Yakshini Web Series: తెలుగులో బాహుబలి ప్రొడ్యూసర్స్ హారర్ వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?
Yakshini Web Series: బాహుబలి ప్రొడ్యూసర్స్ తెలుగులో ఓ హారర్ వెబ్‌సిరీస్ చేయబోతున్నట్లు సమాచారం. యక్షిణి పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్‌లో వేదిక, మంచులక్ష్మి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Yakshini Web Series: బాహుబలి ప్రొడ్యూసర్స్ తెలుగులో ఓ హారర్ వెబ్‌సిరీస్ చేస్తోన్నారు. ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ వెబ్‌సిరీస్‌కు యక్షిణి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hotstar) స్ట్రీమింగ్ కాబోతోంది. శుక్రవారం ఈ వెబ్‌సిరీస్ ప్రీ లుక్ పోస్టర్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అభిమానులతో పంచుకున్నది. లీడ్ రోల్స్ ఎవరు లేకుండా కేవలం షాడోను మాత్రమే చూపిస్తూ డిఫరెంట్‌గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. యక్షిణి వస్తుంది అంటూ పోస్టర్‌ను ఉద్దేశించి ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తిని పంచుతుంది.
వేదిక టైటిల్ పాత్రలో...
హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌లో వేదిక, రాహుల్ విజయ్, అజయ్, మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. యక్షిణిగా టైటిల్ పాత్రలో వేదిక నటించనున్నట్లు తెలుస్తోంది. డీ గ్లామర్ లుక్‌లో వేదిక క్యారెక్టర్ ఈ సిరీస్‌లో వైవిధ్యంగా ఉంటుందని అంటున్నారు. హారర్ అంశాలతో ప్రతి ఎపిసోడ్ థ్రిల్లింగ్‌ను పంచుతోందని చెబుతోన్నారు. ఈ సిరీస్‌లో కనిపించే ప్రతి పాత్ర మిస్టరీయస్‌గా సాగుతుందని సమాచారం. హారర్ ఎలిమెంట్స్ భయపెడతాయని అంటున్నారు.
త్వరలో రిలీజ్ డేట్...
యక్షిణి వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నట్లు తెలిసింది. దర్శకుడితో పాటు ఎన్ని ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్ తెరకెక్కనుందన్నది కూడా అప్పుడే క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని యక్షిణి వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తోన్నారు.
బాహుబలితో పాటు...
ఈ బ్యానర్ వచ్చిన బాహుబలి, బాహుబలి 2తో పాటు మర్యాదరామన్న, వేదం సినిమాలు కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. పరంపరం, అన్యాస్ ట్యుటోరియల్‌తో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లను ప్రసాద్ దేవినేని, శోభుయార్లగడ్డ నిర్మించారు. ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్‌తో రెండు పాన్ ఇండియన్ సినిమాలను ఆర్కా మీడియా సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.
వేదిక ఓటీటీ ఎంట్రీ...
యక్షిణి వెబ్‌సిరీస్‌తోనే వేదిక ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమె నటిస్తోన్న ఫస్ట్ వెబ్‌సిరీస్ ఇదే. కళ్యాణ్ రామ్ విజయదశమితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వేదిక. ఆ తర్వాత దగ్గరగా దూరంగా, బాణం, బాలకృష్ణ రూలర్‌తో పాటు పలు సినిమాలు చేసింది. తెలుగులో కాంచన 3 ఆమెకు హిట్టును తెచ్చిపెట్టింది. ఇటీవల రిలీజైన రజాకార్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది.
ఆరు సినిమాలు...
తెలుగులో వేదిక హీరోయిన్‌గా నటించిన ఫియర్‌తో పాటు జంగిల్ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కలిపి మరో ఆరు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది వేదిక. మంచు లక్ష్మి కూడా తెలుగులో అగ్నినక్షత్రం, ఆదిపర్వంతో పాటు మరికొన్ని సినిమాలు చేస్తోంది. కొన్నాళ్లుగా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌పై మంచు లక్ష్మి ఫోకస్ పెడుతోంది. సినిమాలతో పాటు సిరీస్‌లలో నటిస్తోంది.