Vijay Deverakonda Betting: బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారంటూ విజయ్ దేవరకొండపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై అతని టీమ్ స్పందించింది. చట్టపరంగా అనుమతించిన ఆన్లైన్ నైపుణ్య ఆధారిత గేమ్స్ ను మాత్రమే అతను ప్రమోట్ చేశాడని, చట్టవిరుద్ధ బెట్టింగ్ కాదని వారు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటికే రానా దగ్గుబాటి,ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు కూడా దీనిపై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పరిమిత కాలం పాటు వ్యవహరించారని, లీగల్ గేమ్స్ కు మాత్రమే సపోర్ట్ చేశారని విజయ్ దేవరకొండ టీమ్ స్పష్టం చేసింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనే ఉద్దేశంతోనే విజయ్ దేవరకొండ అధికారికంగా ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని అతని టీమ్ తెలిపింది.ఆన్లైన్ నైపుణ్య ఆధారిత గేమ్స్ చట్టబద్ధంగా అనుమతించిన ప్రాంతాల్లోనే ప్రమోట్ చేసినట్లు చెప్పింది.
రమ్మీ వంటి ఆన్లైన్ గేమ్స్ సహా నైపుణ్య ఆధారిత ఆటలను గ్యాంబ్లింగ్ లేదా గేమింగ్ కంటే భిన్నమైనవిగా సుప్రీంకోర్టు పదేపదే గుర్తించిందని స్పష్టం చేసిందని ఈ సందర్భంగా విజయ్ టీమ్ వివరణ ఇచ్చింది. ఇలాంటి గేమ్స్ లో అవకాశం కంటే నైపుణ్యం ఉంటుందని, వాటిని చట్టపరంగా అనుమతిస్తామని కోర్టు పేర్కొంది.
విజయ్ చేసిన ప్రతి పని చట్టబద్ధంగా ఉండేలా సంతకం చేయడానికి ముందు అతని లీగల్ టీమ్ ఒప్పందాన్ని సమీక్షించిందని కూడా ఈ సందర్భంగా విజయ్ టీమ్ తెలిపింది. సమగ్ర న్యాయ సమీక్ష తరువాత, అతను నైపుణ్య ఆధారిత గేమింగ్ ప్లాట్‌ఫామ్ ఎ23ను ప్రమోట్ చేయడానికి అంగీకరించాడు. అంతేకాదు ఈ బ్రాండ్ తో అతని ఒప్పందం 2023లోనే ముగిసిందని కూడా అతని టీమ్ స్పష్టం చేసింది.
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలతో నటులు విజయ్, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, లక్ష్మీ మంచు, ప్రణీత, నిధి అగర్వాల్ తో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ లను పాప్ అప్ యాడ్స్, ఇతర మార్గాల ద్వారా ప్రమోట్ చేస్తున్నారని ఫిర్యాదుదారుడు ఆరోపించినట్లు పీటీఐ తెలిపింది.
ఈ ఫిర్యాదు ఆధారంగా మార్చి 19న బీఎన్ఎస్, గేమింగ్ యాక్ట్, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017 ప్రకారం అన్ని రకాల ఆన్ లైన్ బెట్టింగ్ లను నిషేధించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వారికి నోటీసులు జారీ చేయాలని పోలీసులు యోచిస్తున్నారు.
సంబంధిత కథనం