Matka Collections: మట్కా కలెక్షన్స్ - రావాల్సింది 20 కోట్లు - రెండు రోజుల్లో వచ్చింది కోటి
Matka Collections: వరుణ్ తేజ్ మట్కా మూవీ డిజాస్టర్ దిశగా సాగుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా కోటి వరకు మాత్రమే కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. మట్కా మూవీకి కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు.
Matka Collections: వరుణ్‌తేజ్ మట్కా డిజాస్టర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకున్నది ఈ మూవీ. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రెండు రోజుల్లో కలిపి కోటి వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
రెండు రోజుల్లో...
గురువారం రోజు రిలీజైన ఈ మూవీ ఎనభై లక్షల వరకు వసూళ్లను రాబట్టింది. నెగెటివ్ టాక్ కారణంగా రెండో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. శుక్రవారం రోజు ఇరవై లక్షల వరకే ఈ మూవీ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. మొత్తంగా రెండు రోజుల్లో కోటి నుంచి కోటి పది లక్షల వరకు మట్కా మూవీ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు చెబుతోన్నారు.
ఇరవై కోట్లు...
మట్కా మూవీ ఇరవై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో పంతొమ్మిది కోట్ల వరకు కలెక్షన్స్ రావాల్సిన అవసరం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని తెలుస్తోంది. నిర్మాతలకు మట్కా మూవీ భారీగా నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
ఇద్దరు హీరోయిన్లు...
మట్కా మూవీకి పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. మట్కా ఆట నేపథ్యంలో దాదాపు మూడు టైమ్‌పీరియడ్స్‌లో దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. సాధారణ యువకుడు మట్కా కింగ్‌గా ఎలా ఎదిగాడనే జర్నీలో బలమైన సంఘర్షణ లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
బర్మా నుంచి శరణార్థిగా వైజాగ్‌కు వలసవస్తాడు వాసు (వరుణ్ తేజ్). అనుకోని పరిస్థితుల్లో హత్య కేసులో చిక్కుకొని జైలుపాలవుతాడు. జైలు నుంచి విడుదలైన వాసు పూర్ణ మార్కెట్‌లో కొబ్బరికాయల వ్యాపారి అప్పలరెడ్డి (అజయ్ ఘోష్) దగ్గర పనిలో చేరుతాడు.
మార్కెట్‌లో జరిగిన గొడవలో రెడ్డి గ్యాంగ్‌ను ఎదురిస్తాడు వాసు. అతడి ధైర్యం నచ్చిన నానిబాబు (కిషోర్) తన గ్యాంగ్‌లో చేర్చుకుంటాడు. ఆ రౌడీ గ్యాంగ్‌తో మొదలైన అతడి జర్నీ మట్కా కింగ్ వరకు ఎలా సాగింది? వాసును చంపాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంది. వాసుకు సాహుకు ఉన్న సంబంధం ఏమిటి? వాసు జీవితంలోకి వచ్చిన మీనాక్షి (మీనాక్షి చౌదరి) సోఫియా (నోరా ఫతేహి) ఎవరన్నదే మట్కా మూవీ కథ.
మూడు డిజాస్టర్స్…
మట్కా మూవీకి జీవీ ప్రకాష్‌కుమార్ మ్యూజిక్ అందించాడు. విజయేందర్‌రెడ్డి, రజనీ తాళ్లూరి మట్కా మూవీని ప్రొడ్యూస్ చేశారు. మట్కా కంటే ముందు వరుణ్‌తేజ్ చేసిన గని, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవధారి అర్జున డిజాస్టర్స్‌గా నిలిచాయి.