Vijay met Manoj Desai: తనను తిట్టిన థియేటర్ ఓనర్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
Vijay met Manoj Desai: తనను తిట్టిన థియేటర్ ఓనర్‌ను కలిశాడు లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ. ఆ వెంటనే అప్పుడు తిట్టిన ఆ వ్యక్తే ఇప్పుడు విజయ్‌పై ప్రశంసలు కురిపించాడు.
Vijay met Manoj Desai: విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఈ మూవీకి తొలి రోజు నుంచే వచ్చిన నెగటివ్ టాక్ వసూళ్లపై తీవ్రంగా ప్రభావం చూపింది. దీనికితోడు మూవీ ప్రమోషన్లలో బాయ్‌కాట్ ట్రెండ్‌పై విజయ్ చేసిన కామెంట్స్ కూడా లైగర్ కలెక్షన్లపై ఎంతోకొంత ప్రభావం చూపించాయి.
లైగర్ రిలీజైన వెంటనే విజయ్ చేసిన ఆ కామెంట్స్‌పై ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. విజయ్ ఓ అనకొండ.. చాలా అహంకారంగా మాట్లాడాడని, దాని వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ లేక తాము తీవ్రంగా నష్టపోతున్నామని అతడు అన్నాడు. ఇలాగైతే ఓటీటీలో కూడా ఎవరూ నీ సినిమా చూడరు అని కూడా అనడం విశేషం.
ఇప్పుడా మనోజ్ దేశాయ్‌నే విజయ్ దేవరకొండ వ్యక్తిగతంగా వెళ్లి కలిశాడు. ఈ సందర్భంగా మనోజ్ కాళ్లు కూడా మొక్కాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మనోజ్‌ను కలిసి సందర్భంగా తన కామెంట్స్ గురించి వివరణ ఇచ్చాడు. నిజానికి తాను మాట్లాడిన సందర్భం వేరని, సగం వీడియోను వైరల్ చేశారని అతడు చెప్పుకొచ్చాడు. అంతేకాదు మనోజ్ దేశాయ్‌కు క్షమాపణ కూడా చెప్పాడు.
దీంతో మనోజ్ కరిగిపోయాడు. అప్పుడు దారుణంగా తిట్టిన ఆ వ్యక్తే విజయ్‌పై ప్రశంసలు కురిపించాడు. విజయ్ ఆ కామెంట్స్ చేసిన సందర్భం గురించి తెలుసుకున్న తర్వాత మనోజ్ శాంతించాడు. అంతేకాదు లైగర్ మూవీ హిందీలో మంచి వసూళ్లే సాధిస్తోందని కూడా అతడు చెప్పడం విశేషం.
నిజానికి లైగర్ హిందీ బెల్ట్‌లోనూ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేదు. తొలి మూడు రోజులు కలిపి రూ.25 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్లు సాధించింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు నష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచినట్లు అంచనా వేస్తున్నారు.