Vijay Deverakonda Maha Kumbh: మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ.. ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరో
Vijay Deverakonda Maha Kumbh: మహా కుంభమేళాకు వెళ్లాడు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. అక్కడి త్రివేణీ సంగమంలో స్నానం చేశాడు. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు.

Vijay Deverakonda Maha Kumbh: మహా కుంభమేళాలో ఇప్పటికే 50 కోట్లకుపైగా జనం పుణ్య స్నానాలు ఆచరించిన విషయం తెలుసు కదా. తాజాగా రౌడీ బాయ్, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కూడా తన తల్లి, స్నేహితులతో కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్లాడు. అక్కడి త్రివేణీ సంగమంలో భక్తిగా స్నానం చేశాడు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాలో అతడు షేర్ చేశాడు.
కుంభమేళాలో విజయ్ దేవరకొండ
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళా ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి చిహ్నం కూడా. కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తుంటారు. ఈ సారి మహాకుంభ్ 2025 లో బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగమయ్యారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన తల్లి మాధవితో కలిసి గంగానదిలో స్నానమాచరించారు. తన మహాకుంభ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోల్లో నటుడు తన తల్లి, ఇతర స్నేహితులతో కనిపించాడు.
కాశీ విశ్వనాథుడినీ దర్శించుకున్న విజయ్
విజయ్ దేవరకొండ ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "2025 కుంభమేళా.. మన పురాణాలు, మూలాలను గౌరవించడం, వాటితో కనెక్ట్ అయ్యే ఓ ప్రయాణం. నా భారతీయ స్నేహితులతో జ్ఞాపకాలను ఏర్పరచుకుంటున్నాను. అమ్మతో కలిసి పూజలు చేశాను. తర్వాత కాశీని కూడా దర్శించుకున్నాం " అనే క్యాప్షన్ ఉంచాడు.
విజయ్ తన తల్లితో కలిసి ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద గంగానదిలో స్నానం చేశాడు. ఈ సందర్భంగా విజయ్ నుదుటన కుంకుమ, ధోతీ, రుద్రాక్ష మాల ధరించాడు. అతనికి సంబంధించిన ఈ ఫొటోలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా మహాకుంభ్ 2025లో పాల్గొన్నారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని త్రివేణీ సంగమం సందర్శనకు సంబంధించిన ఫోటోలను పంచుకోగా, రానా దగ్గుబాటి సతీమణి మిహీకా బజాజ్ నాగ సాధువులతో తన అనుభవాలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. దక్షిణాది నటి శ్రీనిధి శెట్టి కూడా మహాకుంభ్ లో పాల్గొని ఇది తన జీవితంలో అమూల్యమైన అనుభవంగా అభివర్ణించారు.
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కింగ్డమ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే మూవీ నుంచి టీజర్ రిలీజైన విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ అదిరిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, విజయ్ యాక్షన్, అనిరుధ్ బీజీఎం ఈ టీజర్ ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ సినిమా మే 30న రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం