కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెట్రో'. ఇందులో సూర్యకు జోడీగా హీరోయిన్ పూజా హెగ్డే నటించింది. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రెట్రో రూపుదిద్దుకుంది.
మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో రెట్రో థియేటర్లలో విడుదల కానుంది. తెలుగునాట ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రెట్రో చిత్రాన్ని పంపిణీ చేస్తుండటం విశేషం. థియేట్రికల్ రిలీజ్ సందర్భంగా తాజాగా శనివారం (ఏప్రిల్ 26) సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.
రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ కథానాయకుడు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ముందుగా కాశ్మీర్ పహల్గామ్ బాధితులకు నివాళులు అర్పించిన విజయ్ దేవరకొండ హీరో సూర్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సినిమా గురించి మాట్లాడేముందు.. ముందుగా పహల్గామ్ బాధితులకు నివాళులు" అని అన్నాడు.
"సూర్య అన్న మూవీ ప్రమోషన్ కోసం నేను ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేను గజిని సినిమా చూసి సూర్య అన్నతో ప్రేమలో పడిపోయాను. ఎవర్రా ఈయన, ఇంత బాగా నటిస్తున్నాడు అనుకొని.. సూర్య అన్న నటించిన మిగతా సినిమాలన్నీ చూశాను" అని విజయ్ దేవరకొండ చెప్పాడు.
"సూర్య సన్నాఫ్ కృష్ణన్ నా మనసుకి బాగా నచ్చిన సినిమా. చంచల సాంగ్ చూసి భావోద్వేగానికి గురయ్యాను. ఆ పాట నాకెప్పటికీ ఓ మంచి జ్ఞాపకం. సూర్య అన్నను తెరమీద చూసి.. అసలు ఈ మనిషి బాడీ ఏంటి, యాక్టింగ్ ఏంటి, డ్యాన్స్ ఏంటి? ఒక్కసారైనా జీవితంలో కలవాలి అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో వేదిక పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను" అని విజయ్ దేవరకొండ తెలిపాడు.
"నటుడిగా సూర్య అన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన సినిమాల ఎంపిక మిగతా నటుల్లో స్ఫూర్తి నింపేలా ఉంటుంది. విభిన్న జోనర్స్‌లో సినిమాలు చేస్తుంటారు. రెట్రోతో సూర్య అన్న మరో ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను" అని విజయ్ దేవరకొండ కోరాడు.
"అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య అన్న ఎందరో విద్యార్థులకు అండగా నిలబడుతున్నారు. ఆయన స్ఫూర్తితో నేను కూడా విద్యార్థులకు సాయం చేయాలి అనుకుంటున్నాను. మే 1న విడుదలవుతున్న రెట్రో సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను" అని రౌడీ హీరో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
సంబంధిత కథనం
టాపిక్