Varun Dhawan Apartment: మూవీ అట్టర్ ఫ్లాప్.. అయినా 87 కోట్లు పెట్టి రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్లు కొన్న బాలీవుడ్ హీరో
Varun Dhawan Apartment: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ముంబైలోని జుహు ఏరియాలో ఏకంగా రూ.86.92 కోట్లు పెట్టి రెండు అపార్ట్‌మెంట్లు కొనడం విశేషం. అతడు ఈ మధ్యే నటించిన బేబీ జాన్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయినా కూడా అతడు ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్నాడన్న వార్త వైరల్ అవుతోంది.
Varun Dhawan Apartment: బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన మూవీ బేబీ జాన్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుణ్ ధావన్ ఈ మధ్యే ముంబైలోని జుహులో తన ఫ్యామిలీతో కలిసి రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్లు కొనడం గమనార్హం. బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతో మంది ఉండే జుహులోనే వరుణ్ కూడా ఈ కొత్త ఇళ్లు కొన్నాడు.
వరుణ్ ధావన్ లగ్జరీ అపార్ట్‌మెంట్స్
వరుణ్ ధావన్ జనవరి 3వ తేదీన తన భార్య నటాషా దలాల్ తో కలిసి ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ట్వంటీ అనే బిల్డింగ్ లోని ఏడో అంతస్తులో ఓ అపార్ట్‌మెంట్ కొన్నాడు. దీని ధర రూ.44.52 కోట్లు. 5112 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ అపార్ట్‌మెంట్ నాలుగు కారు పార్కింగ్ స్పేస్ లతో వచ్చింది.
ఒక్కో చదరపు అడుగు విలువ రూ.87 వేలు కావడం విశేషం. ఇక అదే బిల్డింగ్ ఆరో అంతస్తులో తన తల్లి కరుణా ధావన్ తో కలిసి వరుణ్ మరో 4617 చ.అ. అపార్ట్‌మెంట్ కొన్నాడు. దీని ధర రూ.42.4 కోట్లు. ప్రస్తుతం ఈ రెండూ ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. ఈ ఏడాది మే 31వ తేదీలోపు వీటిని అందజేయనున్నారు.
మూవీ ఫ్లాపయినా..
వరుణ్ ధావన్ ఈ మధ్యే బేబీ జాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో కీర్తి సురేష్ ఫిమేల్ లీడ్ గా నటించింది. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన తేరి మూవీ రీమేక్ ఇది. కానీ హిందీలో మాత్రం బేబీ జాన్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.
గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా దారుణమైన వసూళ్లు సాధించింది. వరుణ్ తన నెక్ట్స్ మూవీలో జాన్వీ కపూర్ తో కలిసి సన్నీ సంస్కారీకి తులసి కుమారిలో నటిస్తున్నాడు. అయితే బేబీ జాన్ డిజాస్టర్ అయిన వెంటనే వరుణ్ ఇలా రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొనడం విశేషం.
జుహు, బాంద్రా.. బాలీవుడ్ అడ్డా
ముంబైలోని జుహు, బాంద్రా ఏరియాలు బాలీవుడ్ సెలబ్రిటీలకు అడ్డాగా మారిపోయాయి. జుహులో అమితాబ్ బచ్చన్ కు రెండు బంగ్లాలు ఉన్నాయి. అంతేకాదు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కాజోల్, గోవిందాలాంటి వాళ్లు కూడా ఈ జుహులోనే ఇళ్లు కొన్నారు.
ఇక బాంద్రాలో షారుక్, సల్మాన్, ఆమిర్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ లాంటి వాళ్లకు ఇళ్లు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఒక్కో అదరపు అడుగు విలువ రూ.60 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఉండటం విశేషం.