OTT Action Thriller: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Sabari OTT Release date: శబరి సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం సుమారు ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన శబరి చిత్రం ఈ ఏడాది మే 3వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి అనిల్ కట్జ్ దర్శకత్వం వహించారు. తన కెరీర్లో ఎక్కువ చిత్రాల్లో నెగెటివ్ పాత్రలు చేసిన వరలక్ష్మి.. ఈ మూవీలో లీడ్ రోల్‍లో నటించారు. కూతురుని కాపాడుకునే తల్లి పాత్ర పోషించారు. శబరి చిత్రం మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. అయితే, కమర్షియల్‍గా సక్సెస్ కాలేకపోయింది.
శబరి మూవీ ఓటీటీలోకి రావడం బాగా ఆలస్యమైంది. అయితే, ఇప్పటికి ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయింది. స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది.
స్ట్రీమింగ్ వివరాలివే.. ఐదు భాషల్లో..
శబరి సినిమా అక్టోబర్ 11వ తేదీన సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ విషయాన్ని సన్‍నెక్స్ట్ అధికారికంగా వెల్లడించింది.
ఐదు నెలల తర్వాత..
శబరి సినిమా థియేటర్లలో రిలీజైన సుమారు ఐదు నెలల తర్వాత సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను తీసుకుందనే రూమర్లు వచ్చాయి. అయినా, ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రాలేదు. అయితే, ఎట్టకేలకు ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో అక్టోబర్ 11న ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు రెడీ అయింది.
శబరి చిత్రాన్ని ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా డైరెక్టర్ అనిల్ కట్జ్ తెరకెక్కించారు. ఈ మూవీతోనే దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు గణేశ్ వెంకటరామన్, మైమ్ గోపి, బేబి కృతిక, శశాంక్ కీలకపాత్రలు పోషించారు.
శబరి చిత్రం ట్రైలర్‌తో మంచి హైప్ తెచ్చుకుంది. అయితే, థియేటర్లలో ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. వరలక్ష్మి నటనకు ప్రశంసలు దక్కినా.. ఓవరాల్‍గా మూవీకి మిక్స్ట్ టాక్ వచ్చింది. దీంతో పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఈ మూవీని మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మించారు. గోపీసుందర్ మ్యూజిక్ అందించారు.
శబరి స్టోరీలైన్
కూతురుని ప్రమాదాల నుంచి ఓ తల్లి కాపాడుకోవడం చుట్టూ శబరి స్టోరీ సాగుతుంది. అరవింద్ (గణేశ్ వెంకటరామన్)ను సంజన (వరలక్ష్మి శరత్ కుమార్) ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఇంట్లో నుంచి బయటికి వచ్చి అతడిని పెళ్లాడుతుంది. అయితే అరవింద్‍కు మరో అమ్మాయితో సంబంధం ఉందని తెలుస్తుంది. దీంతో తన కూతురు రియా (బేబి కృతిక)తో కలిసి ముంబైకు వెళ్లిపోతుంది. స్నేహితుడి సాయంతో ఉద్యోగంలో చేరుతుంది సంజన. ఈ ఆ తర్వాత కూతురు రియా గురించి ఆమెకు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. సూర్య (మైమ్ గోపీ) అనే వ్యక్తి సంజన, రియా కోసం వెతుకుతుంటాడు. రియా గురించి సంజనకు తెలిసిన నిజమేంటి? ఆమె గతం ఏంటి? వీరిని సూర్య ఎందుకు వెతుకుతాడు? రియాను సంజన కాపాడుకాందా? అనే విషయాలు శబరి మూవీలో ఉంటాయి. ఈ మూవీలో ట్విస్టులు బాగానే ఉన్నా.. నరేషన్‍పై మిశ్రమ స్పందన వచ్చింది.