Athidhi OTT: ఓటీటీ హారర్ సిరీస్ అతిథిలో శృంగార సీన్లు.. హీరో వేణు ఏమన్నాడంటే?
Athidhi Web Series OTT: తాజాగా ఓటీటీలోకి రానున్న హారర్ తెలుగు వెబ్ సిరీస్ అతిథి. ఈ వెబ్ సిరీసులో శృంగార సీన్లపై ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్‍లో యాక్టర్, హీరో వేణు తొట్టెంపూడి క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నాడనే వివరాల్లోకి వెళితే..
హీరో వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ "అతిథి" . రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‍పై డైరెక్టర్ భరత్ వైజీ తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరించారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‍లో సెప్టెంబర్ 19 నుంచి "అతిథి" వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ రెండు ఎపిసోడ్స్ ను మీడియాకు ప్రివ్యూ వేశారు. ఆ తర్వాత అతిథి టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ట్రెండింగ్ వార్తలు
వెంకటేష్‍కు ఆ పేరు
హీరో వేణు మాట్లాడుతూ.. "అతిథి వెబ్ సిరీస్ ఇంత బాగా వచ్చిందంటే ఆ క్రెడిట్ నేను టెక్నీషియన్స్ కు ఇస్తాను. భరత్ ఎంతో కష్టపడ్డాడు. అలాగే సినిమాటోగ్రాఫర్ మనోజ్ ప్రతి సీన్ చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. వెంకటేష్ కాకుమానుకు మంచి పేరొస్తుంది. హనుమాన్ జంక్షన్ లో నేను ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నానో ఈ వెబ్ సిరీస్ తో వెంకటేష్‍కు అలా పేరొస్తుంది. రవివర్మ మంచి క్యారెక్టర్ చేశాడు. అతిథిలో హారర్, కామెడీ ఇవన్నీ పక్కన పెడితే అందరూ కలిసి హాయిగా చూడగలిగే కథ ఇది. నాకు కథ నచ్చే సిరీస్ ఒప్పుకున్నాను" అని పేర్కొన్నాడు.
వేణు మనసులో మాట
"కెరీర్‍లో ఒక ఫేజ్ చూశాను. ఇప్పుడు విభిన్నమైన క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నాను. ఇకపైనా మంచి కథలు వస్తే వెబ్ సిరీస్ చేస్తాను. నా ఫ్రెండ్ త్రివిక్రమ్ నేను ఒకేసారి కెరీర్ ప్రారంభించాం. మాకు ఒకరి గురించి మరొకరికి తెలుసు. ఆయన సినిమాల్లో నాకు సరిపోయే క్యారెక్టర్ ఉంటే తప్పకుండా పిలుస్తాడు. ఆయన సినిమాలో చేయడం నాకూ చాలా ఇష్టం" అని వేణు తన మనసులో మాట తెలిపాడు.
అడల్ట్ కంటెంట్‍పై
"కరోనా సమయంలో వెబ్ సిరీస్‍లు చాలా చూశాను. అప్పుడే ఒక వెబ్ సిరీస్ చేయాలని అనుకున్నాను. ఆ టైమ్ లో అతిథి స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. కథ చాలా బాగుంది. అయితే దీన్ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చేయాలని చెప్పాను. ఎందుకంటే ఇవాళ ఓటీటీలో చాలా కంటెంట్ వస్తోంది. కానీ, ఎవరికి వారు గదుల్లో ఉండి చూస్తున్నారు. అడల్ట్ కంటెంట్ (శృంగార సీన్లు) ఉంటోంది. అందుకే అలాంటివి లేకుండా చేయాలన్నాను. భరత్ అలాగే చేశాడు" అని వేణు చెప్పుకొచ్చాడు.