Pekamedalu Review: వినోద్ కిషన్, అనూష కృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన పేకమేడలు మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎవ్వరికీ చెప్పొద్దు హీరో రాకేష్ వర్రే ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించాడు. ఈ చిన్న సినిమా ఎలా ఉందంటే?
లక్ష్మణ్ (వినోద్ కిషన్) , వరలక్ష్మి అలియాస్ వరాలు (అనూష కృష్ణ) భార్యభర్తలు. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో జీవిస్తుంటారు. లక్ష్మణ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. . డీల్ సెట్ అయితే లక్షల్లో డబ్బు వస్తుందని మాటలతోనే కోటలు కడుతుంటాడు. లక్ష్మణ్ సెట్ చేసిన ఏ డీల్ సక్సెస్ అవ్వదు. కుటుంబ బాధ్యతల్ని పట్టించుకోకుండా భార్య కష్టంపై ఆధారపడుతూ జల్సాలు చేస్తుంటాడు.
భర్త ఎప్పటికైనా బాగుపడతాడని ఆశగా ఎదురుచూస్తుంటుంది వరలక్ష్మి. ఎన్ని తప్పులు చేసినా అతడిని పల్తెత్తూ మాట కూడ అనదు. అలాంటి టైమ్‌లోనే అమెరికా నుంచి భర్త, పిల్లల్ని వదిలేసి వచ్చిన శ్వేత (రితికా శ్రీనివాస్) లక్ష్మణ్ లైఫ్‌లోకి వస్తోంది. అప్పులు చేసి మరి రిచ్ పర్సన్‌గా ఆమెకు దగ్గరవుతాడు లక్ష్మణ్. శ్వేత మాయలో పడి భార్య, పిల్లలను దూరం పెడతాడు లక్ష్మణ్.
మరోవైపు లక్ష్మణ్ డాబు, దర్పం చూసి అతడితోనే ఉండిపోవాలని శ్వేత నిర్ణయించుకుంటుంది? ఆ తర్వాత ఏమైంది? భర్త ప్రవర్తనతో విసిగిపోయిన వరలక్ష్మి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? భార్యకు విడాకులు ఇవ్వాలని లక్ష్మణ్ ఎందుకు అనుకున్నాడు? లక్ష్మణ్ అబద్దాల గురించి శ్వేతకు తెలిసేలా చేసింది ఎవరు? లక్ష్మణ్‌లో మార్పు వచ్చిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
జీవితంలో పైకి రావడానికి షార్ట్‌కట్‌లు ఉండవని, కష్టపడితేనే ఎదగగలమనే సందేశానికి కామెడీని జోడించి దర్శకుడు నీలగిరి మామిళ్ల పేక మేడలు మూవీని తెరకెక్కించాడు. సొసైటీలో రియల్ ఎస్టేట్ బిజినెస్‌లు, వందల కోట్ల డీల్‌లూ అంటూ గాల్లోనే మేడలు కట్టే బ్యాచ్‌లు చాలా మంది కనిపిస్తారు.
అలాంటి వారి మనస్తత్వాల నుంచి స్ఫూర్తి పొందుతూ కథను రాసుకున్నాడు. ఈ పాయింట్‌ను సీరియస్‌గా కాకుండా ఆద్యంతం వినోదాత్మకంగానే సినిమాలో ఆవిష్కరించాడు డైరెక్టర్. మెసేజ్ కూడా క్లాస్ పీకుతున్నట్లుగా సీరియస్‌గా కాకుండా షుగర్ కోటెడ్‌లా సింపుల్‌గానే ఉండేలా జాగ్రత్తపడ్డాడు.
బస్తీ లైఫ్‌ను, అక్కడి ప్రజల మనస్తత్వాలను కళ్లకు కట్టినట్లుగా పేక మేడలు మూవీలో చూపించాడు డైరెక్టర్. పక్కవాళ్ల గొడవల పట్ల జనాల్లో ఆసక్తి ఎలా ఉంటుంది...ఈజీమనీ కోసం చేసే ప్రయత్నాలు నిజంగా ఎలా ఉంటాయన్నది సినిమాలో చూపించాడు. బాధ్యత లు విస్మరించి బలాదూర్‌గా తిరిగే భర్త, రెక్కలు ముక్కలు చేసుకొని సంసార సాగరాన్ని ఈదే భార్య కథలతో తెలుగులో ఇదివరకు చాలా సినిమాలు వచ్చాయి.
పేక మేడలు ఆ కోవకు చెందిన సినిమానే. జేబులో రూపాయి లేకపోయినా హీరో కొట్టే ఫోజులు, మాటలతోనే ఎదుటివారికి బురిడీ కొట్టించడం లాంటి సీన్స్ నుంచి ఫన్ చక్కగా జనరేట్ అయ్యింది. శ్వేత క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత కథ ఆసక్తికరంగా మారుతుంది. డబ్బున్న వాడిగా ఆమె ముందు నటించేందుకు లక్ష్మణ్ చేసే ప్రయత్నాల నుంచి చక్కటి కామెడీని డైరెక్టర్ రాబట్టుకున్నాడు. లక్ష్మణ్‌లో మార్పు వచ్చే సీన్‌తో ఎమోషనల్‌గా సీన్‌ను ఎండ్ చేశాడు డైరెక్టర్.
పేకమేడలు మూవీలో ప్రతి సీన్‌తో ప్రేక్షకులను నవ్వించాలనే ప్రయత్నించాడు డైరెక్టర్. ఎమోషన్స్‌ను కామెడీ కొన్ని చోట్ల డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. లక్ష్మణ్‌లో మార్పు వచ్చే సీన్స్ మరింత బాగా రాసుకుంటే బాగుండేది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఎండ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
లక్ష్మణ్ పాత్రలో వినోద్ కిషన్ యాక్టింగ్ బాగుంది. బస్తీ కుర్రాడిగా తన హావభావాలు, మ్యానరిజమ్స్‌తో మెప్పించాడు. వరలక్ష్మిగా అనూషకృష్ణ నాచురల్ పర్మార్ఫెన్స్‌ను కనబరిచింది. డీ గ్లామర్ పాత్రకు న్యాయం చేసింది. రితికి శ్రీనివాస్ నటన ఓకే అనిపిస్తుంది.
పేక మేడలు టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్ మూవీ. కామెడీ కోసం ఆశించి థియేటర్‌లో అడుగుపెడితే డిసపాయింట్ చేయదు.
రేటింగ్: 3/5
టాపిక్