Varisu Release Date: వారిసు రిలీజ్ డేట్ సస్పెన్స్‌కు బ్రేక్- విజయ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే
Varisu Release Date: విజయ్ వారిసు సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందంటే...
Varisu Release Date: దళపతి విజయ్ (Thalapathy Vijay) వారిసు సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ గురువారం అనౌన్స్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న వారిసు సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
తొలుత ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే వారిసు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో విజయ్ అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. బుధవారం వారిసు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తన కుటుంబానికి ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా పరిష్కరించే యువకుడిగా ఈ ట్రైలర్‌లో విజయ్ డిఫరెంట్‌గా కనిపించాడు. అతడి లుక్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాను తెలుగులో వారసుడు పేరుతో జనవరి 11నే రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. వారిసులో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు (DilRaju) వారిసు సినిమాను నిర్మిస్తోన్నారు. తమిళంలో ఆయన నిర్మిస్తోన్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
శరత్‌కుమార్, జయసుధ, శామ్, శ్రీకాంత్, సంగీతతో పాటు పలువురు కోలీవుడ్, టాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తోన్నారు. వారిసుతో పాటుగా జనవరి 11న అజిత్ తునివు కూడా రిలీజ్ కాబోతున్నది. ఒకేరోజు ఇద్దరు అగ్ర హీరోలు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీపడటం ఆసక్తికరంగా మారింది.