Urvasivo Rakshasivo Movie Review: ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ - అల్లు శిరీష్ సినిమా ఎలా ఉందంటే-urvasivo rakshasivo movie review allu sirish anu emmanuel s romantic movie review telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Urvasivo Rakshasivo Movie Review Allu Sirish Anu Emmanuel's Romantic Movie Review Telugu

Urvasivo Rakshasivo Movie Review: ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ - అల్లు శిరీష్ సినిమా ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Nov 04, 2022 12:32 PM IST

Urvasivo Rakshasivo Movie Review: అల్లు శిరీష్ (Allu shirish)అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టించిన చిత్రం ఊర్వ‌శివో రాక్ష‌సివో. రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఎలా ఉందంటే...

అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌
అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌

Urvasivo Rakshasivo Movie Review: ఘ‌న‌మైన సినీ నేప‌థ్య‌మున్న హీరోగా మాత్రం కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ అందుకోలేక‌పోయాడు అల్లు శిరీష్‌. దాదాపు మూడేళ్ల విరామం త‌ర్వాత ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమాతో అల్లు శిరీష్ మ‌రోమారు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. అర్బ‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టించింది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ధీర‌జ్ మొగిలినేని, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకోవాల‌నే త‌ప‌న‌తో మోడ్ర‌న్ ల‌వ్‌స్టోరీ ఎంచుకొని అల్లు శిరీష్ చేసిన ఈ ప్ర‌య‌త్నం తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా? శిరీష్‌కు ద‌ర్శ‌కుడు రాకేష్ శ‌శి స‌క్సెస్‌ ఇచ్చాడా లేదా అన్న‌ది చూద్దాం…

Urvasivo Rakshasivo Movie plot -భిన్న మ‌న‌స్త‌త్వాల జంట క‌థ‌...

శ్రీకుమార్ (అల్లు శిరీష్‌) మిడిల్ క్లాస్ అబ్బాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ప‌నిచేస్తుంటాడు. త‌న ప‌క్క ఆఫీస్‌లో ప‌నిచేసే సింధూజను (అను ఇమ్మాన్యుయేల్‌) దూరం నుంచే చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. అనుకోకుండా శ్రీ ఆఫీస్‌లోనే సింధూజ జాయిన్ అవుతుంది. కొద్ది ప‌రిచ‌యంలోనే సింధుతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. శ్రీకి పూర్తి భిన్నమైన మ‌స‌స్త‌త్వం సింధూజది. శ్రీ ట్రెడిష‌న‌ల్‌గా ఆలోచిస్తే సింధూజ మాత్రం మోడ్ర‌న్‌గా బ‌త‌కాల‌ని కోరుకుంటుంది. ప్రేమ‌, పెళ్లి లాంటి బంధాలతో సంబంధం లేకుండా లివింగ్ రిలేష‌న్‌షిప్‌లో ఉందామ‌ని కండీష‌న్ పెడుతుంది.

శ్రీ మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుందామ‌ని అంటాడు. కొద్ది రోజులు లివింగ్ రిలేష‌న్‌షిప్‌లో ఉంటే సింధూజ మారిపోతుంద‌ని భావించిన శ్రీ ఆమె ప్ర‌పోజ‌ల్‌కు ఒప్ప‌కుంటాడు. సింధుతో స‌హ‌జీవ‌నం చేస్తున్న విష‌యాన్ని శ్రీ త‌న‌ త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర దాస్తాడు. భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాల కార‌ణంగా శ్రీ, సింధు ప్రేమాయ‌ణంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? పెళ్లి త‌న క‌ల‌ల‌కు అడ్డంకి అని భావించిన సింధు మ‌న‌సు మారిందా? సింధుతో ప్రేమ‌ను త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర దాచ‌డం వ‌ల్ల శ్రీ ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు? చివ‌ర‌కు శ్రీ, సింధు ఒక్క‌ట‌య్యారా లేదా అన్న‌దే ఈసినిమా క‌థ‌.

లివింగ్ రిలేష‌న్ కాన్సెప్ట్‌…

లివింగ్ రిలేష‌న్ షిప్ అనే కాన్సెప్ట్ చాలా సున్నిత‌మైన అంశం. ఈ పాయింట్‌ను డీల్ చేస్తూ సినిమా చేయ‌డం అంటే క‌త్తిమీద సాములా ఉంటుంది. పూర్తిగా హ‌ద్దులు దాటితే బూతులా మారిపోతుంది. ఆ లైన్ దాట‌కుండా అటు యూత్‌ను మెప్పించేలా ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు రాకేష్ శ‌శి.

కామెడీ బ‌లం

మోడ్ర‌న్ రిలేష‌న్స్‌తో కూడిన ఈ సినిమాను ఓవ‌ర్ సెంటిమెంట్‌తో మెలో డ్రామాగా మ‌ల‌చకుండా కామెడీకి ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తూ టైమ్ పాస్ చేశారడు. ప్ర‌తి సీన్ నుంచి ఫ‌న్‌ జ‌న‌రేట్ అయ్యేలా చూసుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు. పూర్తిగా అపోజిట్‌గా ఆలోచించే ఓ జంట ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుంద‌నే పాయింట్‌తో సినిమా ఇంట్రెస్టింగ్‌గా మొద‌ల‌వుతుంది.

ప‌బ్ క‌ల్చ‌ర్‌, ఫేజ్ త్రీ లైఫ్ స్టైల్ బొత్తిగా తెలియ‌ని అమాయ‌కుడికి ఆ వాతావ‌ర‌ణంలో ఇమ‌డ‌లేక ప‌డే ఇబ్బందుల నుంచి కామెడీని రాబ‌ట్టుకుంటూ క‌థ‌లోని వెళ్ల‌డం బాగుంది. లివింగ్ రిలేష‌న్‌లో ఉంటూ త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర ఆ బంధాన్ని దాచ‌డం కోసం హీరో ప‌డే క‌ష్టాల‌న్నీ న‌వ్వుల‌ను పంచాయి. సీరియ‌స్‌గా క‌థ మారుతుంద‌నే ప్ర‌తి సంద‌ర్భంలో ఏదో ఒక సిట్యూవేష‌న‌ల్ కామెడీని క్రియేట్ చేస్తూ ఆడియెన్స్ బోర్‌గా ఫీల‌వ్వ‌కుండా చేయ‌గ‌లిగాడు డైరెక్ట‌ర్‌. సునీల్‌, వెన్నెల కిషోర్ కామెడీ ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమాను నిల‌బెట్టింది.

లిప్‌లాక్‌లు ఎక్కువే...

ఇలాంటి మోడ్ర‌న్ ల‌వ్‌స్టోరీల‌లో లిప్‌లాక్‌ల‌కు కామ‌న్‌. కానీ ఒక‌టి రెండు లిప్‌లాక్‌ల‌కు ప‌రిమితం కాలేదు ద‌ర్శ‌కుడు. ప‌దికిపైగా లిప్‌లాక్‌ల‌తో నాయ‌కానాయిక‌ల రొమాన్స్‌ను గాఢంగా చూపించారు. అవ‌న్నీ బీ, సీ వ‌ర్గాల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి బాగానే ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

త‌మిళ రీమేక్‌...

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ప్యార్ ప్రేమ కాద‌ల్ ఆధారంగా ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమాను తెర‌కెక్కించారు. మాతృక‌ను పూర్తిగా య‌థాత‌థంగా ఫాలో అయ్యారు. డ‌బుల్ మీనింగ్స్ డైలాగ్స్ కొన్ని చోట్ల ఇబ్బంది పెడ‌తాయి. హీరోయిన్ ఆలోచ‌న విధానంలో మార్పు వ‌చ్చే సీన్స్ క‌న్వీన్సింగ్‌గా లేవు.

అల్లు శిరీష్ మెచ్యూర్డ్ యాక్టింగ్‌...

మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో అల్లు శిరీష్ ఆక‌ట్టుకున్నాడు. న‌టుడిగా అత‌డిని మ‌రో మెట్టు ఎక్కించే సినిమా ఇది. ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో బాగా న‌టించాడు. గ్లామ‌ర్ ప‌రంగా అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) ఆక‌ట్టుకుంది. హీరో స్నేహితుడిగా వెన్నెల‌కిషోర్ (Vennela kishore) కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. వెబ్‌సిరీస్ టైటిల్స్ చెబుతూ అత‌డు చేసే కామెడీ బాగుంది.

హీరో మావ‌య్య పాత్ర‌లో సునీల్ (Sunil) కామెడీ వ‌ర్క‌వుట్ అయ్యింది. హీరో త‌ల్లిదండ్రులుగా ఆమ‌ని, కేదార్ శంక‌ర్ సెటిల్డ్‌గా న‌టించారు. మోడ్ర‌న్ ఫాద‌ర్‌గా పృథ్వీ క‌నిపించాడు.

అచ్చు రాజ‌మ‌ణి పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాట‌ల‌ను క‌ల‌ర్‌ఫుల్‌గా తీశారు. చిన్న సినిమా అయినా ఆ ఫీల్ రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు.

ఫుల్ ఫ‌న్‌-Urvasivo Rakshasivo Movie Review:

ఊర్వ‌శివో రాక్ష‌సివో ప‌క్కా యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. రెండు గంట‌లు ఫుల్ టైమ్ పాస్ చేస్తుంది. టికెట్ డ‌బ్బుల‌కు స‌రిప‌డా వినోదాన్ని అందిస్తుంది.

రేటింగ్: 3/5

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.