Vikram Thangalaan: కేజీఎఫ్ వెనుక అసలు కథేంటో చెప్పనున్న విక్రమ్ తంగలాన్.. ఇదీ స్టోరీ
Vikram Thangalaan: తమిళ స్టార్ నటుడు విక్రమ్ నటిస్తున్న తంగలాన్ మూవీ కేజీఎఫ్ వెనుక అసలు కథను వెలికి తీయనుంది. ఈ విషయాన్ని మేకర్సే వెల్లడించడం గమనార్హం.
Vikram Thangalaan: చియాన్ విక్రమ్, పా రంజిత్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ తంగలాన్. ఈ మూవీ జనవరిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా ఆలస్యమైంది. అయితే ఈ మూవీ స్టోరీ గురించి మేకర్స్ కీలకమైన హింట్ ఇచ్చారు. కర్ణాటకలో ఉన్న కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) అసలు కథేంటి? ఇక్కడి నుంచి బ్రిటీష్ వాళ్లు బంగారం ఎలా దోచుకొని వెళ్లారు? అనే తెర వెనుక స్టోరీని వెలికి తీయనున్నట్లు చెప్పారు.
విక్రమ్ తంగలాన్ కథేంటి?
కేజీఎఫ్ పేరుతో కన్నడలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండూ సూపర్ హిట్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చుట్టూ ఈ కథ తిరిగినా.. దాని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటో మాత్రం అందులో లేదు. అయితే ఇప్పుడు తమిళంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ తంగలాన్ మాత్రం ఈ కేజీఎఫ్ వెనుక ఉన్న అసలు కథేంటో చెప్పనుంది. ప్రపంచంలోని అతి పెద్ద గోల్డ్ మైన్స్ లో ఇదీ ఒకటి.
దీని కారణంగానే ఇండియాను బ్రిటీష్ వాళ్లు బంగారు పక్షిగా పిలిచేవాళ్లు. ఈ కేజీఎఫ్ నుంచే వాల్లు సుమారు 900 టన్నుల బంగారాన్ని ఇంగ్లండ్ కు తీసుకెళ్లారు. ఈ కేజీఎఫ్ వెనుక దాగి ఉన్న అసలు స్టోరీ చాలా మందికి తెలియదు. ఇప్పుడా విషయాన్ని తమ తంగలాన్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ చెప్పారు.
తంగలాన్‌లో ఏం చూపిస్తారు?
విక్రమ్ నటిస్తున్న తంగలాన్ మూవీ నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. అక్కడి వాళ్లు కేజీఎఫ్ మైన్స్ ను బ్రిటీష్ వాళ్ల నుంచి ఎలా కాపాడుకున్నారన్నది ఈ సినిమాలో చూపించనున్నారు. 19వ శతాబ్దంలో జరిగిన ఘటనలను ఈ తంగలాన్ లో చూపించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ మూవీలో విక్రమ్ లుక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టీజర్ కూడా ఇప్పటికే రిలీజైంది. అది విక్రమ్ ఓ పామును మెలి తిప్పి, రెండు ముక్కలుగా చేసి చంపే సీన్ తో మొదలవుతుంది. అసలు ఇందులో విక్రమ్ గుర్తు పట్టరాని విధంగా ఉన్నాడు. ఈ సినిమాను ఈ ఏప్రిల్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. గతేడాది మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 2 తర్వాత విక్రమ్ నటించిన మూవీ తంగలాన్.
విక్రమ్ తంగలాన్ మూవీ పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తంగలాన్ రిలీజ్ కానుంది. స్టూడియో గ్రీన్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు డేనియల్ గోల్డ్రాగన్ కూడా నటిస్తున్నాడు.