Varun Lavanya Wedding Invitation: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి పత్రిక బయటకు వచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఇద్దరి పెళ్లిపై టాలీవుడ్ లో ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. నిజానికి వీళ్ల పెళ్లి ఇటలీలో నవంబర్ 1న జరగనుంది. దీనికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.
అయితే ఆ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ రిసెప్షన్ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్లో ఘనంగా జరగనుంది. ఈ రిసెప్షన్ నవంబర్ 5న జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్విటేషనే ఇప్పుడు వైరల్ అవుతోంది. వీళ్ల వెడ్డింగ్ ఇన్విటేషన్ ఓ బాక్స్ లాగా ఉంది. దీనిపై వీఎల్ అనే ఇంగ్లిష్ అక్షరాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ లోని తొలి ఇంగ్లిష్ అక్షరం, లావణ్యలోని తొలి అక్షరం కలిపి ఉంచారు.
బాక్స్ తెరిచిన తర్వాత కొణిదెల వారి పెళ్లి పిలుపు కనిపిస్తుంది. శ్రీమతి అంజనా దేవి, కీర్తి శేషులు కొణిదెల వెంకటరావు, కీర్తిశేషులు సత్యవతి, సూర్యనారాయణ ఆశీస్సులతో అని తొలి కార్డ్ లో ఉంది. ఇక ఆ తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లు ఉన్నాయి. చివర్లో వరుణ్ తల్లిదండ్రులు పద్మజ, నాగబాబు బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది.
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ లో నవంబర్ 5 సాయంత్రం 7 గంటల నుంచి వరుణ్, లావణ్య రిసెప్షన్ ప్రారంభం కానుంది. వీళ్ల రిసెప్షన్ కు టాలీవుడ్, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఎంతో మంది హాజరు కానున్నారు. ఇక పెళ్లికి ముందే అక్టోబర్ 30న ఇటలీలోని టస్కనీలో ఈ జంట కాక్‌టెయిల్ పార్టీ కూడా ఏర్పాటు చేసింది.
అక్టోబర్ 31న మెహెందీ, హల్దీ సెర్మనీలు ఉంటాయి. నవంబర్ 1న కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వరుణ్, లావణ్య పెళ్లితో ఒక్కటి కానున్నారు. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న వరుణ్, లావణ్య కొంత కాలం కిందట తమ రిలేన్షిప్ బయటపెట్టారు. వీళ్ల ఎంగేజ్‌మెంట్ కూడా ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే.