ఉప్పు క‌ప్పురంబు రివ్యూ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన కీర్తి సురేష్ తెలుగు మూవీ ఎలా ఉందంటే?-uppu kappurambu movie review keerthy suresh suhas comedy drama movie now streaming on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఉప్పు క‌ప్పురంబు రివ్యూ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన కీర్తి సురేష్ తెలుగు మూవీ ఎలా ఉందంటే?

ఉప్పు క‌ప్పురంబు రివ్యూ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన కీర్తి సురేష్ తెలుగు మూవీ ఎలా ఉందంటే?

HT Telugu Desk HT Telugu

కీర్తి సురేష్, సుహాస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఉప్పుక‌ప్పురంబు మూవీ శుక్ర‌వారం (జూలై 4న‌)అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఈ కామెడీ డ్రామా మూవీ ఎలా ఉందంటే?

కీర్తి సురేష్, సుహాస్

లాంగ్ గ్యాప్ త‌ర్వాత కీర్తి సురేష్ తెలుగులో న‌టించిన ఉప్పు క‌ప్పురంబు మూవీ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలోకి వ‌చ్చింది. సుహాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ మూవీకి ఐవీ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జూలై 4న (శుక్ర‌వారం)అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. కీర్తి సురేష్ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అంటే?

స్మశానం సమస్య…

చిట్టి జ‌య‌పురం ఊరి పెద్ద (శుభ‌లేక సుధాక‌ర్‌) హ‌ఠాత్తుగా చ‌నిపోతాడు. తండ్రి స్థానంలో ఊరి పెద్ద‌గా త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అపూర్వ (కీర్తి సురేష్‌) బాధ్య‌త‌లు చేప‌డుతుంది. అపూర్వ‌కు అధికారం ద‌క్క‌డం భీమ‌య్య (బాబు మోహ‌న్‌) , మ‌ధుబాబు(శ‌త్రు)ల‌కు ఇష్టం ఉండ‌దు. అపూర్వ ఇబ్బందులు పెట్టి ఆమె నుంచి అధికారం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ఆ ఊరి స్మ‌శానం రూపంలో అపూర్వ‌కు పెద్ద స‌మ‌స్య ఎదుర‌వుతుంది. స్మ‌శానంలో న‌లుగురిని మాత్ర‌మే పూడ్చిపెట్ట‌డానికి స్థ‌లం మిగిలిపోయి ఉంద‌ని అపూర్వ తో కాటికాప‌రి చిన్న (సుహాస్‌) చెబుతాడు. ఆ స్థ‌లం కోసం గ్రామ‌స్థులు పోటీప‌డ‌టంతో గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి.

న‌లుగురికే కాకుండా మ‌రొక‌రిని పూడ్చిపెట్టేందుకు స్థ‌లం ఉన్నా ఆ విష‌యాన్ని చిన్న ఎందుకు దాచిపెట్టాడు? త‌న త‌ల్లి కోరికను చిన్న నెర‌వేర్చాడా? స్మ‌శానం విష‌యంలో ఎదురైన స‌మ‌స్య‌ను అపూర్వ ఎలా ప‌రిష్క‌రించింది? ఊళ్లో గొడ‌వ‌ల‌కు ఎలా పుల్‌స్టాప్ పెట్టింది? అన్న‌దే ఉప్పుక‌ప్పురంబు మూవీ క‌థ‌.

యూనిక్ పాయింట్‌..

సిల్వ‌ర్ స్క్రీన్‌పై అన్ని క‌థ‌ల‌ను చెప్ప‌లేం. కొన్ని స్టోరీస్ థియేట‌ర్ల‌కు స‌రిప‌డ‌వు. అలాంటి క‌థ‌లు చెప్ప‌డానికి ఓటీటీ మంచి వేదిక‌గా మారింది. ఉప్పుక‌ప్పురంబు అలాంటి సినిమానే. స్మ‌శానం భూమి కొర‌త, స‌మాధుల స్థ‌లం కోసం ఊరివాళ్లు పోటీప‌డ‌టం అనే పాయింటే డిఫ‌రెంట్‌గా ఉంది. నిజానికి నేటికి చాలా ఊళ్ల‌లో ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంది. ఈ యూనిక్ పాయింట్‌ను సీరియ‌స్‌గా కాకుండా ఫ‌న్నీగా ఈ సినిమాలో చూపించారు డైరెక్ట‌ర్ ఐవీ శ‌శి. అంత‌ర్లీనంగా మంచి మెసేజ్ ఇచ్చారు. సిట్యూవేష‌న‌ల్‌గా కామెడీని రాబ‌ట్ట‌డుతూ ఆడియెన్స్‌ను న‌వ్వించ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

ఫ‌న్‌...ఎమోష‌న్స్‌...

తండ్రి మ‌ర‌ణంతో ఊరి పెద్ద‌గా అపూర్వ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం, త‌న‌కున్న భ‌యాన్ని క‌వ‌ర్ చేసుకుంటూ ర‌చ్చ‌బండ నిర్వ‌హించ‌డం లాంటి స‌న్నివేశాల నుంచి చ‌క్క‌టి ఫ‌న్ జ‌న‌రేట్ అయ్యింది. మ‌రోవైపు అపూర్వ‌ను ఇబ్బంది పెట్టేందుకు భీమ‌య్య‌, మ‌ధు చేసే ప్ర‌య‌త్నాల‌ను వినోదాత్మ‌కంగానే చూపించారు.

ఎప్పుడైతే స్మ‌శానం స‌మ‌స్య తెర‌పైకి వ‌స్తుందో అక్క‌డి నుంచే క‌థ గాడిన ప‌డింది. స్మ‌శాన స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కోసం కీర్తి సురేష్‌, అమ్మ స‌మాధి స్థ‌లం కోసం సుహాన్ ప‌డే సంఘ‌ర్ష‌ణ‌ను ఎమోష‌న‌ల్‌గా తీర్చ‌దిద్దారు. ము స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు అపూర్వ‌, చిన్న‌ చేసే ప్ర‌య‌త్నాల వ‌ల్ల‌ మ‌రో కొత్త ప్రాబ్లెం తెర‌పైకి రావ‌డం ఈ క్ర‌మంలో ఎదుర‌య్యే క‌న్ఫ్యూజ‌న్స్ న‌వ్విస్తాయి. క్లైమాక్స్‌ను ఉద్వేగ‌భ‌రితంగా రాసుకున్నారు. ఊరి కోసం అపూర్వ‌, చిన్న తీసుకునే నిర్ణ‌యాన్ని క‌న్వీన్సింగ్‌గా చూపించారు.

అదే మైన‌స్‌...

ఉప్పుక‌ప్పురంబు కోసం డైరెక్ట‌ర్ ఎంచుకున్న పాయింట్ చిన్న‌ది కావ‌డం సినిమాకు మైన‌స్‌గా మారింది. కథ ఒకే చోట తిరుగుతూ ఎంత‌కు ముందుకు సాగ‌ని ఫీలింగ్ క‌లుగుతుంది. కామెడీలో నాచురాలిటీ మిస్స‌యింది.

ఊరి పెద్ద‌గా...

రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ పాత్ర‌ల‌కు భిన్నంగా ఇందులో కీర్తి సురేష్ క‌నిపించింది. ఊరి పెద్ద‌గా సెటిల్డ్ యాక్టింగ్‌తో మె ప్పించింది. కాటి కాప‌రిగా త‌న కామెడీ టైమింగ్‌తో సుహాన్ మెప్పించాడు. కీర్తి సురేష్‌తో పాటు సినిమా మొత్తం అత‌డి క్యారెక్ట‌ర్ క‌నిపిస్తుంది. బాబు మోహ‌న్‌, శ‌త్రు కూడా త‌మ ప‌రిధుల మేర మెప్పించారు.

డిఫ‌రెంట్ పాయింట్‌...

ఉప్పు క‌ప్పురంబు డిఫ‌రెంట్ పాయింట్‌తో వ‌చ్చిన ఎంట‌ర్‌టైనింగ్ మూవీ. కీర్తి సురేష్, సుహాన్ న‌ట‌న కోసం చూడొచ్చు.

రేటింగ్‌: 3/5

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.