OTT Crime Thriller: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్.. తప్పక చూడాలంటున్న నెటిజన్లు!
Sector 36 OTT Streaming: సెక్టార్ 36 చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుటోంది. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తెలుగు డబ్బంగ్‍లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీల్లో మరో క్రైమ్ థ్రిల్లర్ చిత్రం క్లిక్ అయింది. ఇటీవలి కాలంలో ఈ జానర్ చిత్రాలు ఓటీటీల్లో ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. తాజాగా ‘సెక్టార్ 36’ కూడా ఆ లిస్టులో చేరేలా కనిపిస్తోంది. నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాసే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఓటీటీలో దూసుకెళుతోంది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
సెక్టార్ 36 సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ శుక్రవారం (సెప్టెంబర్ 13) స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే అడుగుపెట్టింది. హిందీతో పాటు తెలుగు, ఇంగ్లిష్, తమిళం భాషల్లోనూ నెట్‍ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
సెక్టార్ 36 చిత్రానికి ఆదిత్య నిబంల్కర్ దర్శకత్వం వహించారు. నిథారీ కిల్లింగ్ పేరుతో పాపులర్ అయిన 2006 నోయిడా వరుస హత్యల ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. థ్రిల్లింగ్ కథనంతో ఈ చిత్రాన్ని ఆదిత్య ముందుకు నడిపారు.
నెటిజన్ల రియాక్షన్ ఇదే
సెక్టార్ 36 చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసిన చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ మూవీ స్టోరీ బాగుందని, దీన్ని తెరకెక్కించిన విధానంగా మరింత ఉత్కంఠభరితంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. విక్రాంత్ మాసే, దీపక్ దోబ్రియల్ సహా ఈ మూవీలో నటించిన అందరి పర్ఫార్మెన్స్ మెప్పించిందని పోస్టులు చేస్తున్నారు. ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారంటూ డైరెక్టర్ ఆదిత్యను ప్రశంసిస్తున్నారు.
క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు సెక్టార్ 36 మూవీని మిస్ కావొద్దని చాలా మంది సూచిస్తున్నారు. ఈ సినిమాలో కథనం, థ్రిల్లింగ్ అంశాలు ఎంగేజింగ్‍గా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఇంటరాగేషన్ సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి ఘోరమైన నేరాలు సమాజంలో జరిగాయని తలుచుకుంటే భయంగా ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే, సెక్టార్ 36 సినిమా బాగున్నా.. హింస కాస్త ఎక్కువగానే ఉందని కొందరు పోస్టులు చేస్తున్నారు. కుటుంబంతో, పిల్లలతో కలిసి చూడొద్దని అంటున్నారు.
సెక్టార్ 36 చిత్రంలో విక్రాంత్ మాసే, దీపక్‍తో పాటు ఆకాశ్ ఖురానా, దర్శన్ జరివాలా, బహురుల్ ఇస్లాం, ఇహానా కౌర్, తనుశ్రీ దాస్, సుబీర్, కుచో అహ్మద్ కీలకపాత్రలు పోషించారు. ఆదిత్య నింబల్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ పతాకాలపై దినేశ్ విజన్, జ్యోతి దేశ్‍పాండే నిర్మించారు. ఈ చిత్రానికి నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు.
సెక్టార్ 36 స్టోరీలైన్
నోయిడాలోని సెక్టార్ 36లో పిల్లలను హత్య చేసిన ఓ సైకోకిల్లర్ చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. హత్య చేసిన కేసుల్లో నిందితుడు ప్రేమ్ సింగ్ (విక్రాంత్ మాసే)ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతడిని పోలీస్ ఆఫీసర్ రామ్ చరణ్ పాండే (దీపక్ దోబ్రియల్) విచారిస్తారు. ఇన్వెస్టిగేషన్‍లో చాలా భయానక విషయాలు చెబుతాడు ప్రేమ్ సింగ్. యథార్థ ఘటన స్ఫూర్తితో తెరకెక్కించినా.. ఈ మూవీలో కొన్ని కల్పిత అంశాలను జోడించారు మేకర్స్.