Game Changer Movie: తమిళనాడులో రామ్‍చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీకి భారీ గుడ్‍న్యూస్!
Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు మెండుగా ఉన్నాయి. శంకర్ డైరెక్టర్ రావడంతో తమిళ మార్కెట్‍లోనూ బజ్ నెలకొంది. ఈ తరుణంలో తమిళనాడులో గేమ్ ఛేంజర్ మూవీకి ఓ అంశం అనుకోకుండా కలిసి వచ్చింది.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రిలీజ్ కానుంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించడంతో తమిళనాడులోనూ ఈ చిత్రానికి మంచి బజ్ నెలకొంది. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్‍చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. దీంతో తమిళనాడులో ఈ మూవీ బాగా పర్ఫార్మ్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా తమిళనాడు విషయంలో గేమ్ ఛేంజర్ చిత్రానికి బాగా కలిసి వచ్చే ఓ అంశం జరిగింది. అదేంటంటే..
పొంగల్ రేసు నుంచి విదాముయర్చి ఔట్
తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న విదాముయర్చి చిత్రంపై ఫుల్ హైప్ ఉంది. ఈ సినిమాను పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు. దీంతో తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం.. గేమ్ ఛేంజర్‌కు సవాల్‍గా నిలిచింది. అయితే, తాజాగా విదాముయర్చి వాయిదా పడింది. ఈ సినిమా పొంగల్‍కు రాదంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
గేమ్ ఛేంజర్‌కు బిగ్ ప్లస్
విదాముయర్చి సినిమా పొంగల్ రేసు నుంచి తప్పుకోవడంతో తమిళనాడులో గేమ్ ఛేంజర్ చిత్రానికి ఇది భారీ గుడ్‍న్యూస్‍గా ఉంది. పొంగల్‍కు తమిళంలో స్టార్ హీరోల రిలీజ్‍లు ఏవీ లేవు. అరుణ్ విజయ్ ‘వనంగాన్’ ఒక్కటే రేసులో ఉంది. దీంతో గేమ్ ఛేంజర్ చిత్రానికి తమిళంలో మంచి ఓపెనింగ్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. థియేటర్లు కూడా భారీ దక్కుతాయి. మంచి టాక్ వస్తే తమిళంలోనూ గేమ్ ఛేంజర్ కలెక్షన్లలో దుమ్మురేపేందుకు మంచి ఛాన్స్ వచ్చింది.
విదాముయర్చి సినిమాకు తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఆర్థికపరమైన విషయాల వల్లే ఈ చిత్రం పొంగల్‍కు రావడం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ భావిస్తున్నారు. మొత్తంగా విదాముయర్చి వాయిదా.. గేమ్ ఛేంజర్ మూవీకి కలిసొచ్చే అంశంగా మారింది. మరి తమిళంలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్, టైమ్
గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ జనవరి 2వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది. కొత్త సంవత్సరం రోజు సందర్భంగా నేడు జనవరి 1న ఈ అప్‍డేట్ వెల్లడించింది మూవీ టీమ్. జనవరి 1నే ట్రైలర్ తెస్తామని నిర్మాత దిల్‍రాజు ఇటీవల చెప్పగా.. ఓ రోజు ఆలస్యంగా వస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమా పొలిటికల్ అంశంతో ఉన్నా అన్ని కమర్షియల్ హంగులతో పక్కా ఎంటర్‌టైనింగ్‍గా ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది. ఈ చిత్రంలో రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటించారు. చెర్రీ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీలో చరణ్ నట విశ్వరూపం చూస్తారని దిల్‍రాజు ఇటీవలే చెప్పారు. ఈ చిత్రంలో ఎస్‍జే సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం