Donald Trump In Movies: సినిమాల్లో క్యామియో రోల్ నుంచి అమెరికా అధ్యక్షుడిగా ఎదిగిన డోనాల్డ్ ట్రంప్.. మధ్యలో బోలెడు షోలు!
US Election Results 2024: సినిమాల్లో క్యామియో రోల్స్ చేసిన డొనాల్డ్ ట్రంప్.. రియాలిటీ షోస్‌కి హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. అప్పట్లో ఒక్కో ఎపిసోడ్‌కి ట్రంప్ ఎంత ఛార్జ్ చేసేవారంటే?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ను ఓడించిన 78 ఏళ్ల ట్రంప్.. రిపబ్లికన్ పార్టీ జయకేతనం ఎగురవేశారు. ట్రంప్ స్వింగ్ స్టేట్స్‌లో దూసుకెళ్లడంతో విజయం ఏకపక్షంగా ముగిసింది.
డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన అమెరికా అధ్యక్షులలో ఒకరు, ఎందుకంటే అతను వృత్తిరీత్యా రాజకీయ నాయకుడు కాదు. సినిమాల్లో క్యామియో రోల్‌తో వెలుగులోకి వచ్చిన ట్రంప్.. టీవీ షోలతో ప్రజాదరణ పొంది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
రియల్ ఎస్టేట్ టు సినిమాలు
80వ దశకంలో న్యూయార్క్‌లో రియల్ ఎస్టేట్ మొఘల్‌గా పేరొందిన డొనాల్డ్ ట్రంప్..చాలా సినిమాల్లో అతిథి పాత్రలను పోషించారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. రియాలిటీ షోస్‌లోనూ సందడి చేశారు. డొనాల్డ్ ట్రంప్ మొదటగా 1989లో గాస్ట్స్ కాన్ట్ డూ ఇట్ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత హోమ్ అలోన్-2లోనూ క్యామియో రోల్ చేశారు.
1994లో వచ్చిన లిటిల్ రాస్కెల్స్, జూలాండర్, ది అసోసియేట్ వంటి పాపులర్ సినిమాల్లో ట్రంప్ నటించారు. 90వ దశకంలో, అతను హోవార్డ్ స్టెర్న్ షోలో 24 సార్లు కనిపించడంతో.. ట్రంప్ పాపులారిటీ అమెరికాలో బాగా పెరిగిపోయింది. 2003లో ట్రంప్ ‘ది అప్రెంటిస్’ అనే రియాలిటీ షోకు హోస్ట్ కమ్ నిర్మాతగా వ్యవహరించారు.
ఎపిసోడ్‌కి 3 మిలియన్ డాలర్లు
అప్పట్లో ఏదైనా రియాలిటీ షోలో ప్రతి ఎపిసోడ్‌కి 3 మిలియన్ డాలర్లని ట్రంప్ సంపాదించారు. ఇది ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ సెలబ్రిటీలలో ఒకరిగా ట్రంప్‌ని నిలబెట్టింది. ఆ సంపాదనతో ట్రంప్ పేరు అప్పట్లో మార్మోగిపోయింది.
2016లో అధ్యక్ష పదవికి ట్రంప్ పోటీపడినప్పుడు చాలా మంది దాన్ని జోక్‌గా అభివర్ణించారు. కానీ.. ట్రంప్ గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీవీ స్టార్‌గా తాను పెంచుకున్న నైపుణ్యాలను ట్రంప్ తన ప్రచార ప్రసంగాల్లో ఉపయోగించి సంప్రదాయవాద అమెరికా సిటిజన్స్‌ని కట్టిపడేశాడు. 2024లోనూ అదే పంథాన్ని అనుసరించిన ట్రంప్ మళ్లీ విజయం సాధించారు.
ట్రంప్ అరుదైన రికార్డ్
ఓడిపోయిన నాలుగేళ్ల తర్వాత ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కాగలిగాడంటే.. అది అతని కల్ట్ ఫాలోయింగ్‌కి నిదర్శనం. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు ఒకసారి అధ్యక్షుడిగా చేసి.. ఆ వెంటనే ఓడిపోయి.. మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో నేతగా ట్రంప్ రికార్డ్ నెలకొల్పాడు. 1892లో చివరిగా గ్రోవెర్ క్లీవ్‌ల్యాండ్ ఈ ఘనత సాధించాడు.