Varasudu Theatres Controversy: కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ - ముదురుతున్న‌ వార‌సుడు థియేట‌ర్ల వివాదం-varasudu theaters issue kollywood producers warns to telugu producers council ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Varasudu Theaters Issue Kollywood Producers Warns To Telugu Producers Council

Varasudu Theatres Controversy: కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ - ముదురుతున్న‌ వార‌సుడు థియేట‌ర్ల వివాదం

Nelki Naresh Kumar HT Telugu
Nov 20, 2022 10:24 AM IST

Varasudu Theatre Issue: విజ‌య్ వార‌సుడు సినిమా థియేట‌ర్ల వివాదం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ వివాదంపై కోలీవుడ్ సినీ వ‌ర్గాలు ఇటీవ‌లే స‌మావేశ‌మైన‌ట్లు తెలిసింది. వార‌సుడు సినిమాకు థియేట‌ర్లు ఇవ్వ‌క‌పోతే తెలుగు సినిమాల్ని త‌మిళ‌నాడులో రిలీజ్ కాకుండా అడ్డుకోవాల‌నే ఆలోచ‌న‌లో కోలీవుడ్ వ‌ర్గాలు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

విజ‌య్
విజ‌య్

Varasudu Theatre Issue: ద‌స‌రా, సంక్రాంతి లాంటి కీల‌క‌మైన పండుగ స‌మ‌యాల్లో డ‌బ్బింగ్ సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వ‌కూడ‌దంటూ ఇటీవ‌ల టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మారుతోంది. తెలుగు ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ నిర్ణ‌యాన్ని విజ‌య్ ఫ్యాన్స్‌తో పాటు కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌ప్పుప‌డుతున్నారు.

త‌మిళ్ డ‌బ్బింగ్ సినిమాల‌కు తెలుగు రాష్ట్రాల్లో స‌రైన థియేట‌ర్లు కేటాయించ‌ని ప‌క్షంలో తీసుకోవాల్సిన త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు సంబంధించి ఇటీవ‌లే త‌మిళ సినీ వ‌ర్గాలు ఓ మీటింగ్‌ను ఏర్పాటుచేసిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మావేశం కాబోతున్న‌ట్లు తెలిసింది. తెలుగు ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోలీవుడ్ వ‌ర్గాలు రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఒక‌వేళ త‌మిళ సినిమాల‌కు స‌రైన సంఖ్య‌లో థియేట‌ర్లు ఇవ్వ‌క‌పోతే తెలుగు సినిమాల‌ను కోలీవుడ్‌లో రిలీజ్ కాకుండా అడ్డుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మీటింగ్ ఇదే విష‌యాన్ని చ‌ర్చించుకున్న‌ట్లు స‌మాచారం.

స‌మ‌స్య‌ను పెద్ద‌ది చేస్తున్నారు…

డ‌బ్బింగ్ సినిమా థియేట‌ర్ల వివాదంపై ద‌ర్శ‌కుడు లింగుస్వామి స్పందించారు. చిన్న స‌మ‌స్య‌ను పెద్ద‌ది చేయ‌వ‌ద్ద‌ని, త‌మిళ్‌, తెలుగు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సామ‌ర‌స్యంగా చ‌ర్చించుకొని ప‌రిష్క‌రించుకోవాల‌ని ద‌ర్శ‌కుడు లింగుస్వామి తెలిపాడు.

ఇది ఇలాగే కొన‌సాగితే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని చెప్పాడు. లింగుస్వామి కామెంట్స్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ వ‌ర్గాల్లో వైర‌ల్‌గా మారుతోన్నాయి. టాలీవుడ్‌లో త‌మిళ సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వ‌కుండా అడ్డుకుంటే కోలీవుడ్‌లో తెలుగు సినిమాల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ద‌ర్శ‌కుడు పేర‌ర‌సు చెప్పాడు. విజ‌య్ ఫ్యాన్స్ కూడా టాలీవుడ్‌ ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. విజ‌య్ సినిమాను కావాల‌నే అడ్డుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ నిర్ణ‌యం మంచిదేనా

పాన్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్‌తో సినిమాల ప‌రంగా భాషాప‌ర‌మైన బేధాలు తొల‌గిపోయాయి. ఇదివ‌ర‌కు ఇత‌ర భాష‌ల సినిమాలు డ‌బ్బింగ్ రూపంలో తెలుగులో విడుద‌ల‌య్యేవి. కానీ పాన్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్ వ‌ల‌న ఒకేసారి అన్ని భాష‌ల్లో సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో కేజీఎఫ్, కేజీఎఫ్ -2తో పాటు ప‌లు డ‌బ్బింగ్ సినిమాలు యాభై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి అద్భుత విజ‌యాల్ని అందుకున్నాయి.

డ‌బ్బింగ్ సినిమాల వ‌ల్ల తెలుగు స్ట్రెయిట్ సినిమాల క‌లెక్ష‌న్స్‌పై ప్ర‌భావం ప‌డింది. ఇటీవ‌ల విడుద‌లైన కాంతారా సినిమాకు అద్భుత‌మైన ఆద‌ర‌ణ రావ‌డంతో చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ క‌లెక్ష‌న్స్ త‌గ్గుముఖం ప‌ట్టాయి. కేజీఎఫ్ -2కు పోటీగా తెలుగులో పెద్ద సినిమాల్ని రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు బ‌య‌ప‌డ్డారు. సంక్రాంతి టాలీవుడ్‌లో కీల‌క‌మైన పండుగ కావ‌డంతో స్ట్రెయిట్ సినిమాల క‌లెక్ష‌న్స్‌కు ఇబ్బందులు ఉండ‌కూడ‌ద‌నే ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు స‌మాచారం.

సంక్రాంతి బ‌రిలో టాలీవుడ్ నుంచి వీర‌సింహారెడ్డి, వాల్తేర్ వీర‌య్యసినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల‌కు స‌రైన సంఖ్య‌లో థియేట‌ర్లు ద‌క్కాలంటే డ‌బ్బింగ్ సినిమాల‌ను పండుల‌కు రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ నిర్ణ‌యం తీసుకున్న‌ది. వార‌సుడు సినిమాను దిల్‌రాజు నిర్మించారు. నైజాంతో పాటు సీడెడ్‌, ఆంధ్రా ఏరియాలో చాలా థియేట‌ర్లు అత‌డి ఆధీనంలోనే ఉన్నాయి. వార‌సుడుకు థియేట‌ర్లు ఎక్కువ‌గా కేటాయిస్తే వీర‌సింహారెడ్డి, వాల్తేర్ వీర‌య్య న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది.

కోలీవుడ్‌లో తెలుగు సినిమాల్ని ఆపేస్తే న‌ష్టం ఎవ‌రికి…

టాలీవుడ్‌లో త‌మిళ‌ సినిమాల్ని రిలీజ్ చేయ‌కుండా అడ్డుకుంటే అదే రీతిలో తెలుగు సినిమాల్ని త‌మిళ‌నాడులో రిలీజ్ చేయ‌నివ్వ‌మ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే జ‌రిగి వివాదం ముదిరితే కోలీవుడ్ వ‌ర్గాలే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయే ఆస్కారం ఉంది.సూర్య‌, కార్తి, విశాల్‌, శింబుతో పాటు చాలా మంది కోలీవుడ్ హీరోల‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.

వారు న‌టించిన ప్ర‌తి సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది. కానీ తెలుగు హీరోల‌కు త‌మిళంలో మాత్రం పెద్ద‌గా మార్కెట్ లేదు. తెలుగు సినిమాల్ని త‌మిళ‌నాడులో రిలీజ్ కాకుండా ఆపినా న‌ష్ట‌పోయేది పెద్ద‌గా ఉండ‌దు. అదే త‌మిళ సినిమాల్ని ఆపితే మాత్రం చాలానే న‌ష్టం జ‌రుగుతుంది. అందుకే ఈ వివాదాన్ని పెద్ద‌ది చేయ‌కుండా త‌మిళ వ‌ర్గాలు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నాయి.

IPL_Entry_Point

టాపిక్