Vijay Deverakonda Remuneration: ఖుషి రెమ్యునరేషన్‌ను అభిమానులకు పంచనున్న విజయ్ దేవరకొండ
Vijay Deverakonda Remuneration: ఖుషి సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్ నుంచి కోటి రూపాయల్ని అభిమానులకు పంచబోతున్నట్లు విజయ్ దేవరకొండ ప్రకటించాడు. 100 కుటుంబాలకు ఈ డబ్బును అందజేయబోతున్నట్లు ఖుషి మూవీ వైజాగ్ ఈవెంట్‌లో విజయ్ పేర్కొన్నాడు.
Vijay Deverakonda Remuneration: ఖుషి మూవీ కోసం తీసుకున్న రెమ్యునరేషన్‌ను అభిమానులకు పంచబోతున్నట్లు విజయ్ దేవరకొండ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఖుషి వైజాగ్ సక్సెస్ టూర్‌లో విజయ్ స్వయంగా వెల్లడించాడు.
విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన ఖుషి (Kushi Movie) మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కుటుంబ సిద్ధాంతాల్ని, అభిప్రాయాల్ని ఎదురించి పెళ్లి చేసుకున్న ఓ జంట కథతో దర్శకుడు శివ నిర్వాణ ఖుషి సినిమాను తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా ఖుషి నిలిచింది.
సమంత అమెరికా వెళ్లడంతో ఈ సినిమా ప్రమోషన్స్ భారాన్ని మొత్తం విజయ్ దేవరకొండ తన భుజాలపై వేసుకున్నాడు. ఈ సక్సెస్ టూర్‌లో భాగంగా సోమవారం వైజాగ్‌లో ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో ఖుషి కోసం తీసుకున్న రెమ్యునరేషన్‌లో కోటి రూపాయల్ని అభిమానులను ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు.
కోటి రూపాయలు…
అభిమానులతో ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మీతో నా ఖుషి పంచుకోవాలంటే నా ఖుషి మూవీ సంపాదన నుంచి కోటి రూపాయలు మన ఫ్యామిలీస్‌కు ఇస్తానని తెలిపాడు. వంద ఫ్యామిలీస్‌ను సెలెక్ట్ చేసి రానున్న పది రోజుల్లో ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చెక్‌ను తానే స్వయంగా అందిస్తానని విజయ్ దేవరకొండ ఈ వేడుకలో ప్రకటించాడు.
నా సంపాదన మీతో షేర్ చేసుకోలేకపోతే వేస్ట్ అని విజయ్ దేవరకొండ అన్నాడు. మీరు నా ఫ్యామిలీ లాంటివారు అని చెప్పాడు. దేవర ఫ్యామిలీ పేరుతో ఓ అప్లికేషన్ ఫామ్ పెడతానని, ఆ ఫామ్ ద్వారా అభిమానులకు డబ్బు అందించే ప్రక్రియను ప్రారంభిస్తానని విజయ్ అన్నాడు. రెంట్, ఫీజులు ఇలా దేనికి ఆ డబ్బు అవసరమైన నాకు సంతోషమే అని విజయ్ చెప్పాడు.
హైదరాబాద్ సక్సెస్ మీట్…
హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటుచేయడానికి ముందే ఆ డబ్బును అభిమానులకు అందజేస్తానని, అభిమానులకు కోటి రూపాయల్ని అందజేసిన తర్వాతే నా ఖుషి సక్సెస్ పూర్తవుతుందని, అప్పడే తృప్తిగా ఫీలవుతానని విజయ్ చెప్పాడు. తన రెమ్యునరేషన్‌లో కోటి రూపాయల్ని అభిమానులకు ఇవ్వాలని నిర్ణయించుకున్న విజయ్ దేవరకొండ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఓవర్‌సీస్‌తో పాటు నైజాం ఏరియాలో ఈ మూవీ అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. ఖుషి తర్వాత గౌతమ్ తిన్ననూరి, పరశురామ్‌లతో సినిమాలు చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ.