Vadhandhi Web Series Review: వదంది వెబ్ సిరీస్ రివ్యూ - ఎస్‌జే సూర్య నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే
Vadhandhi Web Series Review: ఎస్‌జే సూర్య , లైలా, సంజన ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ వెబ్‌సిరీస్ వదంది ది ఫేబుల్ ఆఫ్ వెలోని. ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఈ సిరీస్ ఎలా ఉందంటే...
Vadhandhi Web Series Review: దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి ఆపై నటుడిగా మారారు ఎస్‌జే సూర్య (SJ Surya). విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూ తొలిసారి నటించిన వెబ్‌సిరీస్ వదంది ది ఫేబుల్ ఆఫ్ వెలోని(Vadhandhi Web Series). ఎనిమిది ఎపిసోడ్స్‌తో తమిళంలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ను విక్రమ్ వేద దర్శకద్వయం పుష్కర్ గాయత్రి నిర్మించారు. ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించారు. సీనియర్ హీరోయిన్ లైలాతో పాటు సంజన ప్రధాన పాత్రల్లో నటించారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ (Amazon prime video) ఓటీటీలో రిలీజైంది. తెలుగు భాషలోనూ ఈ వెబ్‌సిరీస్ అందుబాటులో ఉంది.
ట్రెండింగ్ వార్తలు
వెలోని మర్డర్ మిస్టరీ…
సినిమా షూటింగ్ కోసం కన్యాకుమారికి వచ్చిన ప్రముఖ హీరోయిన్ మమత అనుమానాస్పద రీతిలో హత్యకు గురవుతుంది. ఆమె మర్డర్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. కానీ హత్యకు గురైంది మమత కాదని కన్యాకుమారి ప్రాంతానికే చెందిన వెలోని(సంజన) అనే నిజం పోలీసులకు తెలుస్తుంది. ఈ హత్య కేసు ఇన్వెస్టిగేషన్‌ను ఇన్‌స్పెక్టర్ వివేక్ (ఎస్‌జే సూర్య) చేపడతాడు. వెలోని తల్లి రూబీ (లైలా) ఏంజెల్ పేరుతో ఓ లాడ్జ్ నిర్వహిస్తుంటుంది.
తొలుత వెలోనిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న విఘ్నేష్‌ను హంతకుడిగా పోలీసులు అనుమానిస్తారు. కానీ వెలోని దూరమైన బాధలో అతడు అత్మహత్య చేసుకుంటాడు. మరోవైపు వెలోనికి చాలా మందితో పుకార్లు ఉన్నాయని ప్రచారం జరుగుతుంటుంది. దాంతో ఈ కేసు వివేక్‌కు ఛాలెంజింగ్‌గా మారుతుంది. వెలోనిని హత్య చేసింది ఎవరు? ఆమె గురించి సమాజంలో ఉన్న పుకార్లలో నిజమెంత ఉంది? వెలోని మర్డర్‌కేసును సాల్వ్ చేసే క్రమంలో వివేక్ ఎలాంటి సంఘర్షణకు లోనయ్యాడు? అన్నదే వదంది కథ.
పుకార్ల చుట్టూ తిరిగే కథ…
వదంది అంటే తమిళంలో పుకారు అని అని అర్థం. నిజం నోరు దాటే లోగా అబద్దం ఊరు దాటేస్తుంది అంటూ ఈ సినిమాలో ఎస్‌జే సూర్య ఓ సందర్భంలో డైలాగ్ చెబుతాడు. ఈ సిరీస్ మొత్తం ఓ అమ్మాయి జీవితం చుట్టూ నెలకొన్న అబద్దపు పుకార్ల చుట్టూ తిరుగుతుంది.
ప్రేమ, ఓదార్పు కోసం పరితపించే ఓ అందమైన అమ్మాయికి సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లను అర్థవంతంగా చూపించారు. కళ్లతో చూడకుండా వాస్తవాలు ఏమిటో తెలియకుండా కట్టు కథలు అల్లుతూ చేసే అబద్ధపు ప్రచారాల వల్ల ఎదురయ్యే అనర్థాల్ని ఆలోచనాత్మకంగా ఆవిష్కరించిన సిరీస్ ఇది.
ప్రతి ఎపిసోడ్ థ్రిల్లింగ్...
హీరోయిన్ మమత హత్యకు గురయ్యే సీన్‌తోనే సిరీస్ మొదలవుతుంది. ఆ తర్వాత హత్య చేయబడింది మమత కాదని తెలుస్తుంది. ఆమె వెలోని అని పోలీసులు కనిపెట్టే సీన్‌తో ఫస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఆ తర్వాత రెండో ఎపిసోడ్‌లో వివేక్ ఎంట్రీ ఇవ్వడంతో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొదలుపెట్టారు డైరెక్టర్. వెలోని చుట్టు ఉన్నవాళ్లు, ఆమెతో పరిచయం ఉన్నవాళ్లు అంటూ ఒక్కో కొత్త పాత్రను తెరపైకి తీసుకురావడం, వారికి వివేక్ అనుమానించడం, ఈ క్రమంలో వెల్లడయ్యే నిజాలతో ప్రతి ఎపిసోడ్‌ను థ్రిల్లింగ్‌గా నడిపించాడు దర్శకుడు లూయిస్.
స్నేహితుడు చెప్పిన అబద్దం వల్ల తన ప్రియురాలికి దూరమైన వివేక్ అలాంటి తప్పు వెలోని విషయంలో జరగకూడదని ఈ కేసును పర్సనల్‌గా తీసుకోవడం, ఈ క్రమంలో తన ఫ్యామిలీ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను కథలో అంతర్భాగంగా ఆవిష్కరించిన తీరు బాగుంది. చివరికి ఈ హత్య ఎవరు చేశారనేది ఊహించని రీతిలో సర్‌ప్రైజ్ ట్విస్ట్ ఇస్తూ సిరీస్‌ను ముగించాడు.
సూర్య రియలిస్టిక్ యాక్టింగ్..
వివేక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎస్‌జే సూర్య రియలిస్టిక్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. అమాయకపు ఆడపిల్లకు అన్యాయం చేసిన వ్యక్తిని శిక్షించడం కోసం అనుక్షణం ఆరాటపడే పోలీస్ ఆఫీసర్‌గా అతడి నటన ఆకట్టుకుంటుంది. కూతురుని అర్థం చేసుకోలేని తల్లిగా లైలా కనిపించింద. క్లైమాక్స్‌లో ఆమె క్యారెక్టర్‌లో వచ్చే ట్విస్ట్ సిరీస్‌కు హైలైట్‌గా నిలుస్తుంది.
సెబాస్టియన్ అనే రచయితగా నాజర్ కనిపించాడు. అలవాటైన పాత్ర కావడంతో సింపుల్‌గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. వెలోనిగా సంజన, రామర్‌గా వివేక్ ప్రసన్న నటన బాగుంది. ఎస్‌జే సూర్య భార్యగా స్మృతి వెంకట్ ఎమోషనల్ యాక్టింగ్‌తో మెప్పించింది. సైమన్ కే కింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సిరీస్ లోని సస్పెన్స్ ఫీల్‌ను మరింత ఎలివేట్ చేసింది.
Vadhandhi Web Series Review- ఎనిమిది ఎపిసోడ్స్...
వదంది మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో కూడిన సిరీస్. నెమ్మదిగా సాగే కథనం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వడం కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎస్‌జే సూర్య యాక్టింగ్‌తో పాటు కథ, కథనాలు ఆ లోపాలను కనిపించకుండా చేశాయి. ఆలోచనను రేకెత్తించే మిస్టరీ థ్రిల్లర్‌గా వదంది ఫ్రెష్ ఫీల్‌ను కలిగిస్తుంది.