Bollywood: యానిమల్ సినిమాతో పోటీ పడడంపై స్పందించిన బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్
Vicky Kaushal: విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించిన సామ్ బహదూర్ చిత్రం, రణ్‍బీర్ కపూర్ ‘యానిమల్’ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగాయి. అయితే, ఈ విషయంపై ఇప్పుడు తాజాగా విక్కీ కౌశల్‍కు ప్రశ్న ఎదురవగా.. ఆయన స్పందించారు.
Vicky Kaushal: బాలీవుడ్ సినిమాలు సామ్ బహదూర్, యానిమల్ చిత్రాలు గతేడాది ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. డిసెంబర్ 1వ తేదీనే రెండు సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టాయి. బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ యానిమల్ భారీ బ్లాక్ బస్టర్ అయింది. భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‍షా జీవితం ఆధారంగా తెరకెక్కిన సామ్‍బహదూర్ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద కూడా అంచనాలను అందుకుంది. కాగా, యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ పోటీకి దిగడంపై ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో విక్కీ కౌశల్‍కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు.
యానిమల్‍కు పోటీగా వచ్చిన నేపథ్యంలో సామ్ బహదూర్ సినిమా అంచనాలను అందుకుందా అని తాజాగా ఇంటర్వ్యూలో విక్కీ కౌశల్‍కు క్వశ్చన్ ఎదురైంది. తమ చిత్రానికి మౌత్ టాక్ ప్రజల్లోకి వెళ్లేందుకు సమయం పడుతుందని తాము అనుకున్నామని, అందుకే యానిమల్‍తో పోటీ ఉన్నా వెనక్కి తగ్గలేదని ది వీక్ మ్యాగజీన్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్కీ చెప్పారు.
యానిమల్‍లా మసాలా మూవీ కాదు
“సామ్ బహదూర్ సినిమా టెస్టు మ్యాచ్‍లా ఉంటుందని మాకు ముందే తెలుసు. యానిమల్ మూవీలా ఇది మసాలా చిత్రం కాదు. యానిమల్‍కు షాక్ వాల్యూ ఉంది. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుందని తెలుసు” అని విక్కీ కౌశల్ చెప్పారు.
ప్రేక్షకులను రాబట్టుకునేందుకు సామ్ బహదూర్ చిత్రానికి మౌత్ టాక్ ప్రమోషన్లు అవసరం అని, ఇందుకు సమయం పడుతుందని తమకు తెలుసునని విక్కీ కౌశల్ చెప్పారు. స్టోరీతో జనాలు కనెక్ట్ అయ్యారా లేదా అనే విషయంపై సక్సెస్ ఆధారపడి ఉంటుందని, ఎప్పుడు రిలీజ్ చేశామని కాదని ఆయన స్పష్టం చేశారు.
తమ సామ్ బహదూర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ క్రమంగా పెరిగిందని విక్కీ కౌశల్ చెప్పారు. ఈ మూవీలో మాట్లాడుకోవడం కూడా అధికమైందని తెలిపారు. జనవరిలోనూ తమ సినిమా షోలు కొనసాగడం చూసి చాలా సంతోషం కలిగిందని విక్కీ కౌశల్ చెప్పారు.
సామ్ బహదూర్ గురించి..
సామ్ బహదూర్ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. ఈ బయోపిక్ చిత్రంలో భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‍షా పాత్రను విక్కీ కౌశల్ పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. సుమారు రూ.120 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అలాగే, ఈ చిత్రంపై ప్రశంసలు కూడా భారీగా వచ్చాయి. సామ్ బహదూర్ మూవీని రోనీ స్క్రూవాలా నిర్మించారు. బాబీ ఆరోరా, మోనుజ్, కృష్ణకాంత్ సింగ్, ధన్వీర్ సింగ్ కీలకపాత్రలు పోషించారు. సామ్ బహదూర్ మూవీ ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ అయింది. రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కొందరి నుంచి విమర్శలు వచ్చినా.. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. యానిమల్ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో జనవరిలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.