Vijay Deverakonda: వారి కష్టాలు ఎలా ఉంటాయో హీరోగా ఎదగకముందే చూశాను: విజయ్ దేవరకొండ-vijay deverakonda comments in darsaka sanjeevani mahotsavam telugu film directors association health card distribution ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: వారి కష్టాలు ఎలా ఉంటాయో హీరోగా ఎదగకముందే చూశాను: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: వారి కష్టాలు ఎలా ఉంటాయో హీరోగా ఎదగకముందే చూశాను: విజయ్ దేవరకొండ

Sanjiv Kumar HT Telugu
Jul 30, 2024 01:27 PM IST

Vijay Deverakonda Comments In Darsaka Sanjeevani Mahotsavam: ఇటీవల జరిగిన దర్శక సంజీవని మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. వారి కష్టాలు ఎలా ఉంటాయో తాను హీరోగా ఎదగకముందే చూశానంటూ చెప్పాడు.

వారి కష్టాలు ఎలా ఉంటాయో హీరోగా ఎదగకముందే చూశాను: విజయ్ దేవరకొండ
వారి కష్టాలు ఎలా ఉంటాయో హీరోగా ఎదగకముందే చూశాను: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Comments On Directors: తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సురెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. దర్శక సంజీవని మహోత్సవం పేరుతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

yearly horoscope entry point

ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు సాయి రాజేశ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు దర్శకుల సంఘం సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ హెల్త్ కార్డులను స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరు మీద దాసరి హెల్త్ కార్డుగా సభ్యులకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు.

శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్‌లో డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్‌తోపాటు విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "ఈ రోజు దర్శకుల సంఘం నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరంతా డ్రీమర్స్. డ్రీమర్స్ కష్టాలు ఎలా ఉంటాయో నేను హీరోగా ఎదగకముందు చూశాను. స్థిరమైన ఆదాయం ఉండదు. భవిష్యత్ మీద భరోసా ఉండదు. కానీ, మీ కలను సాకారం చేసుకోవడంలో ముందుకు సాగుతుంటారు" అని అన్నారు.

"ఈ అసోసియేషన్ సభ్యులు నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు ఈ కమిటీలో ఒక ఎనర్జీ కనిపించింది. తమ సభ్యులకు ఏదో మంచి చేయాలనే తపన కనిపించింది. మధ్యాహ్నం భోజనం పెట్టడం అలాగే ఉచిత హెల్త్ కార్డ్స్ ఇవ్వడం మంచి ఆలోచన. ఈ ప్రయత్నంలో భాగమైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. ఈ అసోసియేషన్‌కు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది" అని రౌడీ హీరో విజయ్ దేవరకొండ చెప్పారు.

ఇక దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ.. "మా డైరెక్టర్స్ అసోసియేషన్ కమిటీగా మేము ఎన్నికయ్యాక సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిసారించాం. మా సంఘంలో సభ్యుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే గతంలో 25 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత అది లక్ష రూపాయలకు పెంచారు. అయితే చాలా మంది సభ్యులు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుందని అడిగేవారు" అని తెలిపారు.

"మేము ఈసారి ఎలక్షన్స్‌లో అవసరమైన సభ్యులకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. అది కూడా అసోసియేషన్ మూలధనం ముట్టుకోకుండా బయట నుంచి ఫండ్స్ సేకరించి అందిస్తామని హామీ ఇచ్చాం. హామీ ఇచ్చినట్లే ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఉచిత హెల్త్ కార్డ్స్ అందిస్తుండటం సంతోషంగా ఉంది. దీనంతటికీ కర్త, కర్మ, క్రియ మా సాయి రాజేశ్" అని డైరెక్టర్ వీరశంకర్ వెల్లడించారు.

"సంఘంలోని 720 మంది అవసరమైన వారు ఈ హెల్త్ కార్డులకు అప్లై చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 1920 మందికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాం. ఈ రోజు మా ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఇతర పెద్దలంతా అతిథులుగా పాల్గొనడం ఆనందంగా ఉంది" అని అధ్యక్షుడు వీరశంకర్ పేర్కొన్నారు.

Whats_app_banner