Crime Thriller: విజయ్ సేతుపతి వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే - తెలుగులోనూ స్ట్రీమింగ్
Crime Thriller: విజయ్ సేతుపతి హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ మహారాజ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళంలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Crime Thriller: మహారాజ (Maharaja) మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత పెద్ద హిట్‌ను అందుకున్నాడు విజయ్ సేతుపతి. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వంద కోట్ల వసూళ్లను రాబట్టింది. తెలుగుతో పాటు తమిళంలో నిర్మాతలకు లాభాల పంటను పడించింది. తెలుగులోనూ మహారాజ టైటిల్‌తోనే డబ్ అయిన ఈ మూవీ ఇరవై కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. కేవలం మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు ఐదింతల లాభాలను తెచ్చిపెట్టింది. తెలుగులో (Tollywood) డబ్ అయిన విజయ్ సేతుపతి మూవీస్‌లో మహరాజ అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా మహారాజ నిలిచింది.
నెట్‌ఫ్లిక్స్‌లో...
ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. జూలై 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజు రిలీజ్ కానున్నట్లు తెలిసింది. మహారాజ ఓటీటీ రిలీజ్ డేట్‌పై జూలై సెకండ్ వీక్‌లో ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు చెబుతోన్నారు.
రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్...
మహారాజ సినిమాకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామి కీలక పాత్రల్లో నటించారు. తన కూతురిపై జరిగిన అన్యాయానికి ఓ తండ్రి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే పాయింట్‌తో క్రైమ్ రివేంజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు నితిలన్ సామినాథన్ మహారాజ మూవీని తెరకెక్కించాడు.
మహారాజ కథ ఇదే...
మహారాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. తన కూతురితో కలిసి సిటీకి దూరంగా ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. ఓ రోజు తన ఇంటిపై కొందరు దాడిచేసి లక్ష్మిని ఎత్తుకుపోయారని మహారాజ పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. ఇంతకు లక్ష్మి ఎవరు? అతడి కంప్లైంట్‌ను పోలీసులు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు. తన కూతురిపై జరిగిన అన్యాయానికి మహారాజ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
50వ మూవీ...
మహారాజ కథతో పాటు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) యాక్టింగ్‌పై ప్రశంసలు దక్కుతోన్నాయి. హీరోగా విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ సినిమా ఇది. మహారాజకు ముందు విజయ్ సేతుపతి నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. డీఎస్‌పీ, యాదుమ్ ఒరే యావరుమ్ కెలిర్, మా మనితాన్‌తో పాటు పలు సినిమాలు ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి.
హీరోగా...విలన్‌గా...
ప్రస్తుతం హీరోగానే కాకుండా విలన్‌గా నటిస్తూ వైవిధ్యతను చాటుకుంటోన్నాడు విజయ్ సేతుపతి. కమల్‌హాసన్ విక్రమ్‌తో (Vikram Movie) పాటు షారుఖ్‌ఖాన్ జవాన్‌లో నెగెటివ్ షేడ్స్ రోల్‌లో అదరగొట్టాడు. తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్‌గా కనిపించాడు. ప్రస్తుతం తమిళంలో గాంధీ టాక్స్ పేరుతో ఓ మూవీ సినిమా చేస్తోన్నాడు విజయ్ సేతుపతి. ఈ మూవీలో అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరీ కీలక పాత్రల్లో నటించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై 2 లో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్నాడు.