Vettaiyan Tickets: వేట్టయన్ టికెట్ రేట్ల తగ్గింపు.. ఎప్పటి నుంచంటే! ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?-vettaiyan ticket prices gets cut in telangana makers plans to increase occupancy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vettaiyan Tickets: వేట్టయన్ టికెట్ రేట్ల తగ్గింపు.. ఎప్పటి నుంచంటే! ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Vettaiyan Tickets: వేట్టయన్ టికెట్ రేట్ల తగ్గింపు.. ఎప్పటి నుంచంటే! ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Chatakonda Krishna Prakash HT Telugu
Published Oct 16, 2024 02:18 PM IST

Vettaiyan Tickets: వేట్టయన్ సినిమాకు తెలుగులో రెస్పాన్స్ అంతంత మాత్రంగానే వస్తోంది. కలెక్షన్లు అనుకున్న రేంజ్‍లో దక్కడం లేదు. ఈ క్రమంలో టికెట్ రేట్లను తగ్గిస్తూ మూవీ టీమ్ నిర్ణయించింది.

Vettaiyan Tickets: వేట్టయన్ టికెట్ రేట్ల తగ్గింపు.. ఎప్పటి నుంచంటే! ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
Vettaiyan Tickets: వేట్టయన్ టికెట్ రేట్ల తగ్గింపు.. ఎప్పటి నుంచంటే! ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన వేట్టయన్ సినిమా అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ముందు నుంచే ఈ మూవీకి పెద్దగా బజ్ లేదు. పేరును అనువదించలేదనే అసంతృప్తి కూడా బాగానే ఉంది. అందులోనూ ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావటంతో పెద్దగా కలెక్షన్లు రావడం లేదు. ఈ క్రమంలో వేట్టయన్ మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో టికెట్ రేట్ల తగ్గింపు

వేట్టయన్ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‍మెంట్ తీసుకుంది. ఏపీ, తెలంగాణలో ఈ మూవీని రిలీజ్ చేసింది. అయితే అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు రావడం లేదు. ఈ క్రమంలో తెలంగాణలో టికెట్ల రేట్లను తగ్గించేందుకు మూవీ టీమ్ నిర్ణయించింది. అక్టోబర్ 18వ తేదీ నుంచి టికెట్ల తగ్గింపు ఉండనుంది.

వేట్టయన్ సినిమాకు అక్టోబర్ 18 నుంచి తెలంగాణలో మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ.200, సిటీ సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ.150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లో టికెట్ రేటు రూ.110 ధర ఉంటుందని ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‍మెంట్ నేడు (అక్టోబర్ 16) వెల్లడించింది. అందుబాటులో ధరల్లోనే ఫ్యామిలీతో వేట్టయన్ సినిమాను చూడాలంటూ టికెట్ల రేట్లతో ఓ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ప్లాన్ ఫలిస్తుందా?

వేట్టయన్ సినిమా తెలుగులో జనాల్లోకి పెద్దగా వెళ్లలేకపోయింది. మొదటి నుంచే మిక్స్డ్ టాక్ రావటంతో అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు రావడం లేదు. టైటిల్ తెలుగులో అనువదించలేదని తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెద్దగా జరగలేదు. రిలీజ్ తర్వాత కూడా ఈ మూవీకి తెలుగు కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రేక్షకులు పెరుగుతారని మూవీ టీమ్ ప్లాన్ చేసింది. థియేటర్లలో ఆక్యుపెన్సీ మెరుగవుతుందని భావిస్తోంది. అయితే, రిలీజైన వారం తర్వాత.. అదీ మిక్స్డ్ టాక్ వచ్చాక టికెట్ రేట్ల తగ్గింపు ప్లాన్ వర్కౌట్ అవుతుందా అనేది సందేహమే. మరి, ఈ ప్లాన్ ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

వేట్టయన్ కలెక్షన్లు

వేట్టయన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో రూ.240 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుందని మూవీ టీమ్ వెల్లడించింది. మిశ్రమ స్పందన వచ్చినా మంచి కలెక్షన్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.15కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు అంచనా.

వేట్టయన్ చిత్రంలో తలైవా రజినీకాంత్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా, మలయాళ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ కూడా కీలకపాత్రలు పోషించారు. మంజు వారియర్, రితికా సింగ్, దుషరా విజయన్, ఆశల్ కొలార్, అభిరామి కీలకపాత్రలు పోషించారు.

వేట్టయన్ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. జైభీమ్ మూవీతో పాపులర్ అయిన ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కోర్ట్ రూమ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని రూపొందించారు. అయితే, వేట్టయన్‍కు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది.

Whats_app_banner