Varun Chakravarthy: ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలన ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. లీగ్ దశలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసుకున్నాడు.
ఫైనల్‌లో రెండు వికెట్లతో అదరగొట్టాడు. మొత్తంగా ఈ టోర్నీలో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన వరుణ్ చక్రవర్తి తొమ్మిది వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లండ్, సౌతాఫ్రికా సిరీస్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్ 2025లో కోసం సన్నద్ధమవుతోన్నాడు వరుణ్ చక్రవర్తి. గత ఏడాది జరిగిన మెగా వేలంలో వరుణ్ చక్రవర్తిని 12 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ సొంతం చేసుకున్నది. కేవలం రెండు కోట్ల బేస్ ధరతో వేలంలో అడుగుపెట్టిన ఈ స్పిన్నర్‌ను కొనుగోలు చేయడానికి అన్ని ఫ్రాంచైజ్‌లు పోటీ పడ్డాయి. చివరకు కోల్‌కతా అతడిని దక్కించుకున్నది.
కాగా ఈ టీమిండియా క్రికెటర్ ఓ తమిళ సినిమాలో నటించాడు. విష్ణు విశాల్ హీరోగా 2014లో తమిళంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా మూవీలో వరుణ్ చక్రవర్తి క్రికెటర్‌గానే గెస్ట్ రోల్‌లో కనిపించాడు. హీరో టీమ్‌లో ఓ మెంబర్‌గా కొన్ని సీన్స్‌లో వరుణ్ చక్రవర్తి స్క్రీన్‌పై మెరిశాడు.
క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ కమర్షియల్‌గా పెద్ద హిట్టయ్యింది. యూట్యూబ్‌లో ఫ్రీగా ఈ మూవీని చూడొచ్చు. జీవా మూవీలో శ్రీదివ్య హీరోయిన్‌గా నటించింది. జీవా మూవీతో పాటు కోకూ విత్ కోమలి అనే టీవీ షోలో కూడా గెస్ట్‌గా వరుణ్ చక్రవర్తి పాల్గొన్నాడు.
వరుణ్‌చక్రవర్తి టీమిండియా తరఫున ఇప్పటివరకు 18 టీ20లు, నాలుగు వన్డేలు ఆడాడు. టీ20ల్లో 33 వికెట్లు, వన్డేల్లో 10 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 71 మ్యాచ్‌లు ఆడిన వరుణ్ చక్రవర్తి 83 వికెట్లు సొంతం చేసుకున్నాడు.
సంబంధిత కథనం
టాపిక్