రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు బ్యాడ్‍న్యూస్ ఇది. కింగ్‍డమ్ సినిమా విడుదల వాయిదా పడింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారనే హైప్ ఉంది. అయితే, మే 30న విడుదల కావాల్సిన కింగ్‍డమ్ వాయిదా పడింది. కొత్త తేదీ ఖరారైంది. ఈ వివరాలను మూవీ టీమ్ నేడు (మే 14) అధికారికంగా వెల్లడించింది.
కింగ్‍డమ్ రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు ఈ మూవీని నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ఓ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దేశంలో ప్రస్తుతం వాతావరణంలో ప్రమోషన్లు, సెలెబ్రేషన్లు చేయడం సరికాదని అనుకుంటున్నామని, అందుకే పోస్ట్ పోన్ చేస్తున్నామని పేర్కొంది.
ఈ వాయిదా వల్ల కింగ్‍డమ్ మూవీని మరింత అద్భుతంగా తీసుకొస్తామని సితార ఎంటర్‌టైన్‍మెంట్ పేర్కొంది. “మే 30వ తేదీన విడుదల కావాల్సిన కింగ్‍డమ్‍ను వాయిదా వేస్తున్నాం. చెప్పిన తేదీకే తీసుకురావాలని అన్ని విధాల కష్టపడ్డాం. దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని ఘటనలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రమోషన్లు, సెలెబ్రేషన్లతో మేం ముందుకు వెళ్లలేం” అని వెల్లడించింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందుకు ఇప్పుడు విడుదల చేయడం లేదని తెలిపింది.
కింగ్‍డమ్ చిత్రాన్నిఈ ఏడాది జూలై 4వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరింత సమయం దొరకడం వల్ల ఈ మూవీని మరింత బాగా తీసుకొచ్చేందుకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నట్టు పేర్కొంది. వాయిదాకు అంగీకరించిన దిల్‍రాజు, నితిన్‍కు థ్యాంక్స్ చెప్పింది. ఈ చిత్రాన్ని వారే డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.
కింగ్‍డమ్ సినిమా వాయిదా పడడం ఇది రెండోసారి. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఆ డేట్ నుంచి మే 30వ తేదీకి రిలీజ్ మారింది. ఇప్పుడు ఏకంగా జూలై 4వ తేదీకి వాయిదా పడింది. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత కాలం కొనసాగనున్నాయి.
కింగ్‍డమ్ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. విజయ్ దేవకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇటీవలే వచ్చి ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.
సంబంధిత కథనం