Malayalam Audience: మలయాళం ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాల చూడట్లేదు.. డైరెక్టర్ వెంకీ అట్లూరి కామెంట్స్
Venky Atluri About Dulquer Salmaan Lucky Bhaskar: తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరో హీరోయన్లుగా నటించిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న రిలీజై మంచి హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో వెంకీ అట్లూరి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Venky Atluri About Malayalam Audience: 'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం 'లక్కీ భాస్కర్'. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది.
ముందు నుంచే ప్రీమియర్ షోలు
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత అందించిన లక్కీ భాస్కర్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్న నిర్మాతలు, అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించారు.
పెరుగుతున్న కలెక్షన్స్
నిర్మాతల నమ్మకం నిజమై మొదటి షో నుంచే లక్కీ భాస్కర్ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది. షో షోకి వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.
నెగెటివ్ కామెంట్ వస్తే
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. "నాగవంశీ గారు ఈ సినిమా మీద ఎంతో నమ్మకంగా ఉన్నారు. సినిమా విడుదలకు ముందే వంశీ చెప్పారు.. సినిమాకి ఎక్కడైనా నెగెటివ్ కామెంట్ వస్తే అడగండని. అయితే ఈస్థాయి స్పందన లభిస్తుందని నేను కూడా ఊహించలేదు. ప్రీమియర్ షోల నుంచే సినిమాకి ఎంతో మంచి టాక్ వచ్చింది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.
సొంత సినిమాగానే
"దర్శకుడిగా ఇంత మంచి పేరు రావడమనేది చాలా అరుదైన విషయం. ఈ సినిమా పట్ల మీడియా మద్దతుకి, ప్రేక్షకుల ఆదరణకి చాలా చాలా థాంక్స్. పండగ అయినా కూడా మొదటిరోజు మంచి వసూళ్లు రావడం సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్లా మంచి స్పందన లభిస్తుంది. మలయాళం ప్రేక్షకులు దీనిని డబ్బింగ్ సినిమాలా చూడటంలేదు. సొంత సినిమాగానే భావిస్తున్నారు" అని వెంకీ అట్లూరి తెలిపారు.
సంతృప్తి చెందుతున్నారు
"ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని సినిమా చూసిన ప్రేక్షకులు సంతృప్తి చెందుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అనే తేడా లేకుండా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ దేవుని ఆశీస్సులతోనే సినిమాకి ఈ స్థాయి ఆదరణ లభిస్తోందని నమ్ముతున్నాను" అని డైరెక్టర్ వెంకీ అట్లూరి పేర్కొన్నారు.
ఎక్కడ కూడా
ఇదే కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "సోషల్ మీడియాలో ఎక్కడా సినిమా గురించి ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా కనిపించలేదు. అంతలా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకే ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడం కోసం మీడియా ముందుకి వచ్చాము. థాంక్స్ అనేది చాలా చిన్న మాట. సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలుగుతోంది. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు" అని అన్నారు.