరితంగా నడిపించారు.
మాధవి ఇంట్లో నుంచి వెళ్లిపోయే సన్నివేశంతో విరామంలో ట్విస్ట్ ఇచ్చిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా ఎమోషనల్ రైడ్‌గా తెరకెక్కించారు. వసుధతో అర్జున్ ప్రేమకథను చూపిస్తూనే మరోవైపు నిజమైన ప్రేమ విలువను అతడు ఎలా తెలుసుకున్నాడనే సన్నివేశాలను ఉద్వేగభరితంగా తీర్చిదిద్దాడు. వాటిలో కూడా అంతర్లీనంగా కామెడీని మిస్ కాకుండా జాగ్రత్తపడ్డారు.
గత సినిమాలకు భిన్నంగా..
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాలు చేసిన విశ్వక్‌సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణంతో ఫ్యామిలీ బాట పట్టారు. గత సినిమాలకు భిన్నమైన క్యారెక్టరైజేషన్ తో కనిపించాడు. మాస్ డైలాగ్స్, హీరోయిజం ఛాయలు లేకుండా తన పంథాకు పూర్తి భిన్నంగా ఓ అమాయకుడైన యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు.
పెళ్లి ఆగిపోయి బంధువులు, సమాజం దృష్టిలో చులకనైపోయి నిత్యం సంఘర్షణకు లోనయ్యే యువకుడిగా చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. పతాక ఘట్టాల్లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో విశ్వక్‌సేన్ అభినయపరంగా పరిణితిని కనబరిచాడు. రుక్సర్ థిల్లాన్‌తో పోలిస్తే రితికా నాయక్ యాక్టింగ్ బాగుంది. అల్లరితనంతో పాటు జీవితం పట్ల నిర్ధిష్టమైన లక్ష్యాలున్నయువతిగా ఆమె క్యారెక్టర్‌ను దర్శకుడు చక్కగా తీర్చిదిద్దారు.
గోపరాజు రమణ, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, కాదంబరి కిరణ్ కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఆడపెళ్లివారిలో వంకలు వెతుకుతూ వారిని అనుక్షణం సూటిపోటి మాటలతో ఇబ్బందిపెట్టే పాత్రలో గోపరాజు రమణ చెప్పే ప్రతి డైలాగ్ థియేటర్‌లో నవ్వులను పండించింది. అతిథి మర్యాదల పేరుతో హడావిడి చేసే వ్యక్తిగా కాదంబరి కిరణ్‌కు చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దక్కింది.
స్క్రీన్ ప్లే బాగుంది..
రచయితగా, డైలాగ్ రైటర్‌గా ఈ సినిమాతో రవికిరణ్ ప్రతిభను చాటుకున్నారు. సింపుల్ పాయింట్ ను ఎంచుకొని ఎమోషన్స్, కామెడీ మేళవిస్తూ చక్కటి కథను రాసుకున్నారు. రెండింటికి సమప్రాధాన్యతనిస్తూ స్క్రీన్ ప్లే అల్లుకున్న విధానం బాగుంది. దర్శకుడిగా విద్యాసాగర్ చింతా ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా సినిమాను తెరకెక్కించారు. జయ్ క్రిష్ బాణీల్లో ఓ ఆడపిల్ల పాట బాగుంది.
వినోదమే బలం
వినోదానికి లోటు లేని మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా అశోకవనంలో అర్జున కళ్యాణం నిలుస్తుంది. కథ, కథనాలు పాతవే అయినా తమ రైటింగ్ టాలెంట్‌తో దర్శకరచయితలు ఆ లోపాలను కనబడనీయకుండా చేస్తూ ప్రేక్షకులను నవ్వించడంలో పూర్తిగా విజయవంతం అయ్యారు.
రేటింగ్ 3/5
సంబంధిత కథనం
టాపిక్