టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండకు కారు ప్రమాదం జరిగిన విషయం తెలుసు కదా. దీనిపై అతడు అధికారికంగా స్పందించాడు. సోమవారం (అక్టోబర్ 6) సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి సమీపంలో జరిగిన ఒక ప్రమాదం నుంచి ఈ నటుడు సురక్షితంగా బయటపడ్డాడు. దీనిపై విజయ్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించాడు. తాను బాగానే ఉన్నానని, అభిమానులు 'టెన్షన్ పడొద్దు' అని చెప్పాడు.
సోమవారం (అక్టోబర్ 6) సాయంత్రం విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురయ్యాడని తెలియగానే అభిమానులు ఆందోళన చెందారు. దీంతో అతడు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎక్స్ ద్వారా స్పందించాడు. "అంతా బాగానే ఉంది. కారుకు ప్రమాదం జరిగింది. కానీ మేమంతా బాగానే ఉన్నాము. వెళ్లి ఒక స్ట్రెంగ్త్ వర్కౌట్ కూడా చేశాను. ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాను.
నా తల కొంచెం నొప్పిగా ఉంది. కానీ బిర్యానీ, నిద్ర ఫిక్స్ చేయనది ఏముంటుంది చెప్పండి. కాబట్టి మీ అందరికీ పెద్ద హగ్స్. నా లవ్. ఈ వార్త మిమ్మల్ని టెన్షన్ పెట్టకుండా చూసుకోండి" అని ట్వీట్ చేశాడు. కారు ప్రమాదం జరిగిన సమయంలో విజయ్ వాహనంలోనే ఉన్నాడు. కానీ అతనికి ఎలాంటి గాయాలు కాలేదు.
నటి రష్మిక మందన్నతో నిశ్చితార్థం వార్తలు సోషల్ మీడియాలో వచ్చిన కొద్ది రోజుల తర్వాత.. విజయ్ తన కుటుంబంతో కలిసి పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహా సమాధిని సందర్శించారు. ఈ నిశ్చితార్థం వార్తను వీరిద్దరూ ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు.
ఎక్స్ లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండ, తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి లతో కలిసి కనిపించాడు. పుట్టపర్తి మేనేజ్‌మెంట్ ఆయనకు స్వాగతం పలికి సత్యసాయిబాబా చిత్రపటాన్ని, ఒక పూలగుచ్ఛాన్ని అందజేసి లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అభిమానుల దృష్టి విజయ్ పెట్టుకున్న నిశ్చితార్థపు ఉంగరం పైనే పడింది.
విజయ్ రష్మిక 2018లో వచ్చిన 'గీత గోవిందం' లో కలిసి పనిచేసినప్పటి నుండి డేటింగ్‌లో ఉన్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. 'డియర్ కామ్రేడ్' చిత్రంలో కూడా వారు కలిసి నటించారు. 2023లో వారు మాల్దీవుల్లో కలిసి వెకేషన్‌లో ఉన్నారని అభిమానులు గుర్తించడంతో వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వదంతులు మరింత పెరిగాయి. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ చివరిగా 'కింగ్డమ్' సినిమాలో కనిపించాడు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం