విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ (kingdom) మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. అతని మ్యూజిక్ కు వీరాభిమాని అయిన విజయ్.. తనతో కలిసి పని చేయడంపై తాజాగా సినిమా వికటన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు. ఎన్నో ఏళ్లుగా అతనితో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.
అనిరుధ్ రవిచందర్ తో కలిసి పని చేయడం ఎలా ఉందని అడిగినప్పుడు విజయ్ దేవరకొండ స్పందించిన తీరు భిన్నంగా ఉంది. “నేను వీఐపీ, 3 చూసినప్పుడు అనిరుధ్ తో ప్రేమలో పడిపోయాను. ఎవరీ జీనియస్ అని అనుకున్నాను. ఇతడు సాధారణ వ్యక్తి కాదనిపించింది.
అతనిపై నాకున్న ప్రేమ అసాధారణమైనది. ఆ టైమ్ లో నేనింకా నటనలోకి రాలేదు. కానీ ఎప్పుడైనా నటుడిని అయితే మాత్రం ఇలాంటి మ్యూజికే కావాలని అనుకున్నాను. నేను నటిస్తున్నప్పుడు అతని మ్యూజిక్ కు నటిస్తున్నట్లు అనిపిస్తుంది.
మొత్తానికి అతనితో కలిసి పని చేసే అవకాశం వచ్చినప్పుడు భిన్నంగా అనిపిస్తోంది. ఎన్నో సినిమాలకు అతడు కావాలని అనుకున్నాను. కానీ ఎప్పుడూ కుదరలేదు” అని విజయ్ చెప్పాడు.
ఒకవేళ తాను రాజునైతే అనిరుధ్‌తోపాటు తనకు నచ్చిన ఆర్టిస్టులను కిడ్నాప్ చేయిస్తానని, వాళ్లు తన సినిమాలకు తప్ప మరే సినిమాలకు పని చేయకుండా చేస్తానని అతడు అనడం విశేషం. “నేనోసారి భుజం గాయానికి ఎమ్మారై స్కాన్ చేయించుకున్నాను. దానికి 40 నిమిషాలు పడుతుంది.
మిషన్ లో మనం ఒక్కరమే ఉంటాం. నేను మ్యూజిక్ వినొచ్చా అని అడిగాను. వాళ్లు సరే అనడంతో ఆ 40 నిమిషాలు అనిరుధ్ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేశాను. ఒకవేళ నేను రాజునై ఉంటే మాత్రం.. అతనితోపాటు నాకు ఇష్టమైన ఆర్టిస్టులను కిడ్నాప్ చేయించేవాడిని. వాళ్లు కేవలం నా సినిమాలకే మ్యూజిక్ అందించేలా చేసేవాడిని” అని విజయ్ అన్నాడు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. భాగ్యశ్రీ బోర్సే ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. నిజానికి ఈ మూవీ మే 30న రిలీజ్ కావాల్సి ఉన్నా.. జులై 4కు వాయిదా పడింది.
ఇప్పటికే మూవీ టీజర్ తోపాటు హృదయం లోపల అనే సాంగ్ రిలీజైంది. ఈ రెండింట్లో అనిరుధ్ అందించిన మ్యూజిక్ మరో లెవెల్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ పాట మరో నటుడి సినిమాకు వెళ్లి ఉంటే తాను ఈర్శ్యపడేవాడినని మరో ఇంటర్వ్యూలో విజయ్ చెప్పాడు.
సంబంధిత కథనం