విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘కింగ్‌డమ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో రౌడీ బాయ్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా లైగర్ మూవీపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. 2022లో రిలీజైన లైగర్ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేశాడు విజయ్.
ఫిల్మ్ ఫేర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లైగర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం ఎలా అనిపించిందో విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. దర్శకుడు పూరీ జగన్నాథ్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఆ షూటింగ్ ప్రాసెస్ ను ఎంజాయ్ చేశానని విజయ్ చెప్పాడు. ఈ మూవీ రిజల్ట్ నిరాశ కలగించిందని తెలిపాడు.
లైగర్ మూవీ రిలీజ్ తర్వాత థియేటర్లలో ఆడదని ఊహించారా? అనే ప్రశ్నకు.. ‘‘లేదు. నేను నా పాత్రపై మక్కువ పెంచుకున్నా. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. ఫైటర్ లా కనిపించేలా నా శరీరాకృతిని పెంచుకున్నా. పాత్రకు సంబంధించిన ప్రతిదీ చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. ఆ ప్రాసెస్ ను పూర్తిగా ఆస్వాదించా’’ అని విజయ్ దేవరకొండ చెప్పాడు.
పెరుగుతున్న వయసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు వీరాభిమానిని అని విజయ్ దేవరకొండ తెలిపాడు. ‘‘దర్శకుడు పూరీ జగన్నాథ్ కు వీరాభిమానిని. మహేష్ బాబుతో పూరి చేసిన పోకిరి మూవీ నా నా ఫేవరేట్స్ లో ఒకటి. ఆయనతో సినిమా చేయాలనేది నా కల’’ అని విజయ్ అన్నాడు. మంచి సినిమా తీయలేకపోయినందుకు చాలా బాధపడ్డానని అతను పేర్కొన్నాడు.
లైగర్ సినిమా కోసం పేపర్ పై గొప్ప ఐడియా వేశామని కానీ రిజల్ట్ వేరేగా వచ్చిందని విజయ్ అన్నాడు. కానీ ఈ సినిమా గురించి తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అతను పేర్కొన్నాడు.
‘‘ లైగర్ నాకు చాలా నేర్పింది. నన్ను చాలా మార్చింది. ఇప్పుడు, భవిష్యత్తులో నేను చేసే పనుల్లో చాలా వరకు లైగర్ అనుభవం నుంచి, దాని విడుదల తర్వాత జరిగిన పరిణామాల నుంచి నేర్చుకున్న పాఠాలున్నాయి. ఇది జీవితంలో సాధించిన విజయంగా భావిస్తున్నా' అని విజయ్ అన్నాడు.
మరోవైపు కింగ్‌డమ్ మూవీతో ఫ్యాన్స్ మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు విజయ్ దేవరకొండ థియేటర్లకు వచ్చేస్తున్నాడు అయితే మే 30న విడుదల కావాల్సిన ఈ మూవీ జులై 4కు వాయిదా పడింది. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా విడుదలను వాయిదా వేశారు. గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం