Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై అసభ్యకర వీడియోలు.. అతను అరెస్ట్
Vijay Devarakonda Fake News: రౌడీ హీరో విజయ్ దేవరకొండపై ఇటీవల అసభ్యకర వార్తలు, అవమానించేలా ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం వీడియోలన్నీ డిలీట్ చేయించారు.
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ రౌడీ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఇటీవల ఖుషీ మూవీతో అలరించిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇంతటి స్థాయికి వచ్చిన విజయ్ దేవరకొండపై ఇటీవల అసభ్యకర వార్తలు ప్రచారం అయ్యాయి.
అలా అసభ్యకర వీడియోలు, వార్తలు ప్రసారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ సినిమాలకు సంబంధించి అసభ్యకర వార్తలను ప్రసారం చేశాడు ఏపీ అనంతపురానికి చెందిన యూట్యూబర్ వెంకట కిరణ్. సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ వేదికగా విజయ్ దేవరకొండ గౌరవాన్ని కించపరిచేలా, ఆయన సినిమాల్లోని హీరోయిన్‌లను అవమానించేలా ఆ వీడియోలు ఉన్నాయి.
ఈ యూట్యూబ్ వీడియోలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి సదరు వ్యక్తి ఆచూకీని తెలుసుకున్నారు. 2590/2023 కేసుగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి కొన్ని గంటల వ్యవధిలోనే సదరు యూట్యూబర్‌ని అరెస్ట్ చేశారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలనీ, ఛానల్‌ని డిలీట్ చేయించారు.
అంతేకాకుండా భవిష్యత్‌లో ఇలాంటివి చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు టార్గెటెడ్‌గా ఎవరు కామెంట్స్ చేసినా, మీడియా మాధ్యమాలలో హీరోహీరోయిన్లు, ప్రముఖులను అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.